Antaryami: దృష్టి కోణం

కొన్ని ప్రత్యేకతల వల్ల సాధారణ విషయం సైతం విశేషత్వాన్ని సంతరించుకుంటుంది. దీన్నే ‘గురి కుదిరితే గులకరాయైనా గుడిలో దైవంలా కనబడుతుంది’ అంటారు తత్వజ్ఞులు. సామాన్యంగా ఉన్నప్పటి స్థితికి, ప్రత్యేకత సంతరించుకున్నప్పటి స్థితికి చాలా తేడా వచ్చేస్తుంది.

Updated : 07 Aug 2022 02:18 IST

కొన్ని ప్రత్యేకతల వల్ల సాధారణ విషయం సైతం విశేషత్వాన్ని సంతరించుకుంటుంది. దీన్నే ‘గురి కుదిరితే గులకరాయైనా గుడిలో దైవంలా కనబడుతుంది’ అంటారు తత్వజ్ఞులు. సామాన్యంగా ఉన్నప్పటి స్థితికి, ప్రత్యేకత సంతరించుకున్నప్పటి స్థితికి చాలా తేడా వచ్చేస్తుంది. అప్పుడు వాటిని తేలిగ్గా చూడటం, సులభంగా పొందడం, మామూలుగా దగ్గరకు చేరడం కుదరదు.

చెట్టు నుంచి కోసి తినే పండు కడుపు నింపుతుంది. దానితో ఒక్కరి ఆకలి మాత్రమే తీరవచ్చు. అంతకంటే మరే అనుభూతినీ ఇవ్వదు. అదే పండును దేవుడికి నివేదన చేస్తే ప్రసాదం అవుతుంది. చిన్న ముక్కలుగా చేసి ఎందరికి పంచినా స్వీకరించే వారందరికీ ‘భగవంతుడి అనుగ్రహం పొందగలిగాం’ అనే అనుభూతికి లోనయేట్టు చేస్తుంది. ఆ తృప్తి జీవితాన ఉత్సాహాన్ని నింపుతుంది.

ఏ ఆశయం లేకుండా గంగానదిలో స్నానం చేసినా, అది సాధారణ స్నాన జలమే అవుతుంది. మామూలు చోట స్నానం లాగానే అక్కడా స్నానం చేసేవారికి అంతకంటే అందులో ఏ ప్రత్యేకతా కనిపించదు. గంగ నుంచే కాకుండా ఏ ఇతర జల వనరు నుంచి తెచ్చిన నీటినైనా శంఖంలో పోస్తే అది తీర్థం అనిపించుకుంటుంది. పవిత్రమైనదనే భావనను కలిగిస్తుంది. చుక్కలుగా అరచేతిలో పడిన ఆ ఉద్ధరిణెడు బిందువులనే ‘తీర్థప్రసాదం’ అంటారు. అది స్వీకరించిన వారికి మనోబలాన్ని పెంచుతుంది. సంతృప్తిని ఇస్తుంది. సాధారణ గరిక(గడ్డి)నే వినాయక చవితి నాడు ఆయనకు పూజాద్రవ్యంగా సమర్పిస్తే పవిత్రతను సంతరించుకుంటుంది. విఘ్నేశ్వరుడికి ప్రీతిపాత్రమైన పత్రిగా ప్రసిద్ధి పొందింది ఆ గరికే.

రోజుల్లో సైతం ఒకే రోజు ఒకరికి స్మరణ దినం. మరొకరికి సంబరదినం, ఇంకొకరికి పర్వదినం కావచ్చు. ఆయా వ్యక్తుల అనుభవాలు, అనుభూతులే దాన్ని నిర్ధారిస్తాయి. మనిషి జీవితం కూడా అంతే. సాధారణంగా గడుపుతూ పోతే కాలమే గడిచి పోతుంది. కొన్నాళ్ళకు ఆయువూ తీరిపోతుంది.

అదే మనిషి ఏదైనా ఘనత సాధిస్తే, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటే... మహనీయుడు, స్ఫూర్తిదాత, మార్గదర్శి, ఆదర్శ పురుషుడు... ఇలా ఎన్నో అవుతాడు. పదవి, అధికారం లాంటివి వచ్చిన వారు నిన్నటి వరకు నీతో కలిసి మెలిసి తిరిగిన వారే కావచ్చు. కానీ ఒక రోజులోనే మీ మీ స్థానాల్లో చాలా తేడా వచ్చేస్తుంది.

‘మరి అలాంటప్పుడు అందరికీ ప్రసాదం, తీర్థం దొరుకుతాయా... అందరూ పండుగ చేసుకోగలరా, అందరూ మహనీయులు కాగలరా?’ అనే ఆలోచన రావచ్చు. అందుకోసమే నీటినంతటినీ తీర్థంగా, పదార్థాలనన్నింటినీ  భగవత్ప్రసాదంగా, ప్రతి రోజునూ పండుగలా చూడటం అలవాటు చేసుకోవాలి. అది మనోభావన మీదే ఆధారపడి ఉంటుంది అంటారు బోధకులు, సాధకులు.

అలా ప్రతి పదార్థాన్నీ ప్రసాదంగా భావించిన నాడు దుబారా, దుర్వినియోగం తగ్గుతాయి. ప్రతి నీటినీ తీర్థంగా భావించిన నాడు నీటిని కలుషితం చేయడానికి వెనకాడతారు. ప్రతి రోజునూ పండుగగా భావించిననాడు మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా అనుకూల భావనలతో జీవిస్తారు. తోటి వారందరినీ భగవత్స్వరూపులుగా భావించిన నాడు లోకంలో విద్వేషాలు, విభేదాలు లేకుండా ‘వసుధైక కుటుంబం’ అనిపించుకుంటుంది. అప్పుడు ‘స్వర్గమంటే ఎక్కడో లేదు. ఆ లోకం ఇదే’ అనిపిస్తుంది. ‘దృష్టి కోణం మారితే, సృష్టి కోణం మారుతుంది’ అనే మాటకు అర్థం ఇదే.

- అయ్యగారి శ్రీనివాస రావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని