Published : 14 Aug 2022 01:10 IST

దేనికీ అహంకారం?

నిత్య వికాసమే జీవితం. అహంకారం, సంకుచితత్వమే మరణం. సుఖాలకై ఆరాటపడుతూ స్వలాభం అహమే పరమావధిగా సుప్తావస్థలో జీవించే స్వార్థపరుడికి నరకంలోనే స్థానం అన్నది ఉపనిషత్‌ వ్యాఖ్య. నేను, నాది నావారు, పెరవారు అనేభావన చాలా ప్రమాదకరమని ఉపనిషత్తులు తెలియజెబుతున్నాయి. స్వార్థపరత్వమే అహంకారానికి ప్రాతిపదిక. పురాణాల్లో, ఇతిహాసాల్లో, చరిత్రపుటల్లో అహంకారంతో విర్రవీగినవారి గురించి చదువుకొని తెలుసుకున్నాం. అయినా అహంకరిస్తూనే ఉన్నామంటే మనిషి ఎంత బలహీనుడో అర్థం అవుతుంది. రామాయణం చదివి, రావణుడిలా ప్రవర్తించే మానవులనెందరినో మనం చూస్తూనే ఉన్నాం. శ్రీకృష్ణుడి గురించి తెలిసి కూడా అసూయా ద్వేషాలతో ప్రవర్తించి అసువులు బాసిన శిశుపాలుడు అసూయా గర్వాలకు మరో పేరు. అయినా ఈ మానవ సమాజంలో శిశుపాలుడి లాంటివారు నేటికీ కనిపిస్తూనే ఉన్నారు.

మంచి చెప్పేవారే మనవారు. మన మేలుకోరేవారు నిస్వార్థపరులు. మనం చెడిపోతే సంతోషించేవారు స్వార్థపరులు. ఇలాంటివారిలోనే అహంకారం నిండి ఉంటుంది. ఫల్గుణుడు, శ్రీకృష్ణుడు ఎంతోకాలం సన్నిహితులుగా మెలిగారు. రణరంగం మధ్యలో రథాన్ని నిలిపి గీతను బోధిస్తున్నప్పుడు పార్థసారథి తన చెలికాడే కదా... ఈయన చెప్పేది తానెందుకు వినాలని కౌంతేయుడు భావించి ఉంటే బహుశా మహాభారత యుద్ధం సంభవించేదే కాదేమో! ధీరులు అంటే కండబలం ఉన్నవారు కానేకాదు. సమర్థులై, వివేకం కలిగినవారే ధీరులు. సమర్థత ఉంటే కార్యసాధకులవుతారు. అశోకుడి జీవిత చరిత్ర గమనిస్తే చకితులం అవుతాం. కండ బలంకన్నా అతడి మస్తిష్కం గొప్పది. అందువల్ల అతడెన్నో యుద్ధాలను జయించగలిగాడు. అతడి బలహీనత రాజ్యకాంక్ష. ఆలోచనలు మాత్రం గొప్పవి. జయాపజయాలు ఇహానికి సంబంధించినవని శాంతిలోనే ధర్మం ఉందని గ్రహించాడు. అందుకే కళింగ యుద్ధంలో విజయం సాధించిన అనంతరం వివేకం మేలుకొని గౌతమ బుద్ధుడు చెప్పిన పథంలో నడిచాడు.

సమర్థులైన కార్య సాధకులను అదృష్టం వరిస్తుంది. దిగంతాలను తాకే ధైర్యోత్సాహాలతో భగీరథుడిలా సర్వుల మేలు కొరకు ప్రయత్నిస్తూ కడదాకా వేచి ఉండేవారు అద్భుతాలను సుసాధ్యం చేయగలరు. బలవంతుడ నాకేమని పలువురితో అహంకరిస్తూ పలకడం మేలుకాదు... ఎందుకంటే బలవంతమైన సర్పం చలిచీమల పాలబడి మరణిస్తుందని బద్దెన భూపాలుడు చెప్పనే చెప్పాడు. మాలిన్యాలతో కూడి చంచలమైన అసూయతో కూడిన మనసు నుంచి అహంకారాన్ని పారదోలాలి. మరుక్షణం ఆత్మదేవుడు మన హృదయంలో స్వయానా ప్రభువై విరాజిల్లుతాడు. తత్వ విచారణ కారణంగా ఆత్మ అనే జ్యోతి ప్రాప్తించి సమస్త దోషాలు తొలగిపోతాయని భర్తృహరి చెప్పాడు.

మనం మంచిని సాధన చేస్తే మంచివాళ్లమే అవుతాం. అనవసరంగా అహంకరిస్తూ అసూయతో జీవిస్తే శక్తిహీనులమవుతాం. మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధీ బక్కపలచనివాడు. కానీ... మహా తేజోవంతుడు. ఆత్మబలాన్ని ఉద్ధృతం చేసుకొని లక్షలాది ఆంగ్లేయులతో శాంతియుద్ధం చేశాడు. చివరకు మువ్వన్నెల జెండా ఎగరనే ఎగిరింది. సౌశీల్యంతో శక్తిని సంతరించుకున్న సంకల్పబలమే ధీశక్తి.

అహంకారం లాంటి అగ్ని మరొకటి లేదు. ద్వేషం లాంటి భయానక జ్వాలకు అదే కారణం. గుణాల్లోకెల్లా ఉత్తమమైంది ప్రేమ. అందరినీ ప్రేమించగలిగితే అహం అనేదే ఉండదని బుద్ధుడి బోధ. అహం అసహనానికి కారణం అయితే, ప్రేమ సుగుణాలకు మూలం. ప్రేమ అనే యశస్సు ముందు అహం అపకీర్తి పాలవుతుంది!

- అప్పరుసు రమాకాంతరావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని