వెన్నదొంగ

కృష్ణుడు అనే మాటకు ఆకర్షించేవాడు అని అర్థం. ఆకర్షణ ఆయన స్వభావం. ఆకర్షణ ఆయన స్వరూపం. పేరుకు తగినట్లే ప్రతి భారతీయ కళా స్వరూపాన్ని, ప్రతి సాహిత్య ప్రక్రియను, ప్రతి సంగీత పోకడనూ తనవైపు బలంగా ఆకర్షించుకొన్న వాడు ఆయన. కృష్ణుడి గురించి చదవడం ఆనందం. చెప్పడం ఆనందం. ఆయన గురించి ఆలోచించడం నిజంగా పరమానందం.

Published : 19 Aug 2022 00:53 IST

కృష్ణుడు అనే మాటకు ఆకర్షించేవాడు అని అర్థం. ఆకర్షణ ఆయన స్వభావం. ఆకర్షణ ఆయన స్వరూపం. పేరుకు తగినట్లే ప్రతి భారతీయ కళా స్వరూపాన్ని, ప్రతి సాహిత్య ప్రక్రియను, ప్రతి సంగీత పోకడనూ తనవైపు బలంగా ఆకర్షించుకొన్న వాడు ఆయన. కృష్ణుడి గురించి చదవడం ఆనందం. చెప్పడం ఆనందం. ఆయన గురించి ఆలోచించడం నిజంగా పరమానందం. ఆయనది పరిపూర్ణ అవతారతత్వం. లీలామయ జీవన విధానం, జగద్గురు జీవలక్షణం... ఆయన బతుకు బాటలోని ఘట్టాలన్నీ అద్భుతావహమే. ఈ జాతి సంస్కృతికి, ఈ జాతి ఆధ్యాత్మిక చైతన్యానికి, ఈ జాతి సాంస్కృతిక వికాసానికి... మూలపురుషుడు శ్రీకృష్ణుడు. ఇలాంటి పాత్ర మొత్తం ప్రపంచ వాంగ్మయంలో మరొకటి ఏది?

శ్రీకృష్ణుడు విశేషంగా ఆకర్షిస్తున్నాడు సరే- మరి మనం ఆయనను ఆకర్షించాలంటే ఎలా? ఆయనను మనవాణ్ని చేసుకోవడానికి అపారమైన తెలివితేటలు అఖండమైన పాండిత్యం అక్కరకు వస్తాయా అంటే అసలవి పనికిరావంది- భాగవతం దశమ స్కంధం. వేద వేదాంగాలకే ఆయన అంతుపట్టడు... పరమ యోగులకే ఆయన అర్థంకాడు. ఇక మానవ మాత్రులు ఆయనను ఆకర్షించేదెలా... ఆయనను అర్థం చేసుకోవడం ఎలా?

అనుక్షణం కృష్ణ నామాన్ని జపించే గోపికల వద్దకు ఉద్ధవుడనే గొప్ప పండితుడు వెళ్ళాడు. ఆయన మహాయోగి. కృష్ణుడికి సన్నిహితుడు, భక్తుడు. గోపికలకు ఆయన జ్ఞానబోధ చేయబోయాడు. వారికి మోక్షమార్గాన్ని ఉపదేశించాలనుకొన్నాడు. గోపికలు పట్టించుకోలేదు. ‘నీ మహత్తరమైన జ్ఞానాన్ని నీ దగ్గరే ఉంచుకో. మాకు కృష్ణకథ చెప్పు చాలు. ఆయన ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు? ఆయన క్షేమ సమాచారం తప్ప తక్కిన విజ్ఞానంతో మాకు పనేంలేదు. భక్తి, ప్రేమ... ఈ రెండే ముఖ్యం మాకు. జ్ఞానంతో మాకు పని లేదు’ అని విస్పష్టంగా ప్రకటించారు. ఆ మాటలకు ఉద్ధవుడు ఆశ్చర్యపోయాడని భాగవతం వివరించింది.

చక్కగా కాచిన చిక్కని పాలను కవ్వంతో చిలికినప్పుడు వచ్చే గోరువెచ్చని తాజా వెన్నముద్దను ‘హైయంగవీనం’ అంటారు. శ్రీకృష్ణుడికి అదంటే పరమప్రీతి. అప్పటి వరకు పెరుగులో భాగమైన వెన్న- చక్కని ముద్దగా మారగానే మజ్జిగపై వేరుగా తేలుతూంటుంది. గోపికల ప్రేమ అటువంటిది. లౌకిక ప్రపంచంతో అది అంటీ ముట్టనట్లుగా ఉంటుంది. మనిషి తెలివి తేటలు, పాండిత్యం వంటి లోతైన ఊబిని కాదు- వాటిని మథించగా మథించగా చివరకు పైకి తేటగా తేలే జ్ఞానమనే హైయంగవీనాన్ని కృష్ణుడు ఇష్టపడతాడు. గోరువెచ్చని ప్రేమ ముద్దను కోరుకుంటాడు. అనురాగానికి లోబడతాడు. అవసరమైతే దాన్ని దొంగిలించడానికి సిద్ధమైపోతాడు. ఆ ప్రేమామృత భావన మనిషి ఎదను సోకగానే లోకమంతా ప్రేమమయంగా మారిపోతుంది. గోపికలకు ఏ అంగన ఎదురైనా ఆలింగనం చేసుకొన్నది ఆ స్థితిలోనే. అందరిలో... అన్నింటా... కృష్ణచైతన్యమే వారికి తోచిందని దాని అర్థం. అలాంటి సమ్మోహన భావన భువనమంతటా వ్యాపించగానే కృష్ణుడి చేతిలో వెదురు వేణువై కులికింది. ప్రాణమై పలికింది. గానమై కురిసింది. గగనమై మెరిసింది. నీలికాంతుల్లో లోకం పరవశించింది. ఆ నీలికాంతులనే వేదం రాసం అని పిలిచింది. ఆ తీయని అనుభూతిలో రసడోలలో రాసలీలలో తేలియాడటమే గోకులాష్టమి పూట కృష్ణభక్తులకు పరమావధి.

- వై. శ్రీలక్ష్మి

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని