ఊపిరి ఊసులు

ఏ ప్రాణి అయినా హాయిగా జీవించడానికి ఆహారం, నీటితోపాటు నిరంతరం ప్రేమ సరఫరా అవుతుండాలి. జన్మించినప్పట్నుంచీ కను మూసేదాకా అలాగే జీవించేందుకు శ్వాస ఆడుతుండాలి. చిన్న ప్రాణులకన్నా పెద్ద క్షీరదాలు తక్కువగా శ్వాసిస్తాయి. మనుషుల్లో పెద్దవాళ్లు విశ్రాంతి సమయంలో నిమిషానికి పన్నెండు-ఇరవై సార్లు...

Published : 06 Sep 2022 01:02 IST

ప్రాణి అయినా హాయిగా జీవించడానికి ఆహారం, నీటితోపాటు నిరంతరం ప్రేమ సరఫరా అవుతుండాలి. జన్మించినప్పట్నుంచీ కను మూసేదాకా అలాగే జీవించేందుకు శ్వాస ఆడుతుండాలి.

చిన్న ప్రాణులకన్నా పెద్ద క్షీరదాలు తక్కువగా శ్వాసిస్తాయి. మనుషుల్లో పెద్దవాళ్లు విశ్రాంతి సమయంలో నిమిషానికి పన్నెండు-ఇరవై సార్లు శ్వాస తీసుకుంటారంటారు. నడిచేటప్పుడు, వ్యాయామ సమయాల్లో శ్వాస సూచి పెరుగుతుంది.

సముచిత ఆమ్లజని సరఫరా ఎంతో ముఖ్యమైనదని యోగులు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే తెలుసుకున్నారు. శ్వాసక్రియ విషయాల్లో విభిన్నమైన శ్వాసించే పద్ధతుల్ని వికసింపజేశారు.

ధ్యానంలో శ్వాస మీద ధ్యాస ఉంచడం ఒక పద్ధతి. ఈ పద్ధతి వల్ల శ్వాసలో ‘శ్వాస’ను తెలుసుకోవడం సాధ్యపడుతుంది... అంటే ప్రాణాన్ని గుర్తించడం జరుగుతుంది అంటారు బుద్ధుడు. అన్ని భాషలలో శ్వాస అంటే జీవితం, ప్రాణం.

ఒక శ్వాస లోపలకు, తరవాత ఖాళీ. తరవాత కొన్ని నిమిషాలపాటు అది బయటకు రాకపోతే అంతా నిలిచిపోతుంది. ప్రపంచం ఆగిపోతుంది. కాలం కదలదు... ఆలోచన ఉండదు. ఎప్పుడైతే ఊపిరి కొన్ని నిమిషాలపాటు నిలిచిపోతుందో అప్పుడు ఆలోచనకు ఆస్కారం ఉండదు. ఆలోచనా ప్రక్రియ కొనసాగాలంటే ప్రాణవాయువు సరఫరా ముఖ్యం. ఆలోచనకు శ్వాసతో ఉండేది లోతైన సంబంధం.

చిత్తవృత్తి (మానసికావస్థ)ని అను సరించి శ్వాసక్రమం మారు తూంటుంది. శ్వాస జీవితాన్ని, స్పృహకు అనుసంధానం చేసే వంతెన. శరీరంలో ఎక్కువ ఆమ్లజని మెదడుకు అవసరమవుతుంది. దానికోసం అది ఆకలితో అలమ టిస్తే వ్యతిరేకమైన ఆలోచనలు, కుంగిపోవడాలు, వినికిడి, దృష్టి సంబంధ సమస్యలూ కలుగుతాయి.

ఆలోచనలను నియంత్రించడమనేది, శ్వాసను నియంత్రణలో ఉంచడానికి ముందే సాధ్యమయ్యేది. యోగాలోని ఆధ్యాత్మిక సారంపైన దృష్టి ఉంచాలి గానీ- కేవలం భౌతిక, శ్వాస సంబంధ వ్యాయామాలుగా భావించకూడదు. ఆ దృష్టితో చూస్తే యోగా అందించే అసలైన ప్రయోజనాలను కోల్పోతాం.

ఎన్నో యుద్ధాలు చేసిన అలెగ్జాండర్‌ చావుబతుకుల మధ్య ఉన్నాడు. చుట్టూ వైద్యులు, మంత్రులు, సైన్యాధిపతులు. వారి వైపు చూసి ‘నేను చనిపోయే ముందు మా అమ్మను చూసి ఆమె ఆశీస్సులు పొందాలనిపిస్తోంది. ఏ ఒక్కరైనా తమ జీవితంలోని కాలాన్ని నాకిస్తారా... నేను ఇల్లు చేరుకుని అమ్మను చివరిసారి చూడగలుగుతాను. దానికి బదులుగా నా సగం సామ్రాజ్యాన్ని ఇచ్చేస్తాను’.
జవాబు లేదు.
తమ జీవితంలోని విలువైన కాలాన్ని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు.
మృత్యువు సమీపించింది.
‘మొత్తం సామ్రాజాన్ని ఇచ్చేస్తాను... ఒక్క శ్వాస... నా కోసం’
‘....’
‘కొన్ని కోట్ల శ్వాసలు వృథా చేశాను- గొప్ప సామ్రాజ్యాధి నేతను కావడం కోసం. ఆ సామ్రాజ్యానికి బదులుగా ఒక్క శ్వాసను కూడా పొందలేకపోయాను...’- బలహీనంగా వచ్చిన ఆ మాటలు పెదాలపై ఉండగానే ప్రాణం వదిలేశాడు.

జీవితంలో విలువైనదేది, దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలి అనేది గుర్తెరిగి జీవించగలిగే మనిషి బతుకే ధన్యం!

- మంత్రవాది మహేశ్వర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని