వామనాయనమః

శ్రీమహావిష్ణువు స్థితికారకత్వ సంవిధానంలో అభివ్యక్తమైన అయిదో అవతారం వామనావతారం. ధర్మోద్ధరణ కోసం అవసరమైన సందర్భాల్లో తాను అవతరిస్తూనే ఉంటానని శ్రీహరి ప్రకటించాడు. ఆ నేపథ్యంలోనే భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి, కశ్యపులకు వరపుత్రుడిగా

Published : 07 Sep 2022 00:56 IST

శ్రీమహావిష్ణువు స్థితికారకత్వ సంవిధానంలో అభివ్యక్తమైన అయిదో అవతారం వామనావతారం. ధర్మోద్ధరణ కోసం అవసరమైన సందర్భాల్లో తాను అవతరిస్తూనే ఉంటానని శ్రీహరి ప్రకటించాడు. ఆ నేపథ్యంలోనే భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి, కశ్యపులకు వరపుత్రుడిగా, వామనమూర్తిగా సాకారమయ్యాడు. వామనుడు ఆవిర్భవించిన ఈ ద్వాదశిని దివ్యద్వాదశి, విజయద్వాదశి, మహాద్వాదశి, బలిద్వాదశి, వామన ద్వాదశిగా వ్యవహరిస్తారు.

వామనావతార విశేషాల్ని శ్రీమద్భాగవతం, వామన, భవిష్య పురాణాలు విశదీకరిస్తున్నాయి. ఓసారి ఇంద్రుణ్ని ఓడించి, బలిచక్రవర్తి స్వర్గానికి అధిపతి అయ్యాడు. విజయగర్వంతో రాక్షసగణం దేవతల్ని హింసించసాగింది. దాంతో, దేవతల మాతృమూర్తి అదితి కలవరపడి శ్రీహరిని వేడుకుని, అనుగ్రహాన్ని పొందింది. ఫలితంగా నారాయణుడే దేవతల్ని రక్షించడానికి వామనుడిగా ఆవిష్కారమయ్యాడు. వటుడైన వామనుడు దండాన్ని, గొడుగును, కమండలాన్ని ధరించి బలి చక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. బలిని వామనుడు ఆశీర్వదించాడు. ఆ బాలకుడి వర్చస్సు, వాక్చాతుర్యానికి ముగ్ధుడైన బలి, ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. ‘నాకు ఎలాంటి అత్యాశ లేదు. కేవలం మూడడుగుల భూమిని మాత్రం ఇవ్వు చాలు’ అన్నాడు వామనుడు. వామనుడి ఆకృతిలాగానే అతడి అభీష్టం చాలా కురచగా ఉందని బలి భావించాడు. భూదానానికి సమాయత్తమైన బలిని, అతడి గురువు శుక్రాచార్యుడు నిలువరించాడు. ఇది విష్ణుమాయా విలాసంగా హెచ్చరించాడు. అయినా బలి శుక్రుడి మాట పట్టించుకోకుండా వామనుడికి ఉదకపూర్వకంగా భూదానం చేశాడు. మహాత్రివిక్రముడిగా ‘ఇంతింతై వటుడింతై...’ వామనుడు విరాట్‌ రూపాన్ని సంతరించుకున్నాడు. ఓ పాదంతో భూమిని, మరో పాదంతో స్వర్గాన్ని ఆక్రమించి, మూడో పాదం బలి శిరస్సుపై ఉంచి అతణ్ని రాక్షసజాతి ఆవాస స్థలమైన రసాతలానికి అణగదొక్కాడు. అదే సందర్భంలో బలి దాన గుణ వైభవానికి ప్రసన్నుడైన వామనుడు, అతణ్ని సుతల లోక రాజ్యాధిపతిగా నియమించాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాన్ని అప్పగించాడు.

మనిషి బిందు స్థితిలో బీజప్రాయంగా నిద్రాణంగా ఉన్న శక్తిని ఆత్మవిశ్వాసంతో గుర్తించాలి. దీని ద్వారా మనిషి మహనీయుడిగా ఎదుగుతాడు. నేను మహా చక్రవర్తిని, నేను గొప్ప దాతను, నేను కర్తను, నేను భోక్తను అని విర్రవీగేవారు అజ్ఞానులుగా మిగులుతారని, అలాంటివారికి ఎప్పటికైనా ప్రతికూల పరిస్థితులు తప్పవని భగవద్గీత పేర్కొంది. బలి చక్రవర్తి విషయంలో ఇదే జరిగింది.

విష్ణువు దాల్చిన వామనావతారం ఎన్నో సందేశాల సమాహారం! సృష్టిలోని జీవులన్నీ బీజప్రాయంగా ముందు అణువంత ఆకృతి దాల్చి క్రమంగా వికాసం చెంది సమగ్ర రూపాన్ని పొందుతాయి. జీవావరణంలో జీవులు సూక్ష్మరూపం నుంచి విరాట్‌ రూపం వరకు వైవిధ్యంగా ప్రకటితమవుతున్నాయి. ఈ వైవిధ్య, వైరుధ్యాలకు పరమాత్మ సృష్టి రచనే కారణం. ఆత్మ అనేది అణువుకన్నా సూక్ష్మమైనది. అయితే ఆ ఆత్మ దివ్య జ్ఞానంతో ప్రకాశిస్తే, బ్రహ్మాండమంత స్థూలంగా విశ్వరూపాన్ని ధరిస్తుంది. జీవుడు తనలో ఉన్న ఆత్మశక్తిని గ్రహించి, ఆత్మోద్ధరణకు సర్వదా కృషిచేయాలి. తన ఆత్మను, పరమాత్మతో అనుసంధానం చేసుకోవాలి. అప్పుడు వామనుడు త్రివిక్రముడిగా ఎదిగిన రీతిలో సూక్ష్మ స్థితి నుంచి సాధకులు క్రమంగా వృద్ధి పొందుతారు! ఇదే, త్రివిక్రమావతార సందేశం!

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని