శాంతి మంత్రం

జీవితం సుఖంగా, ప్రశాంతంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కోరికలు మానవ సహజం. కోరికలు ఊరికే తీరవు. కోరిన కోరికలను నెరవేర్చుకోవడానికి దారులు వెతకాలి. సరైన దారిలో ముందుకు సాగితే అనుకున్నవి సాధించవచ్చు. ఈ ప్రపంచంలో

Published : 08 Sep 2022 01:08 IST

జీవితం సుఖంగా, ప్రశాంతంగా సాగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కోరికలు మానవ సహజం. కోరికలు ఊరికే తీరవు. కోరిన కోరికలను నెరవేర్చుకోవడానికి దారులు వెతకాలి. సరైన దారిలో ముందుకు సాగితే అనుకున్నవి సాధించవచ్చు. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, వస్తువులు ఉన్నాయి. ఆకాశంలో చందమామను తీసుకురావాలని, మిలమిలలాడే తారలను కోసుకు రావాలని ఆశపడితే అది తీరని కోరికే అవుతుంది. పరిమితమైన జీవితానికి అవసరమైన మేరకు కోరికలనూ పరిమితం చేసుకోవాలి. తెలివిగా సాధించగలిగితే సుఖశాంతులకు ఏ లోటూ ఉండదు.

సముద్రం ప్రశాంతంగా ఉంటేనే నౌకాయానం సుఖంగా సాగుతుంది. రహదారి మీద బండి నల్లేరు మీద నడకలా సాఫీగా నడుస్తుంది. అశాంతిలో కొట్టుకుపోయేవాడికి సుఖం అందని ద్రాక్షపండు. శాంతం లేకపోతే సుఖమూ లేదు. వేదాలు పదేపదే శాంతి మంత్రాలను వల్లెవేస్తాయి. యజుర్వేదం (36-17) ఆకాశం, అంతరిక్షం, భూమి, జలం, ఓషధులు, మొక్కలు, పండితులు, పరబ్రహ్మ, పదార్థాలు, పర్యావరణం బాగుండాలని, శాంతి వర్ధిల్లాలని కోరుకుంటుంది.

ప్రపంచంలో అన్ని దేశాల ప్రజలూ శాంతియుతంగా సహజీవనం సాగిస్తే ప్రపంచ శాంతికి చక్కని అవకాశం కలుగుతుంది. మానవ జాతులన్నీ ఏకమైతే ప్రపంచమంతాప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. లోకా లన్నీ సుఖంగా ఉండాలని, మనుషులందరూ సంతోషంగా ఉండాలని వేదం చెబుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణీ తన పరిమితుల మేరకు సుఖంగానే జీవిస్తున్నది. భూమి పైన జంతు వులు ఆహారం, నిద్ర, మైథునం అనే మూడు కోరికలకు పరిమితమై ముచ్చటగానే జీవిస్తున్నాయి. మనిషి మాత్రమే సుఖశాంతుల కోసం వెంపర్లాలాడుతున్నాడు.

మనిషి ఒక విచిత్రమైన జంతువు. భూమి పైన ఉంటూ ఆకాశానికి నిచ్చెన వేసే ఆశాజీవి. ఆలోచించడానికి మెదడు, ఆచరించడానికి చేవ- మనిషికి భగవంతుడు ఇచ్చిన వరాలు. ఈ వరాలు అందుకోవడానికి ఎన్నో జన్మలు కష్టపడి ఉండాలి. ఆ కష్టాలకు ప్రతిఫలంగా మనిషి జన్మ వచ్చింది. దుర్లభమైన మానవ జన్మను సద్వినియోగ పరచుకునే అవకాశం ఉంది. ఇంద్రియ సుఖాల కోసం తారట్లాడుతూ తీరని కోరిక అనే మరీచిక వెంటపడితే జీవితకాలం అడవి కాచిన వెన్నెల అవుతుంది. వివేకవంతుడు క్షణిక సుఖాన్ని ఇవ్వగల భౌతిక వస్తువులకు, చెడు కర్మలకు దూరంగా- శాశ్వతమైన ఆనందం పొందడానికి, ప్రశాంత జీవితం గడపడానికి, ఒక పద్ధతి ప్రకారం నడుచుకుని జీవిత పరమార్థం అందుకుంటాడు. అజ్ఞాని కదిలే వంతెన మీద కాలు జారి పాము నోట్లో పాచికలా పతనమవుతాడు. మితాహారం ఆరోగ్యానికి, హితవచనం ఆనందానికి పరమ ఔషధాలు.

ఆరుగురు శత్రువులు, ఆరుగురు మిత్రులూ ఉన్నారని గీతోపనిషత్తు చెబుతోంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం... మనిషిని మృగంగా మారుస్తాయి. వీటిని ఆసురీ శక్తులంటారు. కామాంధుడు ఒళ్ళు మరిచి తన పతనానికి తానే బాధ్యుడు అవుతాడు. అలాంటి మూఢులకు పరమార్థం చిక్కదు. పరమ పదం దక్కదు. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, సహనం, శ్రద్ధ, ఏకాగ్రత, మోక్షకాంక్ష... ఈ ఆరూ మనిషికి దేవుడు అనుగ్రహించిన దివ్యాస్త్రాలు. శత్రు సంహారం సాగించి, విజయం సాధించినప్పుడే జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి!

- ఉప్పు రాఘవేంద్రరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని