జీవితం ఒక వేడుక

భగవంతుడి సృష్టిలో మానవజన్మ ఎంతో అద్భుతమైనది. అన్ని ప్రాణులకీ లభ్యం కానిది. మరలా దక్కుతుందో లేదో స్పష్టంగా చెప్పలేని అరుదైన అవకాశమిది. నిరుపేదగానో, ఆగర్భ శ్రీమంతుడిగానో ఎలా జన్మించినా అసలు మనిషిగా పుట్టినందుకే సంబరపడాలి మనం.

Published : 09 Sep 2022 00:44 IST

గవంతుడి సృష్టిలో మానవజన్మ ఎంతో అద్భుతమైనది. అన్ని ప్రాణులకీ లభ్యం కానిది. మరలా దక్కుతుందో లేదో స్పష్టంగా చెప్పలేని అరుదైన అవకాశమిది. నిరుపేదగానో, ఆగర్భ శ్రీమంతుడిగానో ఎలా జన్మించినా అసలు మనిషిగా పుట్టినందుకే సంబరపడాలి మనం. లక్షలాది ప్రాణులు ఊహల్లో సైతం అందుకోలేని సదుపాయాలను మానవజన్మ అందిపుచ్చుకొంది. ఇంత గొప్ప సదవకాశాన్ని పొందిన మనమంతా జీవితాన్ని సంతోషంగా గడపాలి. ప్రతి క్షణాన్ని వేడుకలా ఆస్వాదించాలి.

శుభకార్యం జరుగుతున్న వేళ బంధువులు మిత్రగణమంతా ఏకమవుతాం. అనేక రకాల కబుర్లు చెప్పుకొంటూ సందడిగా కాలక్షేపం చేస్తాం. కోపతాపాలు, మనస్పర్ధల్లాంటివి ఉన్నా అదుపు చేసుకుంటాం. చిరునవ్వులతో పలకరించుకుంటాం. జీవితమైనా అంతే. సృష్టి యజ్ఞంలో భాగంగా భగవంతుడు మనల్ని భూమిపైకి ఆహ్వానించాడు. అతిథుల్లా ఇక్కడి కొచ్చాం. ఈ రాక వృథా ప్రయాస కాదు. చుట్టూ ఉన్న సమాజంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలి. కుదిరినప్పుడల్లా ఆనందపు రుచుల్ని అందరికీ పంచగలగాలి. వసంతమాసంలో విరగపూసిన ఉద్యానవనంలా మలచుకోవాలి జీవితాన్ని.

భారతీయ జీవన విధానం చాలా గొప్పది. సంవత్సరం పొడవునా అనేక రకాల పండగలు, పర్వదినాలు వస్తాయి. పదుగురూ ఒకచోట చేరడానికి, పలకరించుకోవడానికి సహకరించే యాత్రలు, జాతరలు ఉంటాయి. ఒంటరిగా లోకానికొచ్చినా తుది వరకూ కలిసి నడిచే మిత్రులు తారసపడతారు. వారి సాన్నిహిత్యంలో క్షణాలు ఇట్టే గడిచిపోతాయి. సమయం కుదిరినప్పుడల్లా అనేక రకాల వరసలతో ఆత్మీయతను పంచడానికి బంధువర్గం ముందుకొస్తుంది.

జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి కావలసింది- మనసుపై నియంత్రణ. అదుపు చెయ్యలేని కోరికలన్నీ శరీర సంబంధమైనవే. మానసిక వాంఛల్ని అభ్యాసంతో కట్టడి చేయవచ్చు. స్వల్ప విషయాలకే సంతోషంతో పొంగిపోయేలా మనసుకు శిక్షణ ఇవ్వాలి. నిండుపున్నమి పండువెన్నెల, చైత్రమాసం సుస్వరాల కోయిల, నిద్ర లేస్తే కరిగిపోయే మధురమైన కల, పడిపోయినా లేచి పరుగులెత్తే ఏటి అల... చుట్టూ ఉన్న ప్రకృతి జీవితంలో ప్రతి అనుభూతి మానవజన్మను ఫలప్రదం చెయ్యడానికే. ఈ ఎరుక మనసుకు కలిగిన నాడు- జీవితం రసభరితం.

పఠనాసక్తి లోకాన్ని మనకు పరిచయం చేస్తుంది. ప్రవర్తన మనల్ని లోకానికి పరిచయం చేస్తుంది. చదవడమంటే కేవలం గ్రంథ పఠనమే కాదు. సమాజాన్ని పరిశీలించడం కూడా ఒక రకమైన అభ్యసనమే.

జీవిత మర్మం తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించిన పెద్దలు అందించిన సందేశం- పదుగురికీ మంచిని మాత్రమే పంచమని, బతికినంతకాలం జీవితాన్ని ఆస్వాదించమని. వారి మాటలు మనకు శిరోధార్యం.

కాల సముద్రగర్భంలో మనలాంటి వారెందరో అలల్లా పుట్టి కడతేరారు. మనం అనుభవించే కష్టసుఖాలు- వారెవరూ అనుభవించనివి కావు. వారందరికంటే భిన్నంగా, కనీసం మన కుటుంబంలో ముందు తరాలవారి కంటే కొత్తగా అనిపించేలా జీవితానికి రంగులద్దాలి. గతించిన తరవాత కొన్నేళ్లపాటైనా స్మరించుకునేంత ముచ్చటగా బతకాలి. జీవితాన్ని నరకంలా కాకుండా వేడుకలా భగవంతుడిచ్చిన కానుకలా పవిత్రంగా భావించాలి.

- గోలి రామచంద్రరావు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని