అంతరంగ ప్రజ్ఞ

ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. బయటికి కనిపించే ఆహార్యం, నడవడిక ద్వారా అతడి జ్ఞానాన్ని అంచనా వేయలేం. వ్యక్తిత్వ పాండిత్యాలను పరిశీలించ గలిగితేనే అవి బహిర్గతం అవుతాయంటారు పెద్దలు. వ్యక్తికి భుజకీర్తులు, రత్నహారాలు, చందన

Published : 12 Sep 2022 00:31 IST

ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. బయటికి కనిపించే ఆహార్యం, నడవడిక ద్వారా అతడి జ్ఞానాన్ని అంచనా వేయలేం. వ్యక్తిత్వ పాండిత్యాలను పరిశీలించ గలిగితేనే అవి బహిర్గతం అవుతాయంటారు పెద్దలు. వ్యక్తికి భుజకీర్తులు, రత్నహారాలు, చందన లేపనాలు- ఇవేమీ అలంకారాలు కావు... శాస్త్ర సంస్కారంగల ప్రజ్ఞతో కూడిన నడవడి, విద్య, వివేకం, జ్ఞానం మాత్రమే నిజమైన అలంకారాలు అంటాడు భర్తృహరి. అవే సత్పురుషులకు భూషణాలనీ చెబుతాడు.

సీతాన్వేషణలో భాగంగా రాముడి దూతగా వచ్చిన ఆంజనేయుణ్ని రావణాసురుడు మొదట సాధారణ వానరుడిగా భావించాడు. ఆయన బల పరాక్రమాలను తక్కువ అంచనా వేశాడు. దూతను సంహరించడం రాజధర్మం కాదంటూ ఆ వానరుడి తోకకు నిప్పంటించమన్నాడు. ఆ తోకతోనే లంకను కాల్చి సూర్యుడిలా ఆంజనేయుడు ప్రకాశించాడని సుందరకాండ చెబుతోంది. సభా మండపంలో తనతో వాదన సమయంలో ప్రస్ఫుటమైన ప్రభు భక్తికి ముగ్ధుడై- రూపం కన్నా గుణం మిన్న అయిన ఇలాంటి చెలికాడు ఉన్నవారి జీవితం ధన్యమని రావణుడు మనసులోనే మారుతిని గురించి భావించాడని చంపూ రామాయణం చెబుతోంది.

అశోకవనంలో రాక్షస స్త్రీలు సీతను చుట్టుముట్టి రకరకాలుగా హింసిస్తుంటారు. బెదిరిస్తుంటారు. చూడటానికి రాక్షసాకారంలో ఉన్న స్త్రీ అయిన త్రిజట మాత్రం తనకు వచ్చిన కల గురించి వాళ్లకు చెప్పి సీత జోలికి వెళ్ళవద్దని హితవు పలుకుతుంది.

తల్లి కడుపులో ఉన్నప్పుడే తండ్రి శాపం వల్ల వంకరల ఆకారంతో పుట్టాడు అష్టావక్రుడు. తన ఆకృతికి కారకుడైనప్పటికీ అతడు తండ్రిని నిందించలేదు. పైగా తన తండ్రి చెరను విడిపించడానికి జనక మహారాజు కొలువుకు వెళ్ళాడు. అతడికి రాజాస్థానంలోనికి ప్రవేశానుమతి దొరకలేదు. అప్పుడు అసమాన పాండిత్యంతో అక్కడివారిని, ఆస్థాన పండితుడైన వందిని ఓడించి తన తండ్రిని విడిపించాడు. మోహిని రూపాన్ని చూసి మోసపోయి భస్మాసురుడు నాశనాన్ని కొనితెచ్చుకున్నాడు. అదే మోహిని తన రూపంతో రాక్షసులను తప్పుదోవ పట్టించింది. రూపంవల్ల వినాయకుడు అవహేళనలు పొందినా తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్లనే గణాధిపత్యాన్ని పొందాడు. తన ఘంటాన్ని వేగంగా కదిలించి వ్యాసభారతాన్నీ మనకందించాడు.

ముళ్లను చూసి దూరంగా ఉంటే గులాబి సువాసనలను ఆఘ్రాణించలేం. బురదలో నుంచి పుట్టిన పద్మం ఆ విధాతకే ఆసనమైంది. అందరూ అసహ్యించుకునే గొంగళి పురుగు కాలాంతరంలో అందమైన సీతాకోకచిలుకగా రూపాంతరం చెందుతుంది.

అందుకే ఏ వ్యక్తినైనా చూడగానే ఓ అంచనాకు రాకుండా, అతడిలోని ప్రతిభకు, ప్రేమతత్వానికి ప్రాధాన్యమివ్వాలి. పొట్టివాడైన వామనుడు బలిచక్రవర్తి అంతటివాడిని పాతాళానికి అణిచాడు. భౌతిక ఆకారాన్ని కాక అంతరంగంలోని పరమాత్మను దర్శించమనే సందేశాన్ని భగవంతుడి అవతారాలు తెలియజేస్తున్నాయి.

వివేకానందుడు అమెరికా వెళ్ళిన తొలినాళ్లలో వేషధారణ వల్ల ఎన్నో అవమానాలను ఎదుర్కోవలసి వచ్చింది. తరవాత సర్వమత మహాసభలో పాల్గొన్న ఆయన ఉపన్యాసాలు ఎలా విశ్వవ్యాప్తం అయ్యాయో అందరికీ తెలిసిందే. రంగు రూపులను అనుసరించి తీవ్ర అవమానాలను ఎదుర్కొన్న గాంధీజీ, నెల్సన్‌ మండేలా వంటి నాయకులు ఎందరో ఉన్నారు. తెలుపు నలుపు పొట్టి పొడుగు వంటి భౌతిక ఆకారాలను అనుసరించి ఒక వ్యక్తిని గౌరవించడం, కించపరచడం తగదు.

- గంటి ఉషాబాల

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts