స్థానబలం

మొసలి నీటిలో, కుక్క యజమాని ఇంటి ప్రాంగణంలో బలంగా నిలదొక్కుకుని ఉంటాయి. స్థానబలంతో అవి విర్రవీగుతుంటాయి. ఇక్కడ బలం అంటే శత్రువుల నుంచి తమను తాము రక్షించుకుని క్షేమంగా ఉండటానికి, స్థానం వల్ల సమకూరే శక్తి. అక్కడి నుంచి కదిలి

Published : 15 Sep 2022 01:27 IST

మొసలి నీటిలో, కుక్క యజమాని ఇంటి ప్రాంగణంలో బలంగా నిలదొక్కుకుని ఉంటాయి. స్థానబలంతో అవి విర్రవీగుతుంటాయి. ఇక్కడ బలం అంటే శత్రువుల నుంచి తమను తాము రక్షించుకుని క్షేమంగా ఉండటానికి, స్థానం వల్ల సమకూరే శక్తి. అక్కడి నుంచి కదిలి బయటికొస్తే ఆ బలం వీగిపోతుంది. ప్రాణికోటి విషయంలో అది ప్రాకృతికంగా ఏర్పడిన నియమం. జీవ జంతుజాలానికి అడవులు, ఒంటెలకు ఎడారులు, చేపలకు నదులు, తిమింగిలాలకు సముద్రాలు, పెంగ్విన్‌లకు మంచు ప్రాంతాలు- అభయ ప్రదేశాలు. మనిషికి అలా కాదు. భయాలు, అభయాలు ఉండవు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా తనకు తగ్గట్టుగా మార్చుకోగలడు. అననుకూల వాతావరణానికి తగినట్టు మారనూగలడు. దేశాలు పట్టుకు తిరుగుతాడు. లౌకికంగా ఎదుగుతాడు. ఎక్కడైనా ఇమడగలడు. సౌమ్యమైన మాటలతో, పదుగురినీ మెప్పించే చేతలతో, అందరితో సంబంధ బాంధ వ్యాలు ఏర్పరచుకుని ఎక్కడ ఉంటే అక్కడ మర్రిమానులా వేళ్లూనుకుని స్థిరత్వం పొందుతాడు. సంఘజీవిగా విలసిల్లుతాడు. మెదడులో ఉద్భవించే ఆలోచనా తరంగాల తీరుతో మానవుడికి ఎన్నో వ్యాపకాలు, వృత్తి వ్యాపారాలు అలవడ్డాయి. జీవిక కోసం నిత్య పథికుడై అవకాశమున్న చోటికల్లా పరుగు పెడతాడు. సామర్థ్యాన్ని నిరూపించుకుంటాడు. అయినా స్థిరంగా ఉండాలనుకునే వాళ్లకు స్థానబలం కాని జగమంతా చుట్టబెట్టేవాళ్లకు సర్వత్రా చేకూరేది మహాబలమే. మనిషికి తప్ప ఏ జీవికి ఉంది ఇంతటి వరంలాంటి సౌలభ్యం?

ఒకప్పుడు శిష్యులు విద్యార్జన కోసం ఉత్తమ గురువులకు నెలవులైన గురుకులాలు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళేవారు. ఆపై గురువుల ఆశీస్సులు పొంది, దేశాటనం చేస్తూ వాస్తవ జ్ఞాన సముపార్జనతో, తమకిష్టమైన రంగంలో కృషిచేసి, విశేష ప్రతిభతో తమకు నచ్చిన చోట నిలదొక్కుకుని రాణించేవారు. అక్కడి ప్రజలకు సహాయ సహకారాలు అందించేవారు. నేడు కొందరు నేతలు పదవితో, ఉద్యోగులు స్థాయితో అవసరార్థం వచ్చేవారిని చిన్నచూపు చూస్తుంటారు. తమ సంతకం పాటి చెయ్యదు ఎదుటివాళ్ల బతుకు అన్న అహంకారంతో ప్రవర్తిస్తుంటారు. అది వారు నిర్వహిస్తున్న స్థానంవల్ల వచ్చిన బలం గాని, తమ విశేషం కాదని గ్రహించరు. ఆ స్థానంలో ఎవరు కూర్చున్నా బలవంతులే. దానికి దూరమైననాడు వాళ్ల జీవితం చెల్లని రూపాయితో సమానం. ఆ విషయం అనుభవంలోకి వచ్చినప్పుడు మనుషుల అవసరం, మానవత్వం విలువ తెలుస్తాయి. పదవిలో ఉండటమన్నది సేవ చేయడానికి దొరికే అవకాశం... స్థానబలాన్ని ప్రదర్శిస్తూ అహంకరించడానికి కాదు.

మానవ ప్రయాణ కుతూహలానికి భూమి చిన్నదై, అంతం లేని అంతరిక్షం రారమ్మని ఆహ్వానం పలుకుతూ చేతులు చాస్తోంది. గ్రహాలు ఆవాసయోగ్యాలవుతున్నాయి. మానవుడు ఉనికి చాటుకోవడానికి స్థానబలం అవసరం లేదు. స్వయం ప్రతిభ, తపన అతడి కృషికి నీరాజనాలు పడుతున్నాయి.

భూమిని చాపలా చుట్టినా, ఆకాశాన్ని గుప్పిట పట్టినా మనిషికి మానవత్వమే స్థానబలం. అదే సకల జీవరాశి నుంచి మనిషిని విడదీసి మనీషిగా చూపిస్తుంది. జీవితాన్ని బహుళార్థ సాధకం చేస్తుంది.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని