గొప్ప రచయిత

మాలాకారుడు పూలు, దారం, ఆకులు, మెరిసే తీగలతో చక్కని దండను తయారు చేస్తాడు. కుంభకారుడు మట్టి, రంగులు తదితరాలతో అందమైన కుండలను, పాత్రలను రూపొందిస్తాడు. అలాగే కవి, రచయిత, శిల్పకారుడు, స్వరకర్త... తదితరులంతా రచయితలే! అద్భుతమైన ప్రావీణ్యంతో వారు ప్రజలను ఆనందింపజేస్తారు.

Published : 17 Sep 2022 00:32 IST

మాలాకారుడు పూలు, దారం, ఆకులు, మెరిసే తీగలతో చక్కని దండను తయారు చేస్తాడు. కుంభకారుడు మట్టి, రంగులు తదితరాలతో అందమైన కుండలను, పాత్రలను రూపొందిస్తాడు. అలాగే కవి, రచయిత, శిల్పకారుడు, స్వరకర్త... తదితరులంతా రచయితలే! అద్భుతమైన ప్రావీణ్యంతో వారు ప్రజలను ఆనందింపజేస్తారు. వారి తపన అంతా మనోరంజనం కోసమే. రచన అంటే దేన్నైనా కొత్తగా సృష్టించడం. రచయిత అంటే సృష్టికర్త అనే అర్థమూ ఉంది. పైన చెప్పిన వారందరినీ మించిన గొప్ప రచయిత ఒకరున్నారు. ఆయనను సృష్టికర్త, దేవదేవుడు, సర్వవ్యాపి... ఇలా ఎవరికి ఇష్టమైన పేరుతో వారు పిలుస్తారు. చరాచర ప్రాణులు, నదులు, పర్వతాలు, ఆకాశం... అదీ ఇదీ అని లేకుండా పిపీలికాది బ్రహ్మ పర్యంతం, అణువు మొదలు బ్రహ్మాండం వరకు అన్నింటినీ సృష్టించింది ఆయనే.

పరమాత్మ ఈ భువనాలను, విశ్వాన్ని, సృష్టిని, ప్రకృతిని ఎలా రచించాడనే విషయాన్ని తెలుసుకోవాలి. అందులో అంతర్భాగంగా ఈ చరాచర సృష్టిని రచించాడనీ గ్రహించాలి. ఆ విషయం తెలుసుకొంటే ఆ సృష్టికర్త రచనా సంవిధానం అర్థమవుతుంది. విశ్వసృష్టి రచనను ఉపనిషద్రష్టలు, మహాత్ములు, రుషులు సమాధి స్థితిలో అంతర్నేత్రంతో పరిశీలించి దాని స్వరూప స్వభావాలను మనకు తెలిసేలా చెప్పారు. వారు గమనించిన ప్రక్రియ అంతా భౌతిక సృష్టి ఏర్పడటానికి ముందు జరిగిన ఆధ్యాత్మిక ప్రక్రియ.
ఉపనిషత్తుల్లో, ఇంకా ఇతర గ్రంథాల్లో విశ్వసృష్టి రచన గురించి విశదీకరణ ఉందని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. దాన్ని తత్త్వ దృష్టితోనే చూడాలి తప్ప పరిమితమైన మానవ మేధతో అంచనా వేసే ప్రయత్నం చేయడం సరికాదు. ఈ అనంత సృష్టికి పూర్వం పరమాత్మ ఒక్కడే ప్రకాశిస్తూ ఉండేవాడు. ఈ పరిణామ జగత్తు అప్పుడు లేదు. ఈ పరమాత్మే అన్ని లోకాలనూ సృష్టి చేయడానికి సంకల్పించి, ఆ ప్రక్రియకు పూనుకొన్నాడు. అలాంటి విశ్వ రచయితకు నమస్కారం అని ఐతరేయోపనిషత్‌ ప్రథమాధ్యాయం ప్రథమ ఖండం స్పష్టంగా చెప్పింది.        

ఈ జగత్తు రచనకు కారణమైన సృష్టికర్తకు వ్యాప్తిత్వం, నిత్యత్వం, సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వాత్మకం అనే ధర్మాలున్నాయని బ్రహ్మసూత్రాల వల్ల తెలుస్తోంది. ఆ శక్తుల వల్ల ఆయన చేసిన విశ్వ రచనలో భాగాలైన చీకటిని, కష్టాలను, సమస్యలను, హెచ్చుతగ్గులను చూసి ఆయన సృష్టిని విమర్శించేవారు ఉన్నారు. ఆయనే సృష్టించిన సంతోషం, ఆనందం, వెలుగు లాంటివి-  ప్రతికూల పరిస్థితుల తరవాత మరింత ప్రభావాన్వితమవుతాయి.
విశ్వం, ప్రపంచం, దేశం, ప్రాంతం, స్థానం... ఇలా అన్ని చోట్లా ఎన్నింటినో రచించే ఆయన రచన రుచిరం అనేవారు, రుచించని వారూ ఉంటారు. మరోవైపున ఆ విశ్వ రచయితకు సైతం రూప రచన చేసే వారూ ఎందరో. ఎవరికి నచ్చిన విధంగా వారు ఆయన రూపాన్ని రచన చేస్తారు. అది మానసికంగా, భౌతికంగా కూడా కావచ్చు. ఆ రూపాన్ని మదిలో పదిలపరచుకొనేవారు కొందరైతే, బహిర్గతం చేసేవారు మరికొందరు. ఆరాధించేవారు కొందరైతే, అందలం ఎక్కించేవారు ఇంకొందరు. విమర్శించేవారు కొందరైతే, వివాదాలకు దిగేవారు మరికొందరు. వాటిలో దేనితోనూ ఆయనకు సంబంధం ఉండదు. వేటికీ ఆయన వత్తాసు పలకడు. వద్దని వారించడు. తన కర్తవ్యం తాను నిర్వర్తించడమే ఆయన పని. విశ్వ రచనే ఆయన నిరంతర ప్రక్రియ...  

- అయ్యగారి శ్రీనివాసరావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని