జీవన గీత

మనిషి మెదడు ఆలోచనల పుట్ట. సందేహాలను రేకెత్తిస్తుంది. అనుమానాలను పుట్టిస్తుంది. వాద ప్రతివాదనలను ప్రేరేపిస్తుంది. భూమి మీద సకల జీవరాశుల్లో కేవలం మానవుడు మాత్రమే తన అభిప్రాయాలను ఇతరులతో పంచుకోగలడు.

Published : 18 Sep 2022 00:51 IST

నిషి మెదడు ఆలోచనల పుట్ట. సందేహాలను రేకెత్తిస్తుంది. అనుమానాలను పుట్టిస్తుంది. వాద ప్రతివాదనలను ప్రేరేపిస్తుంది. భూమి మీద సకల జీవరాశుల్లో కేవలం మానవుడు మాత్రమే తన అభిప్రాయాలను ఇతరులతో పంచుకోగలడు. జ్ఞానుల మధ్య వాదనలు నూతన సిద్ధాంతాలకు తెరతీస్తాయి. మహర్షుల సంభాషణ శిష్యులకు జ్ఞానోపదేశమవుతుంది. భగవంతుడున్నాడని కొందరంటే లేడని మరికొందరు వాదిస్తారు. ఎవరేమన్నా ఈ విశ్వాన్ని అవతరింపజేసిన సృష్టికర్త ఒకరున్నారని, ఆ సృష్టి స్థితి లయ కారకుడే పరమేశ్వరుడని అందరూ అంగీకరించక తప్పదు.

యుగాలు మారినా ధర్మం మారదు. మారేవి మనిషి అభిప్రాయాలే. మనిషి అభిప్రాయాలపై వయసు ప్రభావం ఉంటుంది. యౌవనంలో అహంకారంతో వాదించే యువకుడు వృద్ధాప్యంలో శాంతమూర్తి కావచ్చు. చిన్న వయసులో భగవంతుడి ఉనికిని ప్రశ్నించే నాస్తికుడు కాలక్రమంలో భక్తుడిగా మారవచ్చు. మధ్య వయసులో స్వార్థపరుడిగా పేరు తెచ్చుకున్న పిసినారి వయసు మళ్ళాక దాన కర్ణుడు కావచ్చు. పరిస్థితుల ప్రభావం మానవ దృక్పథంలో మార్పు తెస్తుంది. పుస్తక పఠనం, జ్ఞానుల సాంగత్యం మనసును ఆధ్యాత్మిక మార్గంవైపు మళ్ళిస్తాయి. మితిమీరిన వాదోపవాదాలు మను షుల మధ్య చిచ్చురేపుతాయి. తన వాదనలో బలం లేదనిపించినప్పుడు పట్టుదలకు పోకుండా ఇతరుల అభిప్రాయాలను గౌరవించడమే విజ్ఞత.

ఒకసారి తమలో ఎవరు గొప్పవారని మహాలక్ష్మికి, సరస్వతీ దేవికి మధ్య వివాదం వచ్చిందట. సరస్వతీదేవి అనుగ్రహం పొందిన చాలామందికి కడుపునిండా భోజనం కూడా దొరకదని, తన అనుగ్రహానికి పాత్రులైనవారు అష్టెశ్వర్యాలతో తులతూగి సుఖిస్తారని లక్ష్మీదేవి చెప్పింది. ఈ అభిప్రాయంతో ఏకీభవించని సరస్వతీదేవి ఒక విద్యాహీనుడికి ఐశ్వర్యం అనుగ్రహించి తరవాత ఏం జరుగుతుందో చూడమని లక్ష్మీదేవికి సవాలు విసిరింది. వెంటనే లక్ష్మీదేవి ఏమాత్రం జ్ఞానం లేని ఒకడికి ఐశ్వర్యం అనుగ్రహించింది. అతడు గొప్ప ధనికుడయ్యాడు. తనకు సంప్రాప్తమైన భవనం పదో అంతస్తు మీదకు వెళ్ళాడు. అక్కడి నుంచి కింద కనిపిస్తున్న నగర దృశ్యాన్ని చూస్తూ పరవశించాడు. ఆ సమయంలో ఆ పదో అంతస్తు నుంచి కిందకు దూకితే అద్భుతంగా ఉంటుందనే ఆలోచన అతడి మనసులో పుట్టింది.

‘అతడెంత మూర్ఖుడో చూడు. ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. నీ ఐశ్వర్యం అతణ్ని ఇప్పుడు కాపాడలేదు. నేనే అతడి ప్రాణాలు కాపాడాలి’ అని చెప్పి సరస్వతీదేవి అతడి మనసులో సద్బుద్ధి పుట్టించింది. అతడు వివేకవంతుడై తన పొరపాటును గ్రహించి భవనం నుంచి దూకాలనే ఆలోచన విరమించుకున్నాడు. ఈ కథ చెప్పి భక్తుడిని రక్షించాలనుకున్నప్పుడు ఈశ్వరుడు అతడి మనసులో సరైన ఆలోచన పుట్టిస్తాడని శృంగేరీ పీఠాధిపతులు ఉపదేశించారు.
సంశయాలను తొలగించేది, చూడని విషయాలను కూడా స్పష్టంగా తెలియజేసేది లోకానికంతటికీ లోచనం వంటిది శాస్త్ర జ్ఞానమని హితోపదేశం చెబుతోంది. ఆలోచనలో సందిగ్ధత ఏర్పడినప్పుడు జ్ఞానులను సంప్రదించి వారు చూపే మార్గాన్ని అనుసరించాలి. అవివేకి, శ్రద్ధారహితుడు అయిన సంశయాత్ముడికి ఈ లోకంలో కాని, పరలోకంలో కాని సుఖం లభించదని, అజ్ఞాన జనితమైన సందేహాలను విజ్ఞానమనే ఖడ్గంతో రూపుమాపాలని గీతోపదేశం. భగవద్గీతను పఠించి, అర్థం చేసుకుని, అనుసరించడమే మానవధర్మం.

- ఇంద్రగంటి నరసింహమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని