సామరస్యవాదన

ఇద్దరు వ్యక్తులు సామరస్యంగా, సంస్కారంతో చర్చించుకోవడం వల్ల అభిప్రాయ భేదాలు తొలగిపోయి వారి మధ్య అవగాహన ఏర్పడుతుంది. దీన్నే సంవాదం అంటారు. మంచి వ్యక్తుల మధ్య జరిగే సంవాదం మంచి ఫలితాలను ఇస్తుంది. మరికొందరు అహంకారాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోలేక సహనం కోల్పోయి వాగ్వాదాలకు దిగి పరిస్థితిని వివాదాస్పదం చేసుకుంటారు.

Published : 20 Sep 2022 00:32 IST

ద్దరు వ్యక్తులు సామరస్యంగా, సంస్కారంతో చర్చించుకోవడం వల్ల అభిప్రాయ భేదాలు తొలగిపోయి వారి మధ్య అవగాహన ఏర్పడుతుంది. దీన్నే సంవాదం అంటారు. మంచి వ్యక్తుల మధ్య జరిగే సంవాదం మంచి ఫలితాలను ఇస్తుంది. మరికొందరు అహంకారాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోలేక సహనం కోల్పోయి వాగ్వాదాలకు దిగి పరిస్థితిని వివాదాస్పదం చేసుకుంటారు. ఇలాంటి వాదనల వల్ల వ్యక్తుల మధ్య అంతరాలు మరింతగా పెరుగుతాయి.

వాక్కు అనేది సరస్వతికి ప్రతీక. వాదన నుంచి సత్య వాక్యాలు వెలువడాలి తప్ప ఊకదంపుడు కబుర్లు కాదు. అపరిమిత అసత్యాలను పలికి అవహేళనకు గురి కాకూడదు. ఆత్మీయత, స్నేహశీలత, ఆశాభావం లాంటి మధుర భావనలు మన మాటల్లో ప్రతిబింబించాలి. వాదనలు ఎప్పుడూ శాస్త్రచర్చలా ఉండాలంటారు విజ్ఞులు. అలాంటి వాదనలు కొత్త విషయాలను అందిస్తాయి. వాస్తవాలను ప్రతిబింబిస్తాయి.

రామాయణంలో సీతాపహరణం తరవాత రావణుడికి విభీషణుడు అనేక హితోక్తులు చెబుతూ... ‘అన్నా! సీతమ్మ మహా పతివ్రత. సాధ్వీమణులకు చెడు తలపెట్టిన వాళ్లు నశించిపోతారు. నువ్వు చేస్తున్న పాపం ఘోరమైంది. నా మాట విని సీతమ్మను శ్రీరాముడి వద్దకు సగౌరవంగా తీసుకువెళ్ళి అప్పజెప్పు’ అంటాడు.

రావణుడి చెవికి ఈ సూక్తులు ఎక్కలేదు. తమ్ముడిని దూషించాడు. ‘నన్ను దేవతలు సైతం గెలవలేరు. ఇక ఓ నరుడా నన్ను జయించేది? పగవాడి మేలు కోరే నీలాంటి సోదరుణ్ని ఏ మాత్రం సహించకూడదు. పో ఇక్కడినుంచి!’ అని రావణుడు విభీషణుడిని తరిమేశాడు. అహంకారం తలకెక్కిన రావణుడు తన వాదనే సమంజసమైందని చెప్పి పతనాన్ని  కొనితెచ్చుకొన్నాడు.

అహంకారం, పరుషవాక్కు, విరోధం, చెడ్డగా వాదించడం, చేయదగినది చేయదగనిది అనే విచక్షణ లేకపోవడం అనేవి మూర్ఖుడి లక్షణాలుగా మన ధర్మశాస్త్రాలు వివరించాయి. భారతంలో దుర్యోధనుడి మనసు ఈ లక్షణాలతో నిండి ఉంది. శ్రీకృష్ణ రాయబారం సమయంలో సభలోని పెద్దలంతా మూకుమ్మడిగా తమ వాదనలతో దుర్యోధనుడి మనసు మార్చడానికి ప్రయత్నించారు. అతడు మాత్రం తగ్గడానికి ఇష్టపడలేదు. తన తప్పిదాన్ని అంగీకరించలేదు. ఎవరు ఎంతలా నచ్చజెప్పినా వినకుండా కడకు నాశనాన్ని కోరి కొనితెచ్చుకొన్నాడు.

వాదనలో ఓడినవారిని సైతం గౌరవించే సంస్కృతి మనది. అద్వైత సిద్ధాంత ప్రచార పర్వంలో భాగంగా ఆదిశంకరులు మండన మిశ్రుడితో వాదన జరిపారు. ఆ వాదనకు న్యాయనిర్ణేత మండన మిశ్రుడి భార్య ఉదయ భారతి. వాదనలో ఓడిన మండన మిశ్రుణ్ని శృంగేరి పీఠాధిపతిగా ఆదిశంకరులు నియమించారు.

ఎలాంటివారైనా కొన్ని సందర్భాల్లో కోపతాపాలకు గురికావచ్చు. అలాంటి పరిస్థితుల్లో వాదోపవాదాలకు దిగకుండా సంయమనం పాటించాలి. మాటకు మాట అనే స్వభావాన్ని విడనాడగలిగితే వివాదాలు తలెత్తవు.

‘నా అభిప్రాయమే సరైనది... ఇతరులు ఏం చెప్పినా తప్పేనని వితండవాదం చేసేవారు ఎప్పటికీ పరమసత్యం తెలుసుకోలేరు...’ అన్నారు రామకృష్ణ పరమహంస. అందుకే ఏ మనిషైనా వ్యర్థ ప్రసంగాలకు దూరంగా ఉండి మంచి పనులతో జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అప్పుడే అతడికి ఆ పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది.

- విశ్వనాథ రమ

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని