ముక్తికి మార్గం భక్తే

భక్తి- పలకడానికి చాలా చిన్న పదం. కానీ ఏ వ్యక్తి అయినా నిర్మల, నిశ్చలమైన భక్తిమార్గంలో పయనిస్తే తద్వారా వారికి లభించే ఫలితాంశం- అద్భుతం, అమృతమయం. భగవంతుణ్ని ప్రేమించడంలో, పూజించడంలో, సేవించడంలో, కీర్తించడంలో కలిగే అనురాగమే

Published : 21 Sep 2022 00:55 IST

క్తి- పలకడానికి చాలా చిన్న పదం. కానీ ఏ వ్యక్తి అయినా నిర్మల, నిశ్చలమైన భక్తిమార్గంలో పయనిస్తే తద్వారా వారికి లభించే ఫలితాంశం- అద్భుతం, అమృతమయం. భగవంతుణ్ని ప్రేమించడంలో, పూజించడంలో, సేవించడంలో, కీర్తించడంలో కలిగే అనురాగమే భక్తి అంటూ చక్కటి వివరణ ఇచ్చారు వేద వ్యాసులవారు. పరమాత్ముడు సర్వజీవుల్లో ఉన్నాడు. ప్రతి జీవిపై ప్రేమ కలిగి ఉండటమే నిజమైన భక్తి అంటూ సూక్ష్మ పద్ధతిలో భక్తి గురించి తెలియజేశారు నారదమహర్షి. ఆత్మానందానికి దోహదపడే విషయాలను ప్రోత్సహించే ప్రక్రియే భక్తి అంటూ వివరించారు శాండిల్య మహాముని. అన్నింటికీ ఆధారభూతమైన పరమాత్మ తత్త్వచింతనను భక్తి అని చెప్పుకోవాలి అంటారు జగద్గురువు ఆదిశంకరాచార్య.

మోక్షాన్ని సాధించే ముఖ్యమార్గాల్లో భక్తిని ఎన్నుకొని దానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు జ్ఞానజనులు. కలియుగంలో మోక్షసాధనకు అనువైన, అవసరమైన మార్గాల్లో భక్తి మార్గమే విశిష్టమైనదని ఆదిశంకరులవారు పలుచోట్ల వివరించారు. స్వార్థపూరితమైన కోర్కెలు మనిషిలో అంకురించాయంటే చిత్తశుద్ధికి ఆటంకమేర్పడి పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సముపార్జనకు, తద్వారా లభించే మోక్షగతికి అడ్డుకట్ట వేసినట్టవుతుంది. 

భక్తి తొమ్మిది రకాలు- శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, సఖ్యం, ఆత్మనివేదనం, పాదసేవనం, దాస్యం. సర్వేంద్రియాలను భగవంతు డిపైనే నవవిధ భక్తుల్లో ఏదైనా పాటిస్తూ తమ సర్వస్వాన్ని ఎవరైతే అర్పించగలుగుతారో వారే నిజమైన భక్తులు. అలా అర్పించడాన్ని పరమ భక్తి అంటారు. భక్తి మార్గాన్ని భక్తియోగం అనీ అంటారు. నారదుడు, వాల్మీకి, హనుమంతుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు, పోతన... వంటి మహ నీయులు నవవిధ భక్తి మార్గాల్లో వారికి అనుకూలమైనదాన్ని అను సరించి ఆత్మజ్ఞానాన్ని పొంది మాన వాళికి మార్గదర్శకులై నిలిచారు.

భాగవతంలో పోతన రచించిన మధురాతి మధుర ఘట్టాల్లో కుచేలోపాఖ్యానం ఒకటి. లౌకిక, వేదాంత విషయాలు రెండూ మేళవించి రచించిన గాథ అది. నవవిధ భక్తిమార్గాల్లో సఖ్యభక్తి మార్గానికి చెందిన కథ ఇది. స్నేహితుల పట్ల ధన మదాంధతను ప్రకటించరాదని, వారికి సాయం చేయడమే కర్తవ్యంగా భావించడం స్నేహధర్మమని అది చెబుతోంది. కుచేలం అంటే జీర్ణవస్త్రం. కుచేలుడు సుచేలుడు కావాలంటే శ్రీహరి కటాక్షం ఉండి తీరాలన్న ఆధ్యాత్మిక రహస్యం ఇందులో ఇమిడి ఉంది. భక్తి అన్నది సంపూర్ణ విశ్వాసంతో నిండి ఉండాలి. అంతా ఆ పరమాత్మే అనే నమ్మకం ప్రధానం.

ఆదిశంకరుల వారు శివానందలహరిలో జ్ఞాని అయిన భక్తుడు మానసిక పూజలో తన హృదయాన్ని భగవంతుడికి ఆలయంగా చేసి శమ దమాలతో స్థలశుద్ధి చేసి అందులో సర్వేశ్వరుణ్ని ప్రతిష్ఠించమన్నారు. ఈ పూజా విధానంలో ధూప, దీప, నైవేద్యాలు ఏవీ పెట్టనక్కరలేదు. కేవలం తన మనసులోనే అన్నీ సిద్ధం చేసి పూజ చేసుకొంటున్నట్టు భావించాలి. చివరికి సర్వం ఆ పరమేశ్వరుడికే సమర్పించినట్టుగా చెప్పుకోవాలి. దీనికి పరిపక్వత చెందిన భక్తి ప్రధానం. చిత్తశుద్ధితో పూజలు చేస్తూ అదే విశ్వాసంతో భక్తి అనే నావలో పయనం సాగిస్తే భవసాగరాన్ని సులభంగా దాటుకోగలం అంటారు శంకరులవారు. ఆయన సూచించిన దారిలో మనమూ పయనిద్దాం.

- యం.సి.శివశంకర శాస్త్రి

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని