మయూరుడి సూర్యశతకం

సూర్యుడు ప్రత్యక్ష దైవం. సకల జగతికి చైతన్యకారకుడు. కర్మసాక్షి. సూర్యుడి పరంగా వివిధ భాషల్లో వివిధ ప్రక్రియల్లో అపారమైన సాహిత్యం వెలువడింది. సంస్కృతంలో మయూరుడు రచించిన సూర్యశతకం సౌరసాహితిలో శ్రేష్ఠమైన కావ్యం. మయూరభట్టు కశ్మీర ప్రాంతానికి చెందిన కవి.

Published : 25 Sep 2022 00:52 IST

సూర్యుడు ప్రత్యక్ష దైవం. సకల జగతికి చైతన్యకారకుడు. కర్మసాక్షి. సూర్యుడి పరంగా వివిధ భాషల్లో వివిధ ప్రక్రియల్లో అపారమైన సాహిత్యం వెలువడింది. సంస్కృతంలో మయూరుడు రచించిన సూర్యశతకం సౌరసాహితిలో శ్రేష్ఠమైన కావ్యం. మయూరభట్టు కశ్మీర ప్రాంతానికి చెందిన కవి. క్రీ.శ. ఏడో శతాబ్దానికి చెందినవాడు. హర్షుడి ఆస్థానకవి. బాణుడు కూడా హర్షుడి ఆస్థానంలో ఉండేవాడు. అతడు మయూరుడి అల్లుడని కొందరు భావిస్తున్నారు. పద్మగుప్తుడు రచించిన ‘నవసాహసాంక’ చరిత్రనుబట్టి బాణమయూరులకు స్పర్ధ ఉండేదని తెలుస్తోంది. ఒక సందర్భంలో బాణుడు కోపంతో మయూరుణ్ని కుష్ఠురోగివి కమ్మని శాపం ఇస్తే మయూరుడు ఆగ్రహించి ప్రతిశాపం ఇచ్చాడట. మయూరుడు సూర్యశతకం రాసి శాపవిముక్తి పొందగా, బాణుడు చండీ శతక రచనతో శాపంనుంచి విముక్తుడయ్యాడని జనశ్రుతి. ఈ ఉదంతానికి సంబంధించిన శ్లోకాలూ ప్రచారంలో ఉన్నాయి. ఇందులో సత్యమెంత ఉన్నా ఇద్దరూ సమకాలికులనే విషయం చారిత్రక వాస్తవం.

మయూరుడి సూర్యశతకంలో సూర్యకిరణాలు, సూర్యాశ్వాలు, రథసారథి అరుణుడు, సూర్యమండలం అనే అంశాల వర్ణన ఉంది. సూర్యుడు ప్రకాశించేటప్పుడు భూమ్మీద జరిగే పరిణామాలు, సూర్యుడి సార్వ భౌమత్వం... శతకంలో చోటు చేసు కొన్నాయి. సూర్య తత్వాన్ని విపులంగా వివరించాడు. కవి స్రగ్ధర ఛందస్సులో శతకం రాశారు. శైలి ఓజో గుణ ప్రధానం. గౌడీ రీతిలో ఉంది. కవిత్వం ప్రౌఢమైంది.

కవి ప్రతి శ్లోకం చివర లోకులకు సూర్యుడు శుభం కలిగించాలని, ప్రజల్ని రక్షించాలని, వారి పాపాలు నశింపజేయాలని ప్రార్థించాడు. తన ఆరోగ్యం కాంక్షించి మయూరుడు ఈ రచన చేసినట్లు జనంలో ప్రచారం ఉన్నా లోక కల్యాణమే లక్ష్యంగా రచన సాగినట్లు స్పష్టమవుతోంది.

సూర్యకిరణాల వైశిష్ట్యాన్ని కవి అనేక విధాలుగా వర్ణించాడు. అవి సమూహంగా ఏకైక వస్తువు. వివిధ ప్రాణులు వస్తువుల రూపాలను తమ రెండు కళ్లతో చూడటానికి సహకరిస్తాయి. కనుక, రెండు నేత్రాల వంటివి. ముల్లోకాల్లోనూ బ్రహ్మదేవుడి నాలుగు నోళ్ల నుంచి సూర్య స్తుతి వినిపిస్తుంది. సూర్య కిరణాలు అగ్ని రూపాలు గనుక పంచభూతాల్లో అయిదోదిగా ఉన్నాయి. రవి కిరణాలు ఆరు రుతువుల్లోనూ ఆరు విధాలుగా ఉంటాయి. సప్తరుషులు నిత్యం సూర్య తేజాన్ని నుతిస్తారు. సూర్యకిరణాలు అష్ట దిక్కుల్ని ఆశ్రయించి ఉంటాయి. అవి ప్రాతః కాలంలో నవత్వాన్ని అంటే కొత్తదనాన్ని పొందుతాయి. నవ అంటే తొమ్మిది అనే అర్థం ఉంది కదా. సూర్యుడు సహస్ర కిరణుడు. వెయ్యి అంటే దశశతకం. ఈ విధంగా బహుసంఖ్యా భేదాన్ని ఇవి సూచిస్తున్నాయని కవి చమత్కారం.

సూర్యరశ్మి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. వృక్ష జాతులు పెరుగుతున్నాయి. సకల ప్రాణులకు ఆహారం లభిస్తోంది. ఈ విధంగా రవి జగదుత్పత్తికి, వృద్ధికి, స్థితికి హేతువై తానే బ్రహ్మగా, విష్ణువుగా పాత్ర నిర్వహిస్తున్నాడు. భానుడు తన వివిధ ధర్మాల మూలంగా శివుడి అష్టమూర్తిగానూ ప్రకాశిస్తున్నాడు. ఇటువంటి విలక్షణమైన భావాలను పొందుపరచిన కవి- వేదాలు సూర్యభగవానుడి రూపమేనంటాడు.

శ్రీనాథుడు కాశీఖండంలో ఈ శతకంలోని కొన్ని శ్లోకాలను ఆంధ్రీకరించాడు. వేదపురాణ శాస్త్రాల్లోని విభిన్నాంశాలను ప్రతిబింబించే ఈ శతకం ఉత్తమ పారాయణ గ్రంథం. సూర్యోపాసకులకు కల్పతరువు.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని