దుర్గమ్మ - బతుకమ్మ

భారతీయ సంస్కృతిలో, సంప్రదాయాల్లో ప్రతి పండుగ వెనకా స్పష్టమైన ఆలోచన, ప్రణాళిక ఉంటాయి. పండుగ పూట మన పెద్దలు నిర్దేశించిన విధి విధానాల్లో వివేకం తొంగిచూస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో అవి ఇహపరాలు రెండింటికీ ముడివడి ఉంటాయి. ‘పండగ చేస్కో’ అనేది- తెలుగు

Updated : 26 Sep 2022 04:32 IST

భారతీయ సంస్కృతిలో, సంప్రదాయాల్లో ప్రతి పండుగ వెనకా స్పష్టమైన ఆలోచన, ప్రణాళిక ఉంటాయి. పండుగ పూట మన పెద్దలు నిర్దేశించిన విధి విధానాల్లో వివేకం తొంగిచూస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో అవి ఇహపరాలు రెండింటికీ ముడివడి ఉంటాయి. ‘పండగ చేస్కో’ అనేది- తెలుగు నాట వినిపించే ఊతపదం. మామూలు రోజుల కన్నా, ఉత్తేజంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిస్తే- అది మనిషికి పండుగరోజే. అలా ప్రత్యేకంగా విశేషంగా రోజు గడవాలంటే- మనిషి ‘నేను’ లోంచి ‘మనం’లోకి ప్రవేశించాలి. ఒంటరితనం విడిచి, సంఘజీవనానికి మారాలి. పండుగంటే- మనిషి ఏకవచనం నుంచి బహువచనానికి ప్రయాణం. పండుగరోజుల్లో మన పెద్దలు రూపొందించిన ఆచార వ్యవహారాల్లోని అంతస్సూత్రం ఇదే! ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకున్నప్పుడే- పండుగల నేవళీకంతో, ఆచార వ్యవహారాలలోని ఆంతర్యాలతో మనకు పరిచయం ఏర్పడుతుంది.

ఉదాహరణకు శరదృతువులోని దసరా నవరాత్రులను పరిశీలించండి... దసరా అంటే భారతీయ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వికాసానికి బలమైన ఆసరా! అమ్మవారి మహాచైతన్య విభూతి మనసును ఆవరించే అద్భుతమాసం- ఆశ్వయుజం. శరత్కాల ఆగమనం మానవులకే కాదు... ఇటు భూదేవికి, అటు ఆకాశలక్ష్మికి సైతం ప్రమోదదాయకం అన్నాడు నన్నయభట్టు. నన్నయ్య చెప్పినది ఇహపరాల కోణంలోంచే కాదు- జీవావరణ, పర్యా వరణ కోణాల్లోంచీ ఆకళించుకోదగిన మాట. దసరా రోజుల్లో భక్తులందరూ ఆరాధించే అమ్మ, పోతన మాటల్లో చెప్పాలంటే- ‘అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ’. రాజరాజేశ్వరి మహాకాళి గాయత్రి దుర్గ లక్ష్మి సరస్వతి... వంటి వైదిక దేవతా మూర్తుల రూపంలో పూజలందుకొనే అమ్మ జగన్మాత. మరోవైపు ఎల్లమ్మ పోలమ్మ పోలేరమ్మ చెంగాళమ్మ వంటి గ్రామ దేవతల పేర్లతో విశేషంగా ఆకర్షించే అమ్మ. అమ్మ ప్రాదుర్భావ విశేషాలను ఇలా అన్ని కోణాల్లోంచి విస్తారంగా వర్ణించి చెబుతూ శ్రీదేవీ భాగవతం- సృష్టికి మూలమైన లలిత పరాభట్టారిక పట్ల ఈ జాతికి జగన్మాతృ భావనను అలవరచింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ వైవిధ్యం దసరా రోజుల్లో స్ఫుటంగా గోచరిస్తుంది. అటు వైదిక, ఇటు గ్రామదేవతల చైతన్యానికి పట్టం కడుతుంది. తెలుగు నేలపై దసరా వేడుకలు జ్ఞానపథానికి గీటురాళ్లు. తెలంగాణ బతుకమ్మ సంబురాలు జానపదానికి అచ్చమైన ఆనవాళ్లు. రెండూ ఒకే సమయంలో వస్తాయి. సమైక్య జీవన సరాగ మాలికలను ఆలపిస్తూ, జనాల్ని కలుపుకొంటూ సాగుతాయి. దుర్గామాతది మార్మిక పథం. బతుకమ్మది పూలరథం. రెండింటా మట్టివాసన ఒక్కటే. పేర్లు వేరైనా చైతన్యం ఒకటే. లలితా సహస్రంలోని ‘ప్రాణదా’ అన్న పిలుపులోని ప్రతిధ్వనే- బతుకమ్మ. ప్రాణదా- అంటే బతుకునిచ్చేది, జీవం నింపేదని అర్థం. లలితా సహస్రంలోని ప్రాణభూతమైన అంశమే - బతుకమ్మ ఆరాధనల సారాంశం. మానవాళి సుఖశాంతులతో హాయిగా జీవించాలన్నదే- దసరా, బతుకమ్మ పండుగల సంబరాల ఆంతర్యం. బంగారు బతుకమ్మ సిగలో శోభిల్లే గుమ్మడి పూవులాంటి నిర్మల గ్రామీణ హృదయాల్లోని ప్రతి ఆకాంక్ష- దుర్గమ్మ ఆరాధనలో మిన్ను ముట్టే వైదిక మంత్రాల్లోని జగత్కల్యాణ కాంక్షే.

‘మీరు కోరే వరం జగానికి ఉపకారం కావాలి... అప్పుడే ఆ సత్కార్యానికి నన్ను నేను వ్యక్తపరచుకొంటాను’ అని దేవీ మాహాత్మ్యంలో అమ్మ వాగ్దానం చేసింది. అంటే స్వార్థాన్ని విడిచి పరమార్థం దిశగాను, నలుగురికి ప్రయోజనం సిద్ధించే దిశగాను జీవితాన్ని మలచుకోవాలని అర్థం. పండుగలు ఏకవచనాన్ని బహువచనంగా మారుస్తాయన్న మాటకు అదే అంతరార్థం!

- ఎర్రాప్రగడ రామకృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు