తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు

శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా భక్తులు ఆరాధించే దివ్య స్వరూపుడు! యజ్ఞయశస్సు, స్థలతేజస్సు, ఉత్సవ ఉషస్సు సమ్మిళితమైన తిరుమల క్షేత్రం భూలోక వైకుంఠంగా భాసిల్లుతోంది.

Updated : 27 Sep 2022 06:47 IST

శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిగా భక్తులు ఆరాధించే దివ్య స్వరూపుడు! యజ్ఞయశస్సు, స్థలతేజస్సు, ఉత్సవ ఉషస్సు సమ్మిళితమైన తిరుమల క్షేత్రం భూలోక వైకుంఠంగా భాసిల్లుతోంది. శ్రీనివాస పరంజ్యోతి తిరుమల సన్నిధి వార్షిక బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. ప్రతి సంవత్సరం సూర్యుడు కన్యారాశిలో ఉన్న మాసంలో చిత్తా నక్షత్రం నుంచి శ్రవణా నక్షత్రం ఉన్నరోజు వరకు నవనవోన్మేషంగా, నయనానందకరంగా బ్రహ్మోత్సవ సంరంభం కొనసాగుతుంది. వరాహ, భవిష్యోత్తర స్కాంద పురాణాల్లో శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రశస్తి కనిపిస్తుంది. తిరుమలేశుడికి ఏటా నిర్వహించే నాలుగు వందల పైచిలుకు ఉత్సవాలలో సర్వోత్కృష్టమైన కైంకర్యం- బ్రహ్మోత్సవ సంబరం!

చారిత్రకంగా పరిశీలిస్తే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి 58కి పైగా శాసనాలు అనేక విషయాల్ని వెల్లడిస్తున్నాయి. క్రీ.శ. 966 సంవత్సరంలో పల్లవరాణి పేరిందేవి శాసనం నుంచి క్రీ.శ. 1606 సంవత్సరం బొక్కసం కృష్ణయ్యర్‌ శాసనం వరకు అన్నీ బ్రహ్మోత్సవ వైభవాన్ని విశ్లేషిస్తున్నాయి. క్రీ.శ. 1254లో పల్లవరాజు విజయగండ గోపాల దేవుడు ‘ఆడి తిరునాళ్లు’ పేరుతో, క్రీ.శ. 1328లో తిరువేంకటనాథ రాయలు ‘దేవదివ్యోత్సవాలు’ పేరుతో బ్రహ్మోత్సవాల్ని నిర్వహించారు.

పరమాత్ముడైన పరంధాముడు తనను దర్శించడానికి వచ్చిన భక్తుల సమక్షానికి తానే మలయప్పగా సపరివారంగా తరలిరావడం బ్రహ్మోత్సవ ప్రత్యే కత! తిరుమాడ వీధుల్లో బారులు తీరిన భక్తజన సందోహం మధ్యకు సర్వాలంకార శోభితంగా, ఇరు దేవేరులతో కోనేటిరాయడు వివిధ వాహనాలపై విచ్చేస్తాడు.

బ్రహ్మోత్సవ సందడిలో ప్రాభవమంతా ఉత్సవమూర్తి మలయప్పస్వామిదే! భోగ శ్రీనివాస, కొలువు శ్రీనివాస, ఉగ్ర శ్రీనివాస అనే ‘ఉత్సవ బేరాలు’ ఉన్నా, ఉత్సవ వైభవమంతా 14వ శతాబ్దం నుంచీ మలయప్పకే ఆపాదితమవుతోంది. ‘బృహత్తర- వృద్ధితమ’ అనే జంట సంప్రదాయాలతో తొమ్మిది రోజులపాటు నిర్విరామంగా కొనసాగే బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఉదయం, సాయంత్రం శ్రీవారు రెండు వాహనసేవల్ని స్వీకరిస్తారు. స్వామి విహరించే వాహనాలన్నీ వైవిధ్యమైన శక్తులకు, విలక్షణ యుక్తులకు ప్రతీకలు. ఈ వాహన సేవలు శుభదాయక సందేశాల్ని అందిస్తాయి. శేషవాహనం నిత్య చైతన్యాన్ని, హంస నిర్మల హృదయాన్ని, సింహం మనోస్థైర్యాన్ని, ముత్యపు పందిరి ఆనందతత్త్వాన్ని, కల్పవృక్షం అభీష్ట సిద్ధిని, సర్వభూపాలం కీర్తిని, గరుడం అమేయశక్తిని, హనుమంతం బుద్ధిశక్తిని, గజం దార్శనికతను, సూర్యచంద్ర ప్రభలు క్రాంతిర్మయత్వాన్ని, అశ్వం కాలనియమ విచక్షణను సంకేతిస్తాయి.

శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం అంకురార్పణతో ఆరంభమవుతుంది. ఇది మానవ దేహం ఆవిష్కారాన్ని సూచిస్తుంది. అంకురించిన ఆ చిగురులోనూ ఆత్మతత్త్వం ప్రకటితమవుతుంది. ఈ ఆత్మశోధనలో జీవి, తన జన్మకు ముందు తొమ్మిది నెలలపాటు గర్భాలయంలో కొలువై ఉంటుంది. ఈ తొమ్మిది నెలలకు ప్రతిఫలనంగా పరంధాముడు తొమ్మిదిరోజులపాటు జీవుల ఆత్మోద్ధరణకు పలు వాహనాలపై ఊరేగుతాడు. ఆత్మకు అభ్యున్నతి చేకూర్చడానికి పరమాత్మే జీవులకు ఎన్నో అలౌకికమైన సందేశాల్ని అనుగ్రహిస్తాడు. శ్రీవారి అనుగ్రహ విశేష సమాహారమే- బ్రహ్మోత్సవ దివ్యదర్శనం!

- డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని