అనుబంధం-ఆత్మీయత

భారతీయ సనాతన ధర్మశాస్త్రాల్లో కుటుంబ వ్యవస్థ అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది. పూర్వం సమాజంలో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. తల్లిదండ్రులు, కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు... ఇలా అంతా కలిసి ఒకే ఇంట్లో ఒకే పరివారంగా, పరస్పరానురాగాలతో ...

Published : 29 Sep 2022 00:57 IST

భారతీయ సనాతన ధర్మశాస్త్రాల్లో కుటుంబ వ్యవస్థ అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది. పూర్వం సమాజంలో ఎక్కువగా ఉమ్మడి కుటుంబాలే ఉండేవి. తల్లిదండ్రులు, కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు... ఇలా అంతా కలిసి ఒకే ఇంట్లో ఒకే పరివారంగా, పరస్పరానురాగాలతో జీవనం సాగించేవారు. తల్లిదండ్రులు ఆ ఇంటి యజమానులు. వాళ్ల మార్గనిర్దేశనంలో అంతా నడుచుకునేవారు. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు పెద్దవారిని చిన్నవాళ్లు సంప్రదించి, పరిష్కరించుకునేవారు. పరస్పరం సదవగాహన ఉండేది. పెద్దల పట్ల ఆదరాభిమానాలుండేవి. ‘గృహమే స్వర్గసీమ’ అనే పావన భావన ఉండేది. కాలక్రమంలో సమష్టి కుటుంబాలు వ్యష్టి కుటుంబాలుగా పరిణమిస్తూ వచ్చాయి. దేశకాల పరిస్థితుల వల్ల అయితేనేమి, ఆర్థిక అవసరాలవల్లనైతేనేమి- తల్లిదండ్రులను విడిచి, పిల్లలు ఉద్యోగరీత్యా వేరే నగరాలకో దేశాలకో వలసపోతున్నారు. ఫలితంగా సంబంధ బాంధవ్యాలు సన్నగిల్లుతున్నాయి. అనుబంధాలను, ఆత్మీయతను కొనసాగించుకునేందుకు సాంకేతిక సాధనాలు కొంతమేరకు సహకరిస్తున్నాయనడం అక్షరసత్యం.

జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఎన్నటికీ తీరేది కాదు. జీవితాంతం వాళ్ల సేవ చేయడం, ప్రేమించడం బిడ్డల ధర్మం. పూలగుత్తిలోని రంగు రంగుల పూలు కలిసి ఆకర్షణీయంగా ఉంటాయి. అలాగే కుటుంబంలోని సభ్యులంతా ఐకమత్యంతో, ప్రేమానురాగాలతో, పరస్పర సహకారంతో మెలగుతుంటే వారి అనుబంధ సుగంధం అంతటా విస్తరిస్తుంది. వారి ఆత్మీయత ఆదర్శవంతమై సమాజానికి దిక్సూ చిలా దర్శనమిస్తుంది.

కుటుంబ సభ్యులంతా ఏక మనస్కులై తమ తమ విధులు నిర్వర్తిస్తున్నప్పుడు, ఆ విధులే కుటుంబానికి నిధులై సుఖశాంతుల సుధలుగా మారిపోతాయి. కుటుంబ గౌరవ వృద్ధికి ఇవే మూలసూత్రాలని వేదాలు చెబుతున్నాయి. కుటుంబ సభ్యుల మనస్తత్వాలు వేర్వేరుగా ఉండటం సహజం. విభిన్న అభి ప్రాయాలుంటాయి. వ్యక్తిగత కార ణాలవల్ల, క్షణికోద్రేకాలవల్ల, మాన సిక ఒత్తిళ్ల వల్ల తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లుతోందన్న దుగ్ధవల్ల కొందరు కుటుంబం నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నారు. పొరపొచ్చాలు క్షణికమని, శాశ్వతం కావని గ్రహించి కొంచెం సహనం, సర్దుబాటు తత్త్వం అలవరచుకోవడం అవసరం.

రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్యగల పరస్పరానురాగ అనుబంధం అందరికీ అనుసరణీయమైంది. ధర్మరాజు జూదంలో సర్వం కోల్పోయినప్పుడు ద్రౌపదితోపాటు తమ్ముళ్లందరూ అన్నగారితో అడవులకు వెళ్ళారు. ఎదురైన కష్టాల్లో అంతా పాలుపంచుకున్నారు. అనుబంధాన్ని, ఆత్మీయతను అహర్నిశలూ పెంచుకున్నారు.

దేవతలు క్షీరసాగర మథనంలో లభించిన అమృతాన్ని పంచుకుని తాగారు. అదే అమృతం తల్లిదండ్రులకు దొరికితే వాళ్లు తాగక, ముందు తమ బిడ్డలకు ఇస్తారు. తల్లిదండ్రుల త్యాగాన్ని మించినదేమీ లేదు. నేడు దురదృష్టవశాత్తు చాలామంది తమ బిడ్డల అలక్ష్యానికి గురి అవుతున్నారు. వృద్ధాశ్రమాల సంఖ్య పెరగడానికి అదీ ఓ కారణం. దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు వీలున్నంత తరచుగా తమ వాళ్లనందర్నీ ప్రేమగా పలకరించే సంస్కారం అలవాటు కావాలి. పండగలకు, పబ్బాలకు అందరూ కలిసి సత్కాలక్షేపం చేయాలి. బంధువులందర్నీ తమ పిల్లలకు పరిచయం చెయ్యాలి. అనుబంధం, ఆత్మీయతకు పట్టం కట్టడమే మన భారతీయ సంస్కృతి. ఎంత దూరాన ఉన్నా, ఒకరికొకరు ఆలంబనగా నిలవడమే భారతీయ సంప్రదాయం.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని