జీవన యోగం

మనిషికి పుట్టుకతోనే నవ్వు, ఏడుపు, భయం వంటి కొన్ని సహజ సిద్ధమైన లక్షణాలు వస్తాయి. నవ్వడం యోగం, ఏడవడం రోగం అన్నారు పెద్దలు. మనిషి పెరిగేకొద్దీ నవ్వు నాలుగు విధాల చేటు అని భావించి, తక్కువగా నవ్వడం, ఇతరుల అభ్యున్నతి చూసి

Published : 01 Oct 2022 00:36 IST

మనిషికి పుట్టుకతోనే నవ్వు, ఏడుపు, భయం వంటి కొన్ని సహజ సిద్ధమైన లక్షణాలు వస్తాయి. నవ్వడం యోగం, ఏడవడం రోగం అన్నారు పెద్దలు. మనిషి పెరిగేకొద్దీ నవ్వు నాలుగు విధాల చేటు అని భావించి, తక్కువగా నవ్వడం, ఇతరుల అభ్యున్నతి చూసి ఎప్పుడూ ఏడవడాన్ని అలవాటు చేసుకోవడం దురదృష్టకరం. నవ్వు మనసును శాంతపరచే ఆహ్లాదకరమైన లక్షణం. అది ఒక్కరినే కాదు- చుట్టూ ఉన్న అందరినీ సంతోషంలో ముంచెత్తుతుంది.

ఏడుపులో అంతటి శక్తి ఉండదు. అది కొద్దిమందినే ప్రభావితం చేస్తుంది. భయం మనిషిని ఆవహించి ఉండే మానసిక రుగ్మత. అది ఒక బలహీనత. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పసితనం నుంచి భయాన్ని నూరిపోస్తారు. అది చేయవద్దు, ఇలా ప్రవర్తించవద్దు అని అతి జాగ్రత్త చూపుతారు. తమకు తెలియకుండానే ఏం చేస్తారోనన్న భయంతో ప్రతిదాన్నీ భూతద్దంలో చూపి భయం కలిగే విధంగా హెచ్చరిస్తారు. పర్యవసానంగా, పిల్లల్లో భయం ఆవహించి ప్రతిదానికీ జంకుతూ వణికిపోతారు. ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఏమీ సాధించలేరు. అసలు ప్రయత్నం కూడా చేయరు. ఈ భయాన్ని భాగవతంలో రజ్జు సర్ప భ్రాంతిగా వర్ణించారు. తాడును చూసి పాముగా భయం చెందడమన్నమాట.

చీకట్లో ఒక వ్యక్తి నూతి వద్దకు వెళ్ళి గట్టుమీద మెలికలు తిరుగుతూ ఉన్నట్టు పడి ఉన్న తాడును చూసి పాము పాము అని అరిచాడు. అందరూ చేరి తలొక విధంగా ఊహాగానాలు చేశారు. ఇంతలో దీపాన్ని వెలిగించి చూస్తే- అది పాము కాదు, తాడు అని తెలిసి నవ్వుకున్నారు. మనిషి భయం సైతం అలాంటిదే.

తెలియని విషయాలను అతిగా ఊహించుకొని భయం భయంగా అపజయం పొందుతుంటారు. అదే అజ్ఞాన అంధకారం. దాన్ని తొలగించడం కోసమే సుజ్ఞానాన్ని మహర్షులు ఉపనిషత్తులు పురాణాలుగా అందించారు.

ఏ విషయాన్ని అయినా కూలంకషంగా అధ్యయనం చేయాలి. అర్థం చేసుకోవాలి. అంతరార్థం గ్రహించాలి. అన్నీ వేదాల్లో ఉన్నాయని పెద్దలు చెబుతారు కానీ, వాటిని అవగాహన చేసుకొనే జ్ఞానం అందరికీ ఉండదు. అందుకే శంకరాచార్యులవారు వేదాలకు, అనేక శాస్త్రాలకు భాష్యాలు రచించారు. అవి సామాన్యులకు మరింతగా చేరువై వారిలోని భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో ఎన్నో ఆధ్యాత్మిక రచనలు నేడు వెలుగు చూస్తున్నాయి.

మూఢాచారాలు, నమ్మకాలు, దుష్ట గ్రహ దోషాలు గ్రహ శాంతి పేరిట అమాయకులను పీడిస్తుంటారు కొందరు. వాటితో వారి వ్యాపారం కూడా లాభసాటిగా సాగుతోంది. సంప్రదాయం, ఆచారం మనిషిని మంచి వైపు నడిపించాలి. సంస్కారం నేర్పాలి. మూఢాచారాలను వదిలించుకొని వాస్తవ స్థితిని గ్రహించాలి. అజ్ఞానం నుంచి సుజ్ఞాన మార్గం వైపు మరల్చి మన జీవితాన్ని సుఖమయం చేయడం కోసం పెద్దలు, మహనీయులు ఎన్నో సూక్తులు అందించారు. సుభాషితాలు స్ఫూర్తి నింపే విజ్ఞాన తరంగాలు. తరగని జ్ఞాన భాండాగారాలు. అవతార మూర్తుల దివ్య వాక్య విభూతులు. మనిషి తనను తాను తీర్చిదిద్దుకొనేందుకు ఆధ్యాత్మిక ప్రయాణం నిరంతర సాధనగా సాగాలి. భయం భయంగా బతికే స్థితి నుంచి ధైర్యంగా ముందుకు సాగడం జీవన యోగం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరడమే మానవ జీవిత లక్ష్యం.

- రావులపాటి వెంకట రామారావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని