శివతత్త్వం

ఆనందం శివుడి స్వభావం. ఆనందం శివుడి స్వరూపం. శివతత్త్వాన్ని అధ్యయనం చేయడం అంటే అచ్చమైన ఆనందంతో పరిచయం పెంచుకోవడమే! పరమ శివానంద స్థితిని సాధించడమే మనిషికి లక్ష్యం. ఈశ్వర చైతన్యాన్ని సత్యం, శివం, సుందరం అని వర్ణించింది వేదం.

Published : 03 Oct 2022 00:48 IST

ఆనందం శివుడి స్వభావం. ఆనందం శివుడి స్వరూపం. శివతత్త్వాన్ని అధ్యయనం చేయడం అంటే అచ్చమైన ఆనందంతో పరిచయం పెంచుకోవడమే! పరమ శివానంద స్థితిని సాధించడమే మనిషికి లక్ష్యం. ఈశ్వర చైతన్యాన్ని సత్యం, శివం, సుందరం అని వర్ణించింది వేదం. ఇరువైపులా గల సత్యం, సుందరం- మధ్యలో ఉన్న శివుణ్ని ఆవరించి ఉంటాయి. మనం శివుణ్ని ఆశ్రయిస్తే ఆ రెండింటితో స్నేహం కుదురుతుంది.

‘ఈశావాస్య మిదం సర్వం’ అని చెబుతోంది వేదం. ఈ చరాచర జగత్తు సర్వస్వం ఈశ్వరుడి చైతన్యంలోనే మునిగి ఉందని ఆ మాటకు తాత్పర్యం. భగవంతుణ్ని స్థాణువు అన్నారు. ఎక్కడికీ కదలని వాడని దాని అర్థం. అంటే కదలలేక పోవడం కాదు, కదలడానికి వేరే చోటు లేకపోవడం. అణువణువునా అంతటా నిండిపోయినవాడు వేరే ఎక్కడికని కదులుతాడు? అందుకే కదిలేందుకు ఇక చోటులేక స్థాణువుగా మిగిలిపోయాడు.

శివుడు అభిషేక ప్రియుడు. అభిషేక విధికి కుల మత వర్గాలతో పని లేదు. ఆయన అందరి దేవుడు. భక్త సులభుడు. ‘నీలకంఠుని శిరస్సుపై నీళ్లుజల్లి పత్రి ఇసుమంత ఎవ్వడు పారవైచునో వాడింట కామధేనువు నిలుస్తుంది, కల్పతరువు మొలుస్తుంది’ అని రాజశేఖర చరిత్రలో మాదయగారి మల్లన చెప్పిన మాట- శివుడి నిరాడంబరత్వానికి చిహ్నం. ఎవరో తెచ్చిన ద్రవ్యాలతో, ఇచ్చిన పంచామృతాలతో మరెవరో అభిషేకిస్తుంటే ఊరికే నిలబడి చూస్తున్న వారికి సైతం ఆ దృశ్యం అద్భుతంగాను, ఆనందంగాను అనిపించడం శివ చైతన్యానికి ఆనవాలు. హంగులూ ఆర్భాటాలకు దూరంగా ఉంటాయి శివాలయాలు. ప్రశాంతంగా ఉంటాయి గర్భగుడులు. తృప్తిగా తీరిగ్గా లభిస్తుంది ఆయన దర్శనం! అర్చన సైతం నిరాడంబరం. పల్లెల్లో అడుగడుగునా శివాలయాలు నెలకొనడానికి అదే కారణం. భక్తితో చిత్తశుద్ధితో తనను సేవించే వారందరినీ ఆదుకోవడం ఆయన స్వభావం. పశుపక్ష్యాదులు, జంతువులు సైతం ఆయన కారుణ్యానికి అర్హమైనవేనని శ్రీకాళహస్తి సాక్ష్యం చెబుతోంది.

అమృతాన్ని సాధించాలని దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం సాగించారు. అమృతం కన్నా ముందు కాలకూట విషం పుట్టుకొచ్చింది. పార్వతి ఎలా స్పందించింది? ‘లోక క్షేమం కోసమేగా... పోన్లే మింగెయ్యి’ అని భర్తకు సలహా ఇచ్చింది. పోతన ఆ ఘట్టాన్ని వర్ణిస్తూ గొప్ప పద్యం చెప్పాడు. ‘మ్రింగెడిది గరళమనియును, మేలని ప్రజకున్‌ మ్రింగుమనె సర్వమంగళ’ అన్నాడు. సర్వమంగళ అనడంలో ఉంది ఆయువుపట్టు. ‘మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో’ అనే చివరి వాక్యానికి అదే ప్రాణం. ఇక్కడో రహస్యం ఉంది. సూత్రం అంటే పుస్తెల తాడు అని ఒకటే కాదు. ఆ మాటకు సిద్ధాంతం అనే అర్థమూ ఉంది. లోకక్షేమం, సర్వదా మంగళం ఆమె సిద్ధాంతాలు. పార్వతి ఆ సిద్ధాంతాలకు కట్టుబడిందని ఆ పద్యంలోని అంతరార్థం. అన్యోన్యత అనే పదానికి ఆది దంపతులు ఇచ్చిన నిర్వచనం లాంటిది ఆ పద్యం! వారిద్దరూ వాగర్థాల్లాంటివారు- అన్న కాళిదాసు మాటను మనం ఈ కోణంలోంచి అర్థం చేసుకోవాలి. వారిద్దరూ పేరుకే ఇద్దరు. దేహం, భావం, సిద్ధాంతం... అన్నీ ఒక్కటే! లోకంలోని జంటలన్నింటికీ వారు ఆదర్శం. ఈ రహస్యం ఎరిగింది కాబట్టి రుక్మిణీదేవి ‘నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశులన్‌’ అంటూ వారిని ఆది పురాణ దంపతులుగా ఆరాధించింది. కృష్ణుణ్ని తనకు పెనిమిటిని చేయమని ప్రార్థించింది. అర్ధనారీశ్వర తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఈ దారిలో ఆలోచించాలి. ఈ ఆధునిక యుగంలో దాని అవసరాన్ని గుర్తించాలి. ప్రశాంత జీవనాన్ని ఆశించేవారు పరమశివుణ్ని ఆశ్రయిస్తారు.

- వై.శ్రీలక్ష్మి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని