ఆత్మహత్య పిరికితనం

ఆత్మహత్య... ఈ పదంలోనే ఏదో అపసవ్యత ధ్వనిస్తుంది.  ఆత్మ... హత్య చేసుకోవడమేమిటి! లేదా ఆత్మను హత్య చేయడమేమిటి? ఆత్మ పవిత్రమైనది.  అది భగవంతుడు అత్యంత కరుణతో మనిషిలో ప్రవేశపెట్టిన అతి పవిత్రమైన అంశం. దేవుడు తానుగా మనిషిలో స్థిరమైన, సంస్థితమైన మరో అద్భుతమైన  రూపం.

Updated : 11 Nov 2022 04:42 IST

ఆత్మహత్య... ఈ పదంలోనే ఏదో అపసవ్యత ధ్వనిస్తుంది.  ఆత్మ... హత్య చేసుకోవడమేమిటి! లేదా ఆత్మను హత్య చేయడమేమిటి? ఆత్మ పవిత్రమైనది.  అది భగవంతుడు అత్యంత కరుణతో మనిషిలో ప్రవేశపెట్టిన అతి పవిత్రమైన అంశం. దేవుడు తానుగా మనిషిలో స్థిరమైన, సంస్థితమైన మరో అద్భుతమైన  రూపం. ఈ లోకంలోని ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషి తప్ప ఆత్మహత్య చేసుకునే జీవుల్లేవు. సృష్టిలో ఏ జీవికైనా మనిషిలాగా ఆలోచనా శక్తి ఉండదు. అయినా ఏ జీవీ ఆత్మహత్యకు తనను తాను పురిగొల్పుకోదు. అసలా ఆలోచనే వాటికుండదు. అన్నిరకాలా ఉన్నతుడైన మనిషి మాత్రం తనకు అవసరం లేని, అనర్థదాయకమైన ఆత్మహత్యకు సిద్ధపడిపోతుంటాడు! ఆ వైఖరి ఈమధ్య ఎక్కువైపోయింది. మన ఇతిహాసాల్లో వాఙ్మయాల్లో ఆత్మహత్యల ప్రసక్తి  సాధారణంగా ఎక్కడా ఉండదు.

నేటి సమాజంలో ఆవశ్యక అనుసరణీయాల్లా ఆత్మహత్యలు తయారయ్యాయి! జీవితంలో సిగ్గుచేటైన విషయాల్లో ఆత్మహత్య ఒకటి. అది ఏ కోణంలోంచీ సానుభూతికి పాత్రమైన విషయం కాదు. సమర్థనీయం అంతకంటే కాదు. ఇతర జీవులకు బాధలు లేవా, ఆపదలు రావా, ఇబ్బందులుండవా? అను క్షణం శత్రుభయంతో జీవించే జంతుజాలం ఎప్పటికప్పుడు ఆ భయాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తూనే  ఉంటుంది. స్థావరాలు మారుస్తూ, శత్రువును ఏమార్చే విధంగా రంగులు మార్చుకుంటూ, స్వజాతి జంతువుల బలం కూడగట్టుకుంటూ... ఎంత ఆత్మ విశ్వాసం వాటికి! ఎంత ఆత్మ గౌరవం! కేవలం తమ గురించి జాగ్రత్త, తమ భద్రతేగాక పిల్లల పట్ల మరింత శ్రద్ధ వహిస్తాయి. తోటి జంతువుల పట్లా అంతకంటే ఎక్కువ అప్రమత్తంగా ఉంటాయి.

మట్టి తింటూ, మట్టిలో జీవించే వానపాము ఎంత అల్పజీవి! మట్టి తవ్వేటప్పుడు కొడవలి, గునపాల తాకిడికి అవి ముక్కలవుతుంటాయి. అవి మరణిస్తూ కూడా నిరాశకు గురికావు. నిర్లక్ష్యం వహించవు. ఉండీ లేని ప్రాణంతో మళ్ళీ అతుకు పెట్టుకుంటాయి. లేదా తెగిపడిన భాగాలను పూరించుకుంటాయి. మళ్ళీ జీవితం కొనసాగిస్తాయి. నత్త, తాబేలు... వాటివి ఎంత సున్నితమైన శరీరాలు! అయినా అవి వజ్రం లాంటి పై పెంకును తయారుచేసుకుంటాయి. రాజసంగా బతికేస్తాయి. ఎంత  అద్భుతం! ఆ అల్ప ప్రాణులకు జీవితం మీద ఎంత ప్రీతి... ఎంత శ్రద్ధ... ఎంత నిబద్ధత!

మనిషికేం తక్కువ? అతడి శక్తికి ఆకాశమే హద్దు. అతడి మనసుకు విశ్వమే సరిహద్దు. అతడు తీర్చుకోలేని బాధ ఏమిటి? దూదిపింజంత సమస్యను మేరు పర్వతమంతగా ఊహించుకుని ఆత్మహత్య చేసుకోవడమేమిటి? ఇది చాలా సిగ్గుపడవలసిన విషయం. ముందు ముందు ఎంత జీవితం ఉంటుంది! ప్రపంచాన్ని రాసిచ్చినా ఒకే ఒక్క క్షణాన్ని ఎవరైనా మనకు తెచ్చివ్వగలరా? మనుషులు ఆలోచించాలి. సమస్యకు పరిష్కారం ఆత్మహత్య కాదు. ఇది కాదు జీవితానికి అర్థం. ఇది కాదు జీవితానికి పరమార్థం. మనం పుట్టామంటే మనం వెళ్ళే లోపల లోకం పుస్తకంలో మన సంతకం చేసి వెళ్ళాలి. శిలాక్షరాలుగా రాసి వెళ్ళాలి. ఆత్మహత్య... ఆకతాయి పిల్లలు గోడమీద రాసి పారిపోయే పిచ్చిరాత. మన జీవితం అది కాకూడదు!

- చక్కిలం విజయలక్ష్మి

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు