గీత దాటవద్దు!

మనిషి అభ్యున్నతికోసం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎన్నో విషయాలను ప్రస్తావించాడు. భౌతిక సమస్యలనెన్నింటినో స్పృశించి పరిష్కారాలను సూచించాడు. మానవ సంబంధాలు, అసూయా ద్వేషాలు, అరిషడ్వర్గాలు మనిషిని ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పాడు.

Published : 13 Nov 2022 00:32 IST

మనిషి అభ్యున్నతికోసం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎన్నో విషయాలను ప్రస్తావించాడు. భౌతిక సమస్యలనెన్నింటినో స్పృశించి పరిష్కారాలను సూచించాడు. మానవ సంబంధాలు, అసూయా ద్వేషాలు, అరిషడ్వర్గాలు మనిషిని ఎంతగా ప్రభావితం చేస్తాయో చెప్పాడు. దైనందిన జీవితంలో మనం ఎలా మనుగడ సాగించాలో తేటపరచాడు. మానవుల మనస్తత్వాన్ని గుర్తెరిగి ఆనందంగా ఎలా బతకాలో మాధవుడు గీతలో ఉద్బోధించాడు. మనిషి నడవడిక గురించి ఆయన చెప్పిన వైనం అద్భుత జీవన ప్రణాళిక. సాంఖ్య యోగంలో మనిషి ఆహార నియమాలను నిద్ర మైథునాలను ప్రస్తావిస్తూ సమయానుకూలంగా కర్మలను (పనులను) నిర్వర్తిస్తూ జీవితాన్ని పండించుకోవాలని సూచించాడు. ఆహారాన్ని మితంగా ప్రసాదంగా తీసుకోవాలన్నాడు. తొమ్మిదో అధ్యాయంలో- వివేకవంతుడైన వ్యక్తి ప్రేమతో మొక్కలోని దళాన్నో పండునో పువ్వునో కనీసం నీటినైనా ప్రేమతో సమర్పిస్తే చాలునని అన్నాడు. భగవంతుడికి సమర్పించిన ఆ నివేదననే ప్రసాదంగా స్వీకరించడం ఆరోగ్యంగా జీవించేందుకు మార్గమని వల్లభాచార్యుడి సమకాలికుడైన చైతన్య మహాప్రభు బోధించాడు.

ఏ కార్యాన్నైనా నియమం ప్రకారం నిర్వహించి చక్కని ఫలితం సాధించడాన్ని సత్కర్మ అని గీత చెబుతోంది. సంసారంలో బాధ్యతలు నిర్వహించడం వరకే అనుబంధాలు, అనురాగాలు. గీతలో అర్జునుడికి ధర్మం నీతి సచ్ఛీలం గురించి తొలి అధ్యాయంలోనే శ్రీకృష్ణుడు చెప్పాడు. న్యాయసంగతమైన పరిపాలన సమాజానికి అవసరం. కలతలు లేని మనసు, దృఢమైన ఆలోచనల కారణంగా మనిషిలో శ్రేష్ఠత కలుగుతుంది. శ్రేష్ఠుడైన వ్యక్తిని సామాన్య జనులు అనుసరించి సమాజానికి మేలు చేస్తారు.

పరీక్షిత్తు తన జీవిత కాలం కొన్ని రోజులేనని తెలిసీ ఏ మాత్రం భయపడకుండా భాగవత కథలు వింటూ ఆనందంగా జీవించాడు. ఇదే విషయం శ్రీకృష్ణుడు ఫల్గుణుడికి బోధిస్తూ- నువ్వు బతికి ఉండేది కేవలం ఈ రోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు... ఫలితాన్ని మాత్రం భగవంతుడికి వదిలివేయి అన్నాడు. అప్పుడు ఈ ప్రపంచంలోని ఏ బాధా నిన్ను దరిచేరదని చెప్పాడు. ఫలితం దైవంపై వదిలేశాక ఇక ఏ చింతా లేకుండా హాయిగా జీవించగలం. ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒక్కటే. ఒకరిని ద్వేషిస్తున్నాం అంటే, తనను తాను ద్వేషించుకుంటున్నట్లే అని వివరించాడు. కలలు మాత్రమే కంటూ కూర్చుంటే జీవితకాలం వృథా అవుతుందని బోధించాడు. ఉన్నతమైన కలలు కంటూ వాటిని నిజం చేసుకోవడానికి పడే కష్టంలో శ్రమ అనేదే తెలియదన్నాడు ఆ పరమాత్మ. కలలు సాకారమైతే ఆ ఆనందం విలువ ఇంత అని లెక్క కట్టలేం.

ప్రతి మనిషీ తనకంటూ ఒక వ్యక్తిత్వం లేకుండా ఇతరులను అనుకరిస్తూ బతికితే ఆ జీవితం అసంపూర్ణమని శ్రీకృష్ణుడు బోధించాడు. జ్ఞానం కలిగి ముందుకు సాగితే జీవితం అర్థవంతమవుతుందన్నాడు. పదిమంది గుండెల్లో నిలిచినవారిని మాత్రమే లోకం గుర్తిస్తుంది అన్నాడు ఆ పరంతపుడు. మనసును నిర్మలం చేసుకుని దాన్ని అదుపులో పెట్టుకోవాలి. అదుపు తప్పిన మనసే మనకు ప్రధాన శత్రువు అవుతుందని వివరించాడు. జీవితాన్ని ప్రతి క్షణం అనుభవిస్తూ మంచి మాటలను లక్ష్మణరేఖగా గుర్తించి గీత దాటకుండా ఉండాలన్నది ఆ భగవంతుడి ఉద్బోధ. ఆయన పార్థుణ్ని శిష్యుడిగా చేసుకొని ఉపనిషత్తుల సారాన్ని మానవులకోసం బోధించాడు. ఆ బోధన నుంచి స్ఫూర్తి పొందిన మనిషి పరమాత్మకు ప్రతిరూపమే అవుతాడు.

- అప్పరుసు రమాకాంతరావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు