దీపారాధన

దీపం సకల శుభాలకు, సౌభాగ్యాలకు, జ్ఞానానికి, వెలుగుకు సంకేతం. దీపం వెలిగిన చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందంటారు. దీపారాధన చేయడమంటే శ్రీమహాలక్ష్మిని ఆహ్వానించడమే. అజ్ఞానాంధకారాన్ని పారదోలి వివేకవంతమైన జ్ఞానం ప్రసాదించే వరప్రదాయినిగా దీపాన్ని ఆరాధిస్తాం.

Published : 14 Nov 2022 00:31 IST

దీపం సకల శుభాలకు, సౌభాగ్యాలకు, జ్ఞానానికి, వెలుగుకు సంకేతం. దీపం వెలిగిన చోట శ్రీమహాలక్ష్మి కొలువై ఉంటుందంటారు. దీపారాధన చేయడమంటే శ్రీమహాలక్ష్మిని ఆహ్వానించడమే. అజ్ఞానాంధకారాన్ని పారదోలి వివేకవంతమైన జ్ఞానం ప్రసాదించే వరప్రదాయినిగా దీపాన్ని ఆరాధిస్తాం.

పండగలు, పర్వదినాలు, పుష్కరాలు, వ్రతాలు, ఉద్యాపనలు, సభలు, సమావేశాలు, ప్రవచనాలు, భజనలు... ఇలా అనేక శుభ సమయాల్లో దీపప్రకాశనం చేస్తారు. ప్రధానంగా దేవాలయాల్లో కార్తికమాసమంతా మహిళలు దీపాలు వెలిగిస్తారు. పర్వదినాల్లో నదుల్లో దీపాలు వదులుతారు. దీపదానం చేస్తారు. దీపదాన మహిమను పద్మపురాణం విస్తృతంగా వర్ణించింది. దీపదానం వల్లనే ‘గుణవతి’ త్రిమూర్తుల ఆశీస్సులందుకుని, మరుజన్మలో సత్యభామగా జన్మించి శ్రీకృష్ణుణ్ని భర్తగా పొందిందని పురాణ కథనం. కార్తికమాసంలో వెలిగించే దీపాలు శీతల శరీరానికి కావలసిన ఉష్ణోగ్రతనందజేసి, వ్యాధులను దూరం చేస్తాయంటారు. దీపారాధనకు ఆవునెయ్యి, నువ్వులనూనె శ్రేష్ఠమైనవి.

దీపం నుంచి వెలువడే లేత ఎరుపు, నీలి, పసుపు రంగులను ముగురమ్మలకు ప్రతీకలుగా భావిస్తారు. దీపం ‘దేవతాస్వరూపిణి’ అని విశ్వసించడానికి గల తార్కాణం హిమాచల్‌ప్రదేశ్‌లోని జ్వాలాదేవి ఆలయం. నూనె, వత్తులు లేకుండా వెలిగే అఖండ దీపం ఆ ఆలయంలో ఉంది. ‘తంత్ర చూడామణి’లో ఈ దేవి మహిమ వివరంగా ఉంది.

అమావాస్యనాడు సన్యసించిన స్వామి దయానంద సరస్వతి తిమిర జగతికి జ్ఞానకాంతిని అందించారు. చీకటిలో చేసే పనులన్నీ పాపాలుగాను, వెలుగులో చేసే పనులన్నీ సత్కార్యాలుగాను మహాత్ములు అభివర్ణిస్తారు. జాతిని జాగృతం చేసే చైతన్య కిరణాలు దీపకాంతి నుంచే ఆవిష్కృతమవుతాయి.

మానవ శరీరం మట్టితో చేసిన ప్రమిద అని, ప్రాణం ప్రకాశించే జ్యోతి అని, ఆధ్యాత్మిక సాధన ఆ ప్రమిదలో పోసే తైలమని అందుకే భగవంతుడికి భక్తుడు చేసే షోడశోపచారాల్లో దీప సమర్పణ అత్యంత ప్రాధాన్యం సంతరించుకుందని పౌరాణికులు చెబుతారు. భూమాత వేడిని భరించలేదనే ఉద్దేశంతో ఒక ప్రమిదలో మరో ప్రమిదను ఉంచి దీపం వెలిగిస్తారు. దీపకాంతి లోకానికి క్రాంతి, శాంతి ప్రసాదించి, భ్రాంతిని తొలగిస్తుందని హైందవ సంప్రదాయ విశ్వాసం. జ్యోతి ప్రకాశనం దివ్యలోక సాయుజ్యానికి దారి చూపుతుందంటారు. దీపం ఎప్పుడూ పై దిశవైపే చూస్తుంది. అలాగే మనిషి ఉన్నత స్థితికే వెళ్ళేందుకు ప్రయత్నించాలన్నది దీపం ఇస్తున్న సందేశం.

తులసి మొక్కను లక్ష్మీస్వరూపిణిగా భావించి, దానిముందు దీపం పెడతారు. దర్శనాల్లో దీపజ్యోతిని జ్ఞానసంకేతంగా ఉటంకించారు. చుట్టూ ఉన్న చీకటిని తిడుతూ కూర్చోక ఒక దీపం వెలిగిస్తే, అదే ఎన్నో దీపాలను వెలిగిస్తుంది. రుగ్వేదం ‘అగ్ని’ అన్న పదంతోనే ఆరంభమైంది. అగ్ని అంటే జ్యోతి స్వరూపమే కదా! ముక్తిపథంలో ప్రయాణించడానికి జ్యోతి అనే సాధన ఒక్కటే సులువైనది కనుకనే దీపారాధనకంతటి వైశిష్ట్యం అని బుధులు చెబుతారు. ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న సామెత మనిషి జీవన ప్రస్థానం ఎంతో అప్రమత్తతతో కొనసాగాలని హెచ్చరిస్తోంది.

- చిమ్మపూడి శ్రీరామమూర్తి

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు