అది సదవకాశం!

ప్రకృతి ధర్మాలపై సరైన అవగాహన లేనప్పుడు లౌకిక జీవితం అంతా సమస్యల మయంగా అనిపిస్తుంది. ప్రతీ పరిణామం ఒక సమస్యలా ఉంటుంది. అది ఒక సదవకాశం కావచ్చనే ఊహసైతం కలగదు. నడుస్తున్న కాలానికి తగ్గట్టు ఉండగలిగితే, సమస్యగా కనిపించే పరిస్థితినీ అద్భుతమైన అవకాశంగా గ్రహించవచ్చు.

Published : 15 Nov 2022 00:52 IST

ప్రకృతి ధర్మాలపై సరైన అవగాహన లేనప్పుడు లౌకిక జీవితం అంతా సమస్యల మయంగా అనిపిస్తుంది. ప్రతీ పరిణామం ఒక సమస్యలా ఉంటుంది. అది ఒక సదవకాశం కావచ్చనే ఊహసైతం కలగదు. నడుస్తున్న కాలానికి తగ్గట్టు ఉండగలిగితే, సమస్యగా కనిపించే పరిస్థితినీ అద్భుతమైన అవకాశంగా గ్రహించవచ్చు. అలా కానప్పుడు ఏ కాలమైనా సమస్య లాగే ఉంటుంది. నిజానికి ప్రకృతిలో జరిగే ప్రతీ పరిణామం శుభ యోగం కోసమే. రోజులో ప్రతీ ఉదయం శుభోదయం, ప్రతీ రాత్రి శుభరాత్రి. పగలు, రాత్రి రెండూ శుభ పరిణామానికే. పగలు శ్రమించడానికి అవసరం. రాత్రి విశ్రమించడానికి అవసరం.

సర్వత్రా శుభకరం చేయడమే ప్రకృతి ధర్మం. అందుకు అనుకూలంగానే కాల గమనం ఉంటుంది. సంవత్సరంలో వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం అనే మూడూ అవసరమే. వేసవికాలం జలాశయాలలోని నీటిని ఆకాశంలోకి పంపించడానికి అవసరం. వర్షాకాలం ఆకాశంలోని నీటిని భూమిపై నివసించే జీవజాలానికి చేరవేయడానికి అవసరం. అలాగే శీతాకాలం ఆరోగ్య సంరక్షణకు సహకరించే శరీర వ్యాయామాది ప్రక్రియలకు, జీవనాధారమైన పంటల ఉత్పత్తికి అనుకూలమైన సమయం. దక్షిణాయనం, ఉత్తరాయణం కూడా పుణ్య కాలాలే. జీవితాన్ని సమస్యా రహితంగా గడపాలంటే ప్రకృతితో సంబంధంతో పాటు మన శక్తి, సామర్థ్యాలపైనా మంచి అవగాహన అవసరం. తెలియక మోయలేని బరువుల్ని తలకు ఎత్తుకున్నప్పుడు వాటిని దింపడం పెద్ద సమస్యగా పరిణమిస్తుంది. ఏదో ఒక లాభం ఆశించి కొత్త బాధ్యతలు స్వీకరించేటప్పుడు ముందే కొంత ఆలోచన అవసరం. ఏ వాహనం మీదైనా దాని సామర్థ్యానికి తగిన బరువును వేసినప్పుడు ప్రయాణంలో వాహనాన్ని నడిపే వారికి ఏ విధమైన సమస్యా అనిపించదు. పైగా ఎంతో ప్రమోద భరితంగా ఉంటుంది.

అర్థం చేసుకునే సామర్థ్యం లేనప్పుడు సామాన్యమైన పరిస్థితులు కూడా సమస్యలుగానే అనిపిస్తాయి. చదువుపై సరైన దృష్టి పెట్టని విద్యార్థికి ప్రతీ పరీక్షా సమస్యగానే కనిపిస్తుంది. బాగా చదువుకున్న విద్యార్థికి అవే పరీక్షలను ఎదుర్కోవడం, ఉత్తీర్ణత సాధించడం సంతోషాన్ని ఇస్తుంది.

కొందరు తమకు ఏ సమస్యా లేకపోయినా, పరుల సమస్యలను కూడా తమవిగా భావించి వాటి పరిష్కారానికి సహకరిస్తుంటారు. పరుల సమస్యల పరిష్కారార్థం చేసే కృషిలో వారికి సైతం ఆనందాన్ని సృష్టించుకున్నట్లు అవుతుంది.

పరమార్థ సాధనలో పరమాత్మ ఆసరా పొందే యోగ్యత లభిస్తుంది. అంతటి సమర్థుడి ఆసరా ఉన్నవారు ఎంతటి సమస్యనైనా అవలీలగా పరిష్కరించగలరు. ప్రకృతిని తన అధీనంలోకి తీసుకోవాలనే తపన వదిలి, సమన్వయం సాధిస్తే- సమస్యలమయంగా అనిపించే జీవిత మూలాన్ని అర్థం చేసుకుని, సదవకాశంగా ఆనందమయం చేసుకోవచ్చు.

- దువ్వూరి రామకృష్ణ వర ప్రసాదు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని