గురుమార్గం

అందరికంటే తాను గొప్పగా ఉండాలని, అన్నీ తనకే తెలియాలని, తానెప్పుడూ ఆనందంగా బతకాలని మనిషి భావిస్తాడు. వీటినే ‘పునాది కోరికలు’ అని చెప్పారు మహానుభావులు.

Published : 16 Nov 2022 00:32 IST

అందరికంటే తాను గొప్పగా ఉండాలని, అన్నీ తనకే తెలియాలని, తానెప్పుడూ ఆనందంగా బతకాలని మనిషి భావిస్తాడు. వీటినే ‘పునాది కోరికలు’ అని చెప్పారు మహానుభావులు. ఈ కోరికలన్నీ తీరినవారెవరైనా ఉన్నారా అని లోతులకు వెడితే- సద్గురు కరుణవల్ల ఇవి మహర్షులకు సిద్ధించాయని దత్తపురాణం చెబుతోంది. గురువు అంటే మనకు తెలిసినవాడే అనుకుంటాం కానీ మహాశాస్త్రాలు క్షుణ్నంగా అధ్యయనం చేసిన మహాపురుషులకైనా గురుతత్త్వం అంటే ఏమిటో పూర్తిగా తెలియదనే చెప్పాలి. సాక్షాత్‌ పార్వతీదేవికీ అది తెలియక పరమేశ్వరుణ్ని ఆశ్రయించింది. క్రీనీడ సోకని వెలుగును, లోపలికి బయటకు భేదం లేని వెలుగును, చావు పుట్టుకలు లేని వెలుగును దర్శించగల మార్గంలో మనల్ని నడిపించేవాడే గురువని ఆయన గురుగీత బోధించాడు.

ఏ ఉపాసనా మార్గంలో వెళ్ళినా ఆ మార్గం గురోపాసనలో కలిసిపోతుంది. పునాది కోరికలను సాధించడానికి ఏర్పడిన అపూర్వమైన, అనన్యమైన అద్భుత మార్గమే ఈ గురుమార్గం. ఇది అంత సులభం కాదు. అనుక్షణం జాగరూకత లేనివారికి గురువు అనుగ్రహం అసాధ్యం. గురువును ఎంచుకోవడం తెలియాలి. తరవాతే గురుసేవ. గురువును గుర్తించి నిర్ణయించడం అంత తేలికైన పనికాదు. మనలో తపన పుట్టాలి. ఆర్తితో సత్పురుషులను దర్శించాలి. ఎక్కడో ఒక చోట మన మనసు ప్రశాంతిని అనుభవిస్తుంది. ‘ఈయనే నా గురువు’ అన్న ప్రేమ కలుగుతుంది. ఆ భావన మదిలో బలంగా నాటుకున్నప్పుడు సద్గురువు మనకు దగ్గరవుతాడు. మనకు ఉపకరించే రూపంలో మన దగ్గరే ఉంటున్నా, మనకు సరైన అర్హత వచ్చేవరకు తనను ప్రకటించుకోడు గురుమూర్తి. తపనే మన అర్హత. ఆర్తే గీటురాయి. అప్పుడే చిత్త ప్రశాంతతనిచ్చే రూపంలో గురువు ప్రకటితమవుతాడు.

అప్పుడే జాగరూకులై ఉండాలి శిష్యులు. గురువు లభించాడన్న ఆనందంలో మనసుకు భయం పోయి, ఇంద్రియాల పట్టు సడలి, లౌకిక వాంఛలు మళ్ళీ చెలరేగి విజృంభిస్తాయి. గురువు పట్ల అనుమానాలు, శోధనలు మొదలవుతాయి. కళ్ళెం వేసి మనసును బంధించలేని దశలో గురువును దూరం చేసుకుంటారు. మరో గురువును చూసుకుందామనే పెడబుద్ధి మొదలవుతుంది. ఇదే పతనానికి పరాకాష్ఠ.

సురాధిపతి ఇంద్రుడు దేవగురువైన బృహస్పతిని గురువుగా భావించాడు. ఆయన సలహాపై రాక్షసులను అణగదొక్కి వైభవంగా రాజ్యపాలన చేశాడు. భోగలాలసతో, గర్వంతో గురువును అవమానించి దూరం చేసుకున్నాడు. త్వష్ట ప్రజాపతి కొడుకైన రూపుడిని గురువుగా ఉండమని కోరాడు. గురుమార్పిడి వద్దని ఆయన హితవు చెప్పాడు. వినక రూపుడి సోదరుడైన మూడు తలల విశ్వరూపుణ్ని దేవతల గురువు చేశాడు. తల్లి రాక్షసకాంత కావడం వల్ల యజ్ఞయాగాల్లో హవిర్భాగాలను రాక్షసులకు రహస్యంగా అందించేవాడు విశ్వరూపుడు. ఇది తెలుసుకున్న ఇంద్రుడు గురువు మూడు తలలను ఖండించి గురుహత్య, బ్రహ్మహత్యలకు పాల్పడ్డాడు. దత్తస్వామి దయతో తప్పు తెలుసుకుని మొదటి గురువు బృహస్పతి కాళ్లపై పడి, ఆయన దయతో పూర్వవైభవాన్ని పొందాడు ఇంద్రుడు. సాధకుడికి ప్రకృతిలో అణువణువు గురువే. ఎన్నుకున్న గురువు ఉపదేశించేదే సాధనమార్గం. గురూపదేశ మార్గాన్ని అనుసరించడమే సాధకుడి లక్షణం.

- మాడుగుల రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని