స్వీకరించే పద్ధతి

అనుభవంతో తలపండిన వ్యక్తులు తమ స్వీయానుభవాల్ని పంచుకోవడానికి ముందుకొచ్చినప్పుడు ఆ మాటల్ని సాదరంగా స్వీకరించాలి. సమస్యకు పరిష్కారం తెలియజేస్తూనో, మన క్షేమాన్ని ఆశించి లోపాన్ని ఎత్తి చూపించినప్పుడో అనుభవజ్ఞులు చెప్పిన మాటలు కేవలం ఉచిత సలహాలేనని అనుకోకూడదు.

Published : 17 Nov 2022 00:33 IST

అనుభవంతో తలపండిన వ్యక్తులు తమ స్వీయానుభవాల్ని పంచుకోవడానికి ముందుకొచ్చినప్పుడు ఆ మాటల్ని సాదరంగా స్వీకరించాలి. సమస్యకు పరిష్కారం తెలియజేస్తూనో, మన క్షేమాన్ని ఆశించి లోపాన్ని ఎత్తి చూపించినప్పుడో అనుభవజ్ఞులు చెప్పిన మాటలు కేవలం ఉచిత సలహాలేనని అనుకోకూడదు. స్వీకరించేవారు మానసిక పరిపక్వత కలిగి ఉండాలి. ఇచ్చేవారికన్నా తామేదో తక్కువ స్థానంలో ఉన్నామనే భ్రమను విడనాడాలి. ఆత్మన్యూనత పనికిరాదు. ఎందుకంటే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తాముకూడా అలాగే సలహాలను, సందేశాలను, సంతోషాలను ఇచ్చే ఉంటారు. ఆ సమయంలో స్వీకరించే వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మన మనసు గాయపడి ఉంటుందన్న విషయం గుర్తుకు తెచ్చుకోవాలి.

జీవితం మనకెప్పుడూ సుఖాన్ని మాత్రమే ఇవ్వదు. సహనాన్ని పరీక్షించే కష్టాల్ని మళ్ళీ కోలుకోగలమా లేదా అని మనమే సందేహించేంత అధైర్యాన్ని, కుంగుబాటును... ఎన్నింటినో రుచి చూపిస్తుంది. సుఖాన్ని సంతోషంగా స్వీకరించిన మనం, తలచుకుంటేనే బాధగా చేదుగా అనిపించే కష్టాల్ని ఎలా గ్రహించాలి? ఎంత ప్రయత్నించినా ఇలాంటి జీవితం మళ్ళీ రాదు. ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా ఆదరపూర్వకంగా గ్రహించడం తప్ప మనకు వేరే మార్గం లేదు. క్షీర నీరాల్ని ఒడుపుగా వేరు చేసే నేర్పు హంసకు ఉందంటారు. కానీ, కష్టసుఖాలను విడదీసి సుఖాన్ని మాత్రమే అనుభవించే నైపుణ్యాన్ని భగవంతుడు మనిషికివ్వలేదు.

బాల్యం ఏ బాధ్యతనూ గుర్తించదు. ఆటపాటలతో సంతోషం ఎక్కడుందో శోధించడమే పిల్లలకు తెలిసిన పెద్ద బాధ్యత. వారే పెరిగి పెద్దవుతారు. యౌవనంలోకి అడుగు పెడతారు. బాధ్యతలు ఒక్కొక్కటిగా జీవితాన్ని పెనవేసుకోవడం ప్రారంభిస్తాయి. అలవాటు లేని పనుల్ని అంగీకరించబోమంటూ ఆ నవయువకులు బాధ్యతల నుంచి వెనుదిరిగితే జీవితానికి పరమార్థమేముంటుంది? ఎదురయ్యే బరువు బాధ్యతలను చిరునవ్వుతో స్వీకరించడమే జీవితమని పిల్లలకు పెద్దలు తెలియజెప్పాలి. నడక నేర్పినంత జాగ్రత్తగా జీవిత గమ్యాన్ని చేరుకునే నడత నేర్పించాలి. మనిషికి అపజయం కలిగినప్పుడు తోటివారు సానుభూతి ప్రదర్శిస్తారు. విజయం సాధించినప్పుడు అపరిచితులు సైతం అభినందనలు తెలియజేస్తారు. ఎందరు తనను ఆకాశానికెత్తేస్తున్నా పాదాలు భూమి మీదే ఉండేలా చూసుకోవాలి. విజయాన్ని వినయంతో స్వీకరించాలి.

మనిషి పుట్టుకతో ఈ లోకంలోకి ఏమీ తీసుకురాడు. తినే ఆహారం నుంచి అనుభవించే ప్రతి సంపదనూ భూమి తల్లి ఇవ్వాల్సిందే. అన్ని సంపదల్నీ ధరించి ఉంటుంది కాబట్టి భూమాతను వసుంధర, ధరణి అనే పేర్లతో పిలుస్తాం. కొంతమంది ఖనిజ సంపద కొల్లగొట్టడానికి భూగర్భంలో తవ్వకాలు జరుపుతూ పుడమి విచ్ఛేదానికి పాల్పడుతున్నారు. తనను గాయపరుస్తున్నా ఎదురివ్వడమే భూమి నైజం. స్వీకరించే విధానం తెలియక మనిషి చేస్తున్న అకృత్యాల కారణంగా వాతావరణ కాలుష్యం పెరిగిపోతోంది. భూతాపం పెచ్చుమీరుతోంది. భూమి నుంచి సంపదల్ని స్వీకరించడానికీ ఓ విధానముంది- అవసరమైనంతమేర మాత్రమే తీసుకుని హద్దుల్లో ఉండాలి. అప్పుడే భూమికి, మానవాళికి క్షేమం.

- గోలి రామచంద్రరావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని