జీవనసాగరం

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. ఇరవైనాలుగు గంటల్లో తుపానుగా మారి ఫలానా చోట తీరాన్ని దాటుతుంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. చెట్లు కూలిపోతాయి.

Published : 18 Nov 2022 00:37 IST

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం. ఇరవైనాలుగు గంటల్లో తుపానుగా మారి ఫలానా చోట తీరాన్ని దాటుతుంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. చెట్లు కూలిపోతాయి. కుంభవృష్టితో నదులు పొంగుతాయి. వరదలు సంభవించే ప్రమాదముంది. జాలరులు సముద్రంపై వేటకు వెళ్లరాదు... అంటూ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తమవుతారు. ఇరవైనాలుగు గంటలు గడుస్తాయి. తుపాను దిశ మార్చుకుని బలహీనపడిందని ప్రకటిస్తుంది వాతావరణశాఖ. ఆకాశం నిర్మలంగా మారుతుంది.

మరొక రోజు... పగలంతా ఉష్ణోగ్రతలు పెరిగి ఎండకాస్తుంది. సాయంత్రం కాగానే హఠాత్తుగా వాతావరణం మారిపోతుంది. భారీవర్షంతో నగరం నదిలా మారుతుంది. జనజీవనం స్తంభిస్తుంది. ఊహకందని పరిస్థితులు అప్పుడప్పుడు ఎదురవుతాయి. పంటలు చేతికందే సమయంలో వర్షం కురిసి రైతును నష్టాల పాలుచేస్తుంది. ప్రకృతి మనిషి అధీనంలో ఉండదు. మనిషి ప్రాణం అతడి అధీనంలో ఉండదు. కొద్ది గంటలు మించి బతకడని వైద్యులు నిర్ధారించిన రోగి కొద్ది రోజుల్లో కోలుకోవచ్చు. భార్యా పుత్రులతో చక్కగా కబుర్లు చెప్పి భోజనం చేసి నిద్రకుపక్రమించిన ఆరోగ్యవంతుడు శాశ్వత నిద్రలోకి జారుకోవచ్చు. ఏ క్షణమైనా చివరి క్షణమేనంటుంది మృత్యువు. అనూహ్య సంఘటనల సమా హారమే జీవితం.

కొన్ని సందర్భాల్లో తుపాను సృష్టిస్తుందనుకున్న సమస్య తేలికగా పరిష్కారమవుతుంది. మరొక సందర్భంలో చిన్న సమస్యే జటిలమై, కుటుంబాల మధ్య కలతల సునామీ సృష్టిస్తుంది. మనిషి మనసులో ఆలోచనలనే అలజడులు రేగుతుంటాయి. కోరికలనే సుడిగుండాలు మనసును మెలితిప్పి మనిషిని వక్రమార్గంలోకి మళ్ళిస్తాయి. సంసారసాగరంలో చెలరేగే మనస్పర్థల తుపానులు స్వయంకృతాలు. కామక్రోధాదులు సృష్టించే మానసిక తుపానులకు మనిషి బలవుతాడు. మనసులో చెలరేగే చెడు ఆలోచనల దిశ మార్చి సత్యధర్మాలవైపు మళ్ళించగలవారు ప్రశాంత జీవనం గడపగలుగుతారు.

సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు తీరంలో అలలు అలరిస్తాయి. తుపాను విజృంభించినప్పుడు అదే తీరం భయం గొలుపుతుంది. అహంకారంతో హుంకరిస్తున్నవారి దగ్గరకు వెళ్లడానికి బంధుమిత్రులు భయపడతారు. ప్రియభాషణంతో చిరునవ్వుతో పలకరించే సహృదయుల చుట్టూ ఆత్మీయులు చేరతారు. దైవానుగ్రహం అనే గాలి ఎల్లప్పుడూ వీస్తూనే ఉంటుందని, జీవిత సముద్రంలో పయనించే సోమరి నావికులు ఆ అవకాశాన్ని వినియోగించుకోలేరని, మెలకువతో ఉన్న సమర్థులు వారి మనసులనే తెరచాపలను విప్పి అనుకూలమైన గాలిని వినియోగించుకుంటారని, దైవానుగ్రహం లేనిదే ఏ పనీ సాధ్యపడదని శ్రీరామకృష్ణ పరమహంస సందేశం. కష్టాల కడలిని మనోధైర్యంతో ఎదుర్కోవాలి. ఆర్థిక సునామీలను ఓర్పుగా నేర్పుతో అధిగమించాలి. దుఃఖసముద్రంలో మునిగినప్పుడు దైవచింతనతో బయటపడాలి.

- ఇంద్రగంటి నరసింహమూర్తి

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు