ఉండకూడని లక్షణం

భాగవతంలో కార్తవీర్యార్జునుడి లోభం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్నీ ఉన్నా మనుషులు ఇలా దిగజారతారా అనిపిస్తుంది. ఆయన తన పరివారంతో సహా అడవికి వేటకు వెళ్ళాడు. తిరిగి తిరిగి చివరకు జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కాస్త దప్పిక తీరితే చాలనుకుంటున్నప్పుడు మహర్షి భోజనమే పెడతానన్నాడు.

Published : 19 Nov 2022 00:47 IST

భాగవతంలో కార్తవీర్యార్జునుడి లోభం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అన్నీ ఉన్నా మనుషులు ఇలా దిగజారతారా అనిపిస్తుంది. ఆయన తన పరివారంతో సహా అడవికి వేటకు వెళ్ళాడు. తిరిగి తిరిగి చివరకు జమదగ్ని ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ కాస్త దప్పిక తీరితే చాలనుకుంటున్నప్పుడు మహర్షి భోజనమే పెడతానన్నాడు. కందమూలాలు అనుకుంటే, షడ్రసోపేతమైన విందుభోజనమే పెట్టాడు. తనకే కాదు, తనతో ఉన్న సైన్యం అంతటికీ దప్పిక, ఆకలి పూర్తిగా తీరిపోయాయి. అప్పటికప్పుడు అంతమందికి అంత గొప్ప విందు ఏర్పాట్లు ఎలా జరిగాయని రాజుకు అనుమానం వచ్చింది.

జమదగ్ని మహర్షి దగ్గర సుశీల అనే గోవు ఉంది. అది కామధేనువు. దాన్ని ప్రార్థించి రాజోచితమైన విందు భోజనాలను అంతమందికి మహర్షి కొద్ది వ్యవధిలోనే ఏర్పాటు చెయ్యగలిగాడు. ఆశ్చర్యానికి లోనైన రాజు కన్ను కామధేనువుపై పడింది.

మనిషి స్వభావంలో ఒక చిత్రమైన విషయం ఏమిటంటే కోరికలు తీరేకొద్దీ- కొత్తవి పుడుతూనే ఉంటాయి. ఒకటి తీరేసరికి మరొకటి, అది తీరే సరికి ఇంకొకటి. అంతేకాదు- చివరికి ఇంకొకడికి దక్కనివ్వకుండా మొత్తం దోచేద్దామని అనిపిస్తుంది. దాన్నే లోభం అంటారు.

సరిగ్గా ఇలాంటి సన్నివేశమే రామాయణంలోనూ ఉంది. విశ్వామిత్రుడు అప్పటికింకా రాజు మాత్రమే, రుషి కాలేదు. ఆయనోసారి ఇలాగే సైన్యంతో ఊరేగుతూ వసిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ బృందానికి వసిష్ఠుడు తన దగ్గరున్న శబల అనే ధేనువు సాయంతో జమదగ్నిలాగే మహత్తరమైన విందు చేశాడు. కార్తవీర్యుడు జమదగ్నిని కోరినట్లే విశ్వామిత్రుడు వసిష్ఠుణ్ని కోరాడు- ఆ ధేనువును తన సొంతం చెయ్యమని. ఇది లోభానికి పరాకాష్ఠ!

మహాభారతంలో ధృతరాష్ట్రుడిది రాజ్యలోభం. ఆయన పుట్టుగుడ్డి. కనుక ధర్మశాస్త్ర రీత్యా ఆయనకు రాజ్యాధికారం దక్కలేదు. తమ్ముడు పాండురాజు రాజయ్యాడు. కొద్దికాలానికి పాండురాజు ఆకస్మికంగా మరణించడంతో రాజ్య సంరక్షణ బాధ్యత ధృతరాష్ట్రుడికి సంక్రమించింది. క్రమంగా రాజభోగాలకు ఆయన బాగా అలవాటు పడ్డాడు. అది లోభానికి దారితీసింది. తన చేజిక్కని రాజ్యశ్రీని కనీసం తన కొడుక్కి అయినా కట్టబెట్టాలని అనిపించి, ఆయన ఎన్నో పన్నాగాలు పన్నాడు. చివరకు రాజ్యాన్నే కాదు, నూరుమంది సంతానాన్ని పోగొట్టుకొన్నాడు.

రామాయణంలో భరతుడికి లభించిందీ తాత్కాలిక రాజభోగమే. అయితే భరతుడు ప్రలోభానికి లోనుకాలేదు. రాముడి రాజ్యానికి కేవలం ధర్మకర్తగానే వ్యవహరించాడు. రావణ సంహారం పిదప రాముడు తనకన్నా ముందుగా హనుమను పంపి, భరతుడి మదిలో ఏ మూలనైనా రాజ్యకాంక్ష మెదులుతున్నదేమో గమనించమని కోరాడు. శీలపరీక్ష లాంటిదది. అందులో భరతుడు గెలిచాడు. తన లోభరాహిత్యాన్ని నిరూపించుకొని లోకంనుంచి గౌరవాలను పొందాడు. లోభం ఆవరించి మనిషి గుడ్డివాడు కారాదని తన ప్రవర్తన ద్వారా లోకానికి బోధించాడు.

భారత భాగవత రామాయణ కథల్లోని వ్యత్యాసం, పరమార్థం గ్రహించిననాడు మనిషి లోభం నుంచి, వ్యామోహం నుంచి బయటపడతాడు.

- ఎర్రాప్రగడ రామకృష్ణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని