ప్రేమ తత్వం

ప్రేమ రెండు అక్షరాల చిన్న మాటే. కానీ, అందులో గొప్ప ఐక్యతా భావన, అనంత శక్తి దాగున్నాయి. మనిషి సంఘజీవి. ఏకాకిగా ఎక్కువ కాలం ఉండలేడు. ప్రేమ కావాలి. ప్రేమకు బదులు మరేదైనా అరిషడ్వర్గంతో ఎక్కువ సేపు గడపలేడు. ఏ బంధమైనా ఒదిగిపోయేది ప్రేమలోనే.

Published : 20 Nov 2022 00:41 IST

ప్రేమ రెండు అక్షరాల చిన్న మాటే. కానీ, అందులో గొప్ప ఐక్యతా భావన, అనంత శక్తి దాగున్నాయి. మనిషి సంఘజీవి. ఏకాకిగా ఎక్కువ కాలం ఉండలేడు. ప్రేమ కావాలి. ప్రేమకు బదులు మరేదైనా అరిషడ్వర్గంతో ఎక్కువ సేపు గడపలేడు. ఏ బంధమైనా ఒదిగిపోయేది ప్రేమలోనే. మనిషి మనుగడకు మూలం ప్రేమ. మానవ సంబంధాలు నిలబడేది, కొనసాగేది ప్రేమ పునాది పైనే.

‘ప్రాణం పోసే మహత్తర శక్తి ప్రేమకు ఉంది. శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యాలకు అది ఎంతో అవసరం. సమస్త ప్రాణికోటిని ప్రేమించేవారు ఎక్కువ కాలం జీవిస్తారు’ అన్నారు స్వామి వివేకానంద.

మనిషి మౌలికంగా దైవస్వరూపుడని, శరీరంలో నివసించే ఆత్మే దైవమని ఎందరో జ్ఞానులు తెలిపారు. జ్ఞానం విస్తరించినకొద్దీ ఆధ్యాత్మిక దృక్పథం మెరుగుపడుతుంది. అంటుకున్న అన్ని వాసనలూ అంతరించి ప్రేమతత్వం కళ్లు తెరుస్తుంది.

సృష్టిలో సమస్త జీవరాశుల పట్ల ప్రేమ, జాలి, దయ కలిగి ఉండటమే అత్యుత్తమమైన ఆధ్యాత్మిక సాధన అని మహాభారతం బోధిస్తుంది. మహాభారత కథ కుక్క అవమానంతో ఆరంభమై, స్వర్గారోహణ పర్వంలో కుక్క సన్మానంతో అంతమవుతుంది. పాండవులు స్వర్గానికి వెళ్ళే సమయంలో తమ్ములు, ద్రౌపది వీడిపోతారు. బొందితో స్వర్గానికి వెళ్ళే అర్హత కలిగిన ధర్మరాజును వెన్నంటి ఒక కుక్క వస్తుంది. దాన్ని వదిలి స్వర్గానికి వెళ్ళడానికి ధర్మరాజు అంగీకరించడు. తనకు పెట్టిన చివరి పరీక్షలో నెగ్గి, మూగజీవాల పట్ల దయాగుణాన్ని చాటుకున్నాడు ధర్మరాజు.

కరుణించమని, దీవించమని, రక్షించమని ఎల్లవేళలా భగవంతుణ్ని ప్రార్థిస్తుంటాం. మనతో పాటు భగవత్‌ సృష్టిలో భాగం అయిన ఇతర ప్రాణుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తుంటాం. దేవుడు మనిషికి ఆలోచన, మాట, మనసు ఇచ్చింది అవి లేని మూగజీవాల పట్ల ప్రేమ కలిగి ఉండటానికే. అది మనిషి కనీస ధర్మం.    
అహింసే ధర్మంగా భావించి, జీవించిన జ్ఞానుల సన్నిధిలో జంతువులు కూడా తమకు పుట్టుకతో వచ్చిన శత్రుత్వాన్ని విడిచిపెడతాయి. రుషుల ఆశ్రమాల్లో సాధు జంతువులు, క్రూర జంతువులు కలిసి మెలిసి స్వేచ్ఛగా సంచరించేవి. రమణాశ్రమంలో అనేక జంతువులు స్వేచ్ఛగా జీవించేవి. జంతువులు, పక్షుల పట్ల ఎలా వ్యవహరించవచ్చునో రమణులు ఆచరించి చూపారు. వాటితో ఆయన సంభాషించేవారు. ఆ రోజుల్లో ఆశ్రమంలో జీవించి తనువు చాలించిన గోమాత లక్ష్మి, కుక్క, కాకి సమాధులను నేటికీ రమణాశ్రమంలో చూడవచ్చు.

గౌతమ బుద్ధుడు క్రీస్తుపూర్వమే బౌద్ధమతాన్ని స్థాపించారు. ప్రేమతత్వం ద్వారా కోట్ల మందిని ప్రభావితం చేశారు. ప్రేమలో నిర్భయత్వాన్ని, ఆనందాన్ని సాధించే మార్గాలను ఆయన బోధించారు.

సింహాలు, పులులు వంటి క్రూర మృగాలతో సైతం పసిపిల్లల్లా ఆడుకునే ఎంతోమంది జంతు ప్రేమికుల్ని, కోటానుకోట్ల మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని కాపాడుతున్న వృక్ష ప్రేమికుల్ని, మానవసేవే మాధవ సేవగా భావించి కుష్టు వ్యాధి అయినా, కరోనా మహమ్మారైనా అంకితభావంతో సేవ చేస్తూ, ప్రేమ పంచుతున్న ఎందరినో మనం చూస్తున్నాం.

ప్రేమకు కొలతలు లేవు. తరతమ భేదాలు లేవు. ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటుంది. లేకపోతే అది ప్రేమ కాదు. ప్రేమ గురించి సంపూర్ణంగా తెలిసినవారే, దాన్ని ఆస్వాదిస్తారు. ఇతరులకు పంచగలుగుతారు. ప్రేమ దివ్య భావన. అది దైవ స్వరూపం. ప్రేమ తత్వమే ధ్యానయోగం.

- ఎం.వెంకటేశ్వరరావు

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు