సుఖశాంతుల చిరునామా

సుఖశాంతులతో జీవించాలని ప్రతి మనిషీ కోరుకుంటాడు. తృప్తిగా బతకాలనుకుంటాడు. ధనంలోనే ఇవి ఉన్నాయని, సంపాదనే ధ్యేయంగా పెట్టుకుంటాడు. దానికోసం పరుగు మొదలు పెడతాడు. తీవ్రంగా శ్రమిస్తాడు.

Updated : 23 Nov 2022 05:38 IST

సుఖశాంతులతో జీవించాలని ప్రతి మనిషీ కోరుకుంటాడు. తృప్తిగా బతకాలనుకుంటాడు. ధనంలోనే ఇవి ఉన్నాయని, సంపాదనే ధ్యేయంగా పెట్టుకుంటాడు. దానికోసం పరుగు మొదలు పెడతాడు. తీవ్రంగా శ్రమిస్తాడు. ఈ ప్రయత్నం జీవితాంతం కొనసాగుతుంది. అనుభవించిన క్షణిక సుఖాల స్ఫూర్తితో, అదే మార్గంలో వెడతాడు. డబ్బే జీవిత పరమార్థం అవుతుంది. దీనికోసం అనేక దారులు వెతుకుతాడు. అవినీతి, అసత్యం, అధర్మం ధనాన్వేషకుణ్ని ఆహ్వానిస్తుంటాయి. మహారాజ భోగాలు అనుభవిస్తున్నా మరేదో కావాలన్న కోరిక వెంటాడుతుంది. సముద్రంలో కెరటాల్లా ఆశా వ్యామోహాలు ఒకదానివెంట మరొకటి వచ్చేవే. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంతటి ఆస్తి గడించినా మనిషిలో మార్పు రాదు. బాహ్య విషయాల నుంచి ఆనందం పొందలేమనే సత్యాన్ని కడదాకా గ్రహించలేడు.

ధనంలో సుఖం ఉంటుందన్న భ్రమ తొలగేవరకు మనిషి గతి ఇంతే. దీనికి తోడు మనిషిలో భయం ఉండనే ఉంది. రోగభయం, శత్రుభయం, మృత్యుభయం... ఇలా అనేక రకాల భయాలు మనిషి వెంటే ఉంటాయి. ఏ నిమిషంలో ఏమి జరుగుతుందో తెలియని దిగులు నీడలా మనిషిని అనుసరిస్తుంది.
ప్రాపంచిక విషయాల్లో ఆనందాన్ని వెతకడమన్నది అవివేకం. ఏ కొరతా లేని మానసిక స్థితిని దైవత్వంలోనే పొందుతాం. బాహ్య ప్రపంచంలో దొరికేవన్నీ అసంపూర్ణాలంటుంది శాస్త్రం. మనిషికి ఏది ఆనందాన్ని స్తుందో అదే దుఃఖ హేతువూ అవుతోంది. ఒక వస్తువు ఉంటే ఆనందం అంటే, లేకపోతే దుఃఖం అని అర్థం. మనిషి ఆ వస్తువుకు బానిస, మనసు పరాధీనం. బంధు మిత్రులు, సిరిసంపదలు, అధికార హోదాలు... ఇవన్నీ ఏదో ఒక రోజు మన నమ్మకాన్ని వమ్ము చేసేవే. జీవితంలో శూన్యం అసంతృప్తి ఏర్పడితే, మనిషి దాన్ని బాహ్య విషయాలతో నింపేందుకు ప్రయ త్నిస్తాడు. కాని, ఆ వెలితి పూరించలేం. మన ఆలోచనలు, పనులు ఒక ఉదాత్తమైన ఆశయకేంద్రంగా నిర్మాణం కావాలి. ఇది ఆధ్యాత్మికం కావచ్చు లేదా సేవాభావన కావచ్చు. బాహ్యం నుంచి అంతరంగానికి మనసు మరలడమే ఆధ్యాత్మికం. అంతరంగంలో ఒక దివ్యచైతన్యం ఉంది, అది నాకు తోడుగా ఎప్పుడూ ఉంటుందనే విశ్వాసం అభద్రత మూలాలను పెకలిస్తుంది. భయరహితమైన జీవితాన్నిస్తుంది. కోరికలను అదుపు చేసే శక్తి అవుతుంది.

సంతోషం- నీ చిరునామా ఎక్కడా అంటే పసిపిల్లలను గమనిస్తే తెలుస్తుంది. వారి చిరునవ్వులో స్వతస్సిద్ధమైన ఆకర్షణకు కారణం వెతకాలి. వారిలో లెక్కలు కట్టే మనస్తత్వం ఉండదు. వ్యాపార ధోరణి కనిపించదు. స్వచ్ఛమైన మనసు వారి కళ్లలో గోచరిస్తుంది. అమ్మఒడిలో ఏ భయం లేకుండా నిశ్చింతగా ఉంటారు. కోరిక, వ్యాపారధోరణి, భయంలేని మనసే ఆనందనిలయం. మనిషి శారీరకంగా మానసికంగా ఎదిగినా, స్వేచ్ఛగా సంచరించగలుగుతున్నా, తెలివితేటలు పెంచుకున్నా- విషయవ్యవహారాలు బరువు బాధ్యతలు ఆ బాలానందాన్ని దూరం చేస్తాయి. దైవంపై విశ్వాసం, సేవాభావాలు ఆ ఆనందాన్ని తిరిగి ఇవ్వగలవు. లౌకిక వ్యవహారాలు వదలి, విరాగి కానవసరంలేదు. ధనాన్ని ఆర్జించాలి కాని అదే జీవిత పరమార్థం            కాకూడదు. మనకున్నదానిలో కాస్త అభాగ్యులకు దానం చేయాలి. ఇతరులను ఆదుకోవాలి. ప్రేమతో పలకరించాలి. నిజాయతీతో వ్యవహరించాలి. వచ్చినప్పుడు తెచ్చింది లేదు, చనిపోయేటప్పుడు తీసుకువెళ్ళేది లేదని మనసుకు బాగా నూరిపోయాలి.

- పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు