అన్నీ తెలుసా?

అంతా తెలుసు అనుకోవడం, సగం తెలియడం... రెండూ ప్రమాదకరమైనవే. అలాంటి వారికి తెలిసింది తక్కువ, తెలియనిది ఎక్కువ. తెలియదనే విషయాన్ని ఒప్పుకోరు.

Published : 24 Nov 2022 01:05 IST

అంతా తెలుసు అనుకోవడం, సగం తెలియడం... రెండూ ప్రమాదకరమైనవే. అలాంటి వారికి తెలిసింది తక్కువ, తెలియనిది ఎక్కువ. తెలియదనే విషయాన్ని ఒప్పుకోరు. ఎవరినైనా అడగడానికి అహం అడ్డుపడి తనకు నచ్చినట్టు, తన మనసుకు తట్టినట్టు ఊహించుకొంటారు.

ఏదైనా విషయాన్ని తెలుసుకోవడం అంత సులువైన పని కాదు. దానికి ఎంతో సహనం, ఏకాగ్రత, పట్టుదల కావాలి. ధనుర్విద్య నేర్పుతున్న ద్రోణుడు, శిష్యులకు గురి కుదిరిందా లేదా అని పరీక్షించడానికి చెట్టు, కొమ్మ, పక్షి, దాని తల, కన్ను కనబడుతున్నాయా అని అడిగాడు. కారణం- వారికి తెలియవలసిన విషయం తెలిసిందా లేదా అని పరీక్షించడానికే. ఏది, ఎంతవరకు తెలుసుకోవాలో అంతవరకు తెలుసుకున్నవారే ఆటుపోట్లను తట్టుకుని ఇతరుల ఎత్తుగడలకు తగినట్లుగా పై ఎత్తులు వేయగలరని ఆయన నమ్మకం.

‘నిన్ను నీవు తెలుసుకో’ అనేది వేదాంత పరిభాషలో ముఖ్యమైన మాట. ఆ మాట సరిగ్గా అర్థం చేసుకోలేనివారు ‘నాలో నాకు తెలియనిది ఏముంది?’ అను కుంటారు. చాలామంది ఇతరుల తప్పులు, లోపాలను వెదకడంలో చూపే ఆసక్తి తమ లోటుపాట్లు తెలుసుకోవడం పట్ల చూపరు. తనలోకి తాను చూసుకుని, లోపాలు బలహీనతలు తప్పుల మీద దృష్టి పెడితేనే తాను ఏ స్థితిలో ఉన్నాడో అర్థమవుతుంది.

ఒక వజ్రాల వ్యాపారి దగ్గర విలువైన వజ్రం ఉంది. దాన్ని ఎలాగైనా దొంగిలించాలని ఒక దొంగ నిర్ణయించుకున్నాడు. వ్యాపారి ప్రయాణం అవుతున్నప్పుడు తోటి యాత్రికుడిగా స్నేహం పెంచు కున్నాడు. వ్యాపారికి అతడిపై అనుమానం కలిగినా బయట పడలేదు. రాత్రి అందరూ పడుకున్న తరవాత వ్యాపారి ఆ వజ్రాన్ని నెమ్మదిగా సహ ప్రయాణికుడి వేషంలో ఉన్న దొంగ సంచిలో పెట్టేసి నిద్రపోయాడు. అర్ధరాత్రి దాటాక లేచిన దొంగ వ్యాపారి వస్తువులన్నీ వెదికాడు. వజ్రం దొరకలేదు. నిరాశతో పడుకున్నాడు. వ్యాపారి పొద్దున్నే లేచి తాను దొంగ సంచిలో ఉంచిన వజ్రాన్ని తీసుకొని తన వద్ద భద్రంగా ఉంచుకున్నాడు. మూడు రోజుల పాటు అలాగే జరిగింది. చివరికి వ్యాపారి ఎదుట దొంగ అసలు విషయం చెప్పి తప్పు ఒప్పుకొని ‘ఇంతకీ ఆ వజ్రం ఏమైంది?’ అని అడిగాడు. దానికా వ్యాపారి ‘వజ్రాన్ని ఈ మూడు రోజులూ నేను నీ చేతి సంచిలోనే పెట్టాను. నువ్వు దాన్ని తప్ప అన్నీ వెదికావు. అందుకే అది దొరకలేదు’ అన్నాడు చిన్నగా నవ్వుతూ. తనను తాను తెలుసుకోలేనివారికి ఇది చక్కని ఉదాహరణ.   

సర్వాంతర్యామి తనలోనే ఉన్నాడని గమనించకుండా ఎక్కడెక్కడో వెదుకుతుంటారు చాలామంది. ప్రాపంచిక వ్యామోహంలో పడి పరమాత్మను విస్మరిస్తుంటారు. ‘అసత్తు’ అయిన జగత్తును మరచి, ‘తమస్సు’ అయిన అహంభావాన్ని వదలితేనే, అమృతత్వమైన బ్రహ్మతత్త్వాన్ని చేరుకుంటారు. ఈ విషయం తెలుసుకుంటే- అన్నీ తెలుసునన్న అహం తొలగిపోతుంది.

- అయ్యగారి శ్రీనివాసరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని