ధన్యచరిత

శాక్యముని గౌతమ బుద్ధుడి జీవితంలో ఎన్నో రమణీయ ఘట్టాలు. ఆ మహానుభావుణ్ని సేవించి ధన్యులైన వారెందరో. వారిలో సుజాత వృత్తాంతం విశేష ప్రాముఖ్యం గలది. తథాగతుడి జీవితంలో ఆమె పాత్ర విలక్షణమైంది.

Published : 25 Nov 2022 01:05 IST

శాక్యముని గౌతమ బుద్ధుడి జీవితంలో ఎన్నో రమణీయ ఘట్టాలు. ఆ మహానుభావుణ్ని సేవించి ధన్యులైన వారెందరో. వారిలో సుజాత వృత్తాంతం విశేష ప్రాముఖ్యం గలది. తథాగతుడి జీవితంలో ఆమె పాత్ర విలక్షణమైంది.

బుద్ధుడి జీవితంలో అతడు సంబోధి(జ్ఞానం) పొందడానికి ముందు సుజాత అనే గృహిణి పాయసాహారాన్ని సమర్పించిన సన్నివేశానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వైశాఖ పూర్ణిమనాటి మధ్యాహ్నం సుజాత సిద్ధార్థుడికి పాయసం ఇచ్చిన వృత్తాంతం సుత్త పిటకంలో ఉంది. లలిత విస్తరం, అశ్వఘోషుడి బుద్ధ చరిత్ర, బుద్ధ ఘోషుడి పద్య చూడామణి కావ్యాల్లో, ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ రచించిన ‘లైట్‌ ఆఫ్‌ ఆసియా’ ఆంగ్ల గ్రంథంలోనూ ఈ ఘట్టం చోటుచేసుకుంది. తిరుపతి వేంకట కవుల ‘బుద్ధ చరిత్ర’ కావ్యంలోనూ సుజాత కథ రమణీయంగా చిత్రితమైంది. బౌద్ధుల చిత్రకళలోనూ ఆమె సంపాదించుకున్న స్థానం అనన్యసామాన్యం. బుద్ధుడి దృష్టిలోనూ ఈ ఘట్టం చిరస్మరణీయం.

సిద్ధార్థుడు బుద్ధుడైన ప్రాంతం ఉరువేలవనం. అక్కడ సేనాని అనే గ్రామం ఉండేది. ఆ గ్రామ పెద్ద పేరు కూడా సేనాని కావడం విశేషం. అతడు సంపన్న గృహస్థుడు. భూసంపద, గోసంపద విస్తారంగా ఉన్నాయి. అతడి భార్య సుజాత సార్థక నామధేయురాలు, నిర్మల చరిత, రూపవతి, సాధ్వి, కరుణాళువు, మృదుభాషిణి. యాచకుల పాలిట కల్పతరువు. సంతానం లేకపోవడం ఆ దంపతులకు పెద్ద లోటుగా ఉండేది. సంతానం కోసం ఆమె చేయని పూజ లేదు, ఆచరించని వ్రతం లేదు.

కోరికలు నెరవేరడానికి వృక్షాలను పూజించడం భారతదేశంలో ప్రాచీన సంప్రదాయం. సుజాత నిరంజనా(ప్రస్తుతం ఫాల్గూ)నదీ తీరంలో గల ఒక రావిచెట్టుకు ప్రదక్షిణం చేసి తనకు సంతానం కలిగితే మధుర భక్ష్యాలు నైవేద్యంగా సమర్పించగలనని మొక్కుకుంది. తరవాత ఆమె గర్భం ధరించింది. పుత్ర సంతానం కలిగింది. మొక్కు చెల్లించాలనుకుంది. ఆ వృక్ష ప్రాంతాన్ని శుభ్రంచేసి అలంకరించమని పరిచారికను పంపింది. అక్కడ వృక్షమూలంలో నిర్మల దీప కళికలా నిశ్చల కాంతితో ప్రకాశిస్తున్న సిద్ధార్థుణ్ని చూసి పరిచారిక యజమానురాలికి తాను చూసిన దృశ్యాన్ని వివరించింది.

సుజాత పాయసాహారంతో సిద్ధార్థుడున్న వనంలోకి వెళ్ళింది. అతణ్ని మానవరూపంలో ఉన్న వనదేవతగా భావించింది. ఆ దైవ కృప వల్లనే తనకు సంతానం కలిగిందనుకుంది. బంగారు పాత్రలోని పాయసాన్ని సమర్పించింది. కొన్ని రోజులుగా నిరాహారంగా ఉన్న గౌతముడు సొమ్మసిల్లి పడిపోయే స్థితిలో ఉన్నాడు. ఆ పాయసాన్ని ఆరగించాడు. ఆ పాయస మాధుర్యం అతడికి ఆశ్చర్యం కలిగించింది. ఆ పదార్థం భక్షించాక గొప్పశక్తి తన దేహంలో ప్రవేశించినట్టు గుర్తించాడు. ఆ పాయసం ఎలా తయారు చేశారని సుజాతను ప్రశ్నించాడు. తమ ఆవుల మందలోని వంద గోవుల క్షీరాన్ని యాభై గోవులకు తాగించి, ఆ యాభై గోవుల పాలను ఇరవై అయిదు గోవులకు పట్టి, ఆ గోవుల పాలను పన్నెండు ధేనువులతో తాగించి, వాటి పాలను ఆరు ఆవులకు పోశానని సుజాత చెప్పింది. ఆ ఆరు గోవుల పాలలో పరిమళద్రవ్యాలు కలిపి తెల్లని బియ్యంతో పాయసం వండినట్లు ఆమె చెప్పింది.

తాను వనదేవతను కాదని శుద్ధోదనుడి పుత్రుణ్నని సిద్ధార్థుడు ఆమెకు తెలిపాడు. సుజాత ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోయాక ధ్యానంలో ఉన్న సిద్ధార్థుడికి జ్ఞానోదయమైంది. అతడు బుద్ధుడయ్యాడు. సుజాత ఆతిథ్యంలోని భక్తి మాధుర్యా లను ఎన్నడూ బుద్ధుడు మరచిపోలేదు. చివరి ఘడియల్లోనూ ఆమె విందు తనకు జ్ఞానోదయ కారణమైందని ప్రశంసించాడు.

- డాక్టర్‌ దామెర వేంకట సూర్యారావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని