ఆరోగ్యమే ఐశ్వర్యం

సిరిసంపదల పట్ల ప్రతి మనిషీ ఎంతో ఆశగా ఉంటాడు. డబ్బులేకపోతే జీవితచక్రం ముందుకు కదలదు. బాల్యంలో తీవ్ర కష్టాలు అనుభవించినవాళ్లు పట్టుదలగా, కసిగా రేయింబవళ్లు శ్రమించి తృప్తిలేనట్లుగా ఆర్జిస్తారు.

Published : 26 Nov 2022 00:34 IST

సిరిసంపదల పట్ల ప్రతి మనిషీ ఎంతో ఆశగా ఉంటాడు. డబ్బులేకపోతే జీవితచక్రం ముందుకు కదలదు. బాల్యంలో తీవ్ర కష్టాలు అనుభవించినవాళ్లు పట్టుదలగా, కసిగా రేయింబవళ్లు శ్రమించి తృప్తిలేనట్లుగా ఆర్జిస్తారు. డబ్బుతో ముడివడిన సౌకర్యాలన్నీ అమర్చుకుంటారు. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని పూర్తిగా అశ్రద్ధ చేస్తారు. సకల సంపదలు ఉన్నా ఆరోగ్యం లేకపోతే, ఏమీ లేనట్లే. దుర్భరమైన ఆ జీవితం నరకప్రాయంగా ఉంటుంది. ఆరోగ్యం కోసం రోజూ గుప్పెడు మందులు మింగడం, పథ్యం పేరుతో రుచి లేని ఆహారం తినాల్సి రావడంతో బతుకు నిస్సారమనిపిస్తుంది. కొందరు విరక్తితో బలవంతంగా తనువు చాలిస్తారు.

భారతీయ ఆధ్యాత్మికతలో క్రమశిక్షణ కీలకమైంది. శరీరం భూమిక. దాన్ని యోగవిద్యల ద్వారా అదుపులోకి తెచ్చుకోవాలి. మనసు చంచలం. దాన్ని ధ్యానం ద్వారా నిగ్రహించాలి. ఆత్మ సర్వోన్నతం. దాన్ని జ్ఞాననేత్రాలతోనే దర్శించగలం. శరీరం, మనసు, ఆత్మ ఏకత్వాన్ని పొందినప్పుడు దివ్యానందం కలుగుతుంది. ఇతర ఆనందాలన్నీ దాని ముందు దిగదిడుపే.

సుఖం వేరు. ఆనందం వేరు. సుఖంలో సంతోషం ఉంటుంది. అది ఆనంద స్థాయి కంటే చాలా తక్కువలో ఉంటుంది. ఆనందం సుఖాన్ని అపేక్షించదు. అది ఆత్మకు సంబంధించింది. సాధకుడు అంచెలంచెలుగా ఆత్మానుభూతికి చేరుకోవాలి. అంటే ప్రాపంచిక సుఖసంతోషాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకూడదు.  

ఆరోగ్యం సహకరించకుండా ఎవరూ ఎలాంటి సాధనలూ చెయ్యలేరు. మంచి శరీరదారుఢ్యం, ఆరోగ్యం ఉన్నవారినే సైనికులుగా ఎంపిక చేస్తారు. అలాంటివారే శత్రువులపై పోరాడగలరు. విజయం సాధించగలరు. బలహీనులు తమకు తామే సాయం చేసుకోలేరు. ఇక వారు ఇతరులకు ఏ సాయం చెయ్యగలరు?
రైతులు ఏడాది పొడవునా కాయకష్టం చేస్తూనే ఉంటారు. ఫలసాయంతో ధాన్యపు సిరులు పెంచుకుంటూ ఉంటారు. ఆరోగ్యమే వాళ్ల మూలధనం. విద్యార్థులు, ఉద్యోగులు ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. విద్యార్థి దశ పరిమితంగానే ఉంటుంది. ప్రాథమిక విద్య పునాదిలాంటిది. బలమైన పునాదితోనే భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుంది. ఈ మూల సత్యాన్ని అందరూ గ్రహించలేరు. తల్లిదండ్రులు తాము పడిన కష్టాన్ని పిల్లలు పడకూడదని ప్రేమగా అనేక సౌకర్యాలు కల్పిస్తారు. వాటికి అలవాటుపడిన పిల్లలు కష్టించి పనిచేయడానికి ఇష్టపడరు. కష్టపడనివారికి సుఖపడే అర్హత లేదు.

పెద్దలు ప్రేమకు, గారాబానికి మధ్య గల తేడా గమనించరు. ప్రేమ మోతాదు ఎక్కువైతే అది గారాబం అవుతుంది. గారాబంతో పిల్లలు పూర్తిగా పాడయ్యాక ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. సింహానికి రోజూ ఆహారం నోటికందిస్తుంటే, వేట ఎలాగో మరచిపోతుంది. పిల్లలకు కష్టం తెలియకపోతే పరమ బద్ధకస్తులవుతారు. విపరీతంగా బరువు పెరగడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యం బాధిస్తుంది. పిల్లల భవిత బావుండాలంటే పెద్దలు తమ కర్తవ్యాన్ని బాధ్యతను సక్రమంగా పాటించాలి.

కేవలం ఆరోగ్యానికే ప్రాధాన్యమిస్తూ కండలు పెంచుకున్నా ఉపయోగం లేదు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కర్తవ్య దీక్షతో, ఇష్టంగా కష్టపడాలి. జీవిత లక్ష్యాన్ని సాధించాలి. మనిషి ఏ దశలో ఉన్నా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ జీవించడమే అసలైన ఐశ్వర్యం.

కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు