మహాభారతం మానవ చరితం

పుట్టగానే శిశువు ఏడుస్తుంది. వయసు పెరిగిన కొద్దీ మనసు వికసించి, ఆకాశం వంక దృష్టి మళ్ళుతుంది. శిశువు జిజ్ఞాసువుగా మారుతుంది. భౌతిక ప్రపంచం చుట్టూ తిరిగినంత కాలం శాశ్వతమైన సుఖశాంతులు అందవు.

Published : 30 Nov 2022 00:43 IST

పుట్టగానే శిశువు ఏడుస్తుంది. వయసు పెరిగిన కొద్దీ మనసు వికసించి, ఆకాశం వంక దృష్టి మళ్ళుతుంది. శిశువు జిజ్ఞాసువుగా మారుతుంది. భౌతిక ప్రపంచం చుట్టూ తిరిగినంత కాలం శాశ్వతమైన సుఖశాంతులు అందవు. యథార్థం ఏమిటో తెలుసుకోవాలన్న ఆకాంక్ష భౌతిక విషయాల పట్ల ఉన్న కుతూహలం కన్నా ఉన్నతమైనది. అదే జ్ఞానానికి తొలి సోపానం.

సృష్టిని గురించి, ఈ లోకంలో తన ఉనికి గురించి రకరకాల ఆలోచనలు మొలకెత్తుతాయి. సృష్టి ఎలా జరిగింది, ఎప్పుడు మొదలైంది, ఎవరు సృష్టించారు, ఎంతకాలం సాగుతుంది, ఎప్పుడు ఎలా అంతం అవుతుంది? మానవ మేధలో గిరగిరలాడుతున్న ప్రశ్నావళికి మహాభారతం జవాబు చెబుతున్నది. ప్రకృతి శక్తులను జయించి, పరమాత్మను చేరుకునే మార్గదర్శనం చేయిస్తుంది మహాభారతం. ధర్మ విజయానికి సంకేతంగా వ్యాసుడి మహాభారతం జయగ్రంథంగా పేరుపొందింది.

వేదాలు తొలి చదువులు. వేదార్థాన్ని తెలపడానికి కృష్ణద్వైపాయనుడు ఉపవేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు విప్పి చెప్పాడు. సర్వ విజ్ఞానసారంగా తోచడం వల్ల సారమతులు మహాభారతాన్ని పంచమవేదంగా అంగీకరించారు. వేదాన్ని మూడు కోణాలనుంచి విశ్లేషించుకోవాలి. వేదా లేక విద్‌ అంటే తెలుసుకోవడం. తెలుసుకోవలసింది ఏమిటి? విద్యతే- తెలుసుకోమంటోంది. విందతి- అనుభవించి తెలుసుకుంటే మంచిది. వేత్తి- ప్రపంచం గురించి, ఆత్మ గురించి విచారం చేయాలి. విద్యతే, విందతి, వేత్తి... వెరసి- వేదం. రుగ్వేదం అగ్నివిద్య. యజుర్వేదం ప్రాణ (వాయు) విద్య. సామవేదం జ్యోతిర్విద్య. అధర్వణవేదం భూ- జల విద్య. పంచభూతాల పంచత్వమే భూమిపైన ప్రాణికోటి అస్తిత్వానికి కారణం. పంచమ వేదమైన భారతానికి, పాంచభౌతికమైన మానవ శరీరానికి లంకె ఉన్నది. ద్రోణుడు, ద్రుపదుడు, కర్ణుడు శరీర భాగాలకు, ద్రౌపది మనోబలానికి ఉదాహరణలు. మహాభారతం ఇతిహాసం. భూత, భవిష్యత్‌, వర్తమానాలలో అది జరుగుతూనే ఉన్నది. దాన్ని మూడు విధాలుగా విశ్లేషించుకోవాలి.

ఆరువేల సంవత్సరాల వెనక కురుక్షేత్రంలో మహాభారత సంగ్రామం జరిగింది. ఇది భౌతిక సత్యం. ఆధ్యాత్మికంగా మానవ హృదయ క్షేత్రంలో నిరంతరం మంచి-చెడుల నడుమ జరిగే స్పర్ధ ఓ విధమైన యుద్ధమే. సూర్యమండలం నుంచి విడుదల అవుతున్న ప్రాణశక్తి భూమండలంపైన ఉన్న జీవరాశి మనుగడకు మూల కారణం. సూర్యవంశం కశ్యప ప్రజాపతితో మహాభారతం ఆరంభం అయింది. ఇది దైవికమైన చర్య.

అండాండంలోని లక్షణాలు పిండాండంలో ఉన్నట్టుగా, మానవ శరీరంలో మహాభారతం ఆగని ప్రవాహమై సాగుతూ అలరిస్తున్నది. ‘ఒక్కొక్క భావ రూపము ఒక్కొక్క భవ స్వరూపమై’ మహాభారతంలోని పాత్రలు నిత్య జీవితంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేస్తాయి. భూమి, చంద్రుడు, సూర్యుడు, పరమేష్ఠి, స్వయంభు అనే అయిదు మండలాల సమష్టి రూపమే ఈ ప్రపంచం. చివరి రెండు మండలాలు కంటికి కనిపించవు. పాంచ భౌతిక శరీరం జీవాత్మకు ఉపాధి. పాంచమాండలిక ప్రపంచం పరమాత్మకు ఉపాధి. ఏనాటికైనా మానవుడు దివ్యమానవుడు కాగల అవకాశం ఉన్నదని మహాభారతం చాటుతున్నది. భారతం చదివి మానవుడై, భాగవతం చదివి భగవంతుడై, రామాయణం చదివి ఆదర్శ మానవుడిగా ఈ భూమిపైన జీవనయాత్ర సాగించాలి.

- ఉప్పు రాఘవేంద్రరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని