నవనీత కృష్ణ... నారాయణ తీర్థ!

వాగ్గేయకారులెందరో తమలోని భక్తి భావాలను గేయాల రూపంలో రాసుకొని  దేవుణ్ని పలు విధాల గానం చేస్తూ తరించారు. నారాయణతీర్థ తరంగాలు ఇదే కోవకు చెందిన భక్తి భావ సమర్పణలు. నారాయణ తీర్థ భాగవత పంచరత్నాల్లో ఒకరు.

Published : 02 Dec 2022 00:46 IST

వాగ్గేయకారులెందరో తమలోని భక్తి భావాలను గేయాల రూపంలో రాసుకొని  దేవుణ్ని పలు విధాల గానం చేస్తూ తరించారు. నారాయణతీర్థ తరంగాలు ఇదే కోవకు చెందిన భక్తి భావ సమర్పణలు. నారాయణ తీర్థ భాగవత పంచరత్నాల్లో ఒకరు. ఆంధ్రప్రదేశ్‌లోని కాజా గ్రామంలో ఈయన జన్మించారు. నారాయణ తీర్థ నిజనామం తల్లావఝ్ఝుల గోవింద శాస్త్రి. సంగీతంపై మక్కువతో ఆయన  తంజావూరు తరలి వెళ్ళారు. అక్కడ భూపతిపురం అనే గ్రామంలోని వేణుగోపాల స్వామి ఆలయ సత్రంలో నివాసం ఏర్పరచుకున్నారు. ఆ దేవాలయానికి తరచూ వచ్చే స్వామి శివానందతీర్థ పరిచయ భాగ్యం ఆయనకు కలిగింది. శివానందుల వారు సంగీత సాహిత్యాల్లో ఉద్దండులు. వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీకృష్ణుడి వేణువు నుంచి శ్రావ్యమైన స్వరాలు ఆయనకు వినిపించేవని అంటారు. శివానందులే గోవింద శాస్త్రిని నారాయణ తీర్థ  అని సంబో ధించేవారు. నారాయణ తీర్థకు  కృష్ణు డిపై భక్తి ఎక్కువ. ఆయన రాధాకృష్ణ సంప్రదాయాన్ని పరాకాష్ఠకు తీసుకు వెళ్ళిన మహాభక్తుడు. ఆ భక్తికి  విస్పష్ట రూపం ఇచ్చి పన్నెండు కావ్య భాగాలు రాశారు. నారాయణతీర్థ రాసిన కృష్ణ  లీలా తరంగిణిలో గోపాలుడి  బాల్యం నుంచి రుక్మిణీ కల్యాణం వరకు ద్విపద రీతిలో తరంగాలను మనోహరంగా కూర్చారు. జయదేవుడి గీతగోవిందం, భక్తి వైరాగ్యం, కృష్ణుడిపై అపారమైన ప్రేమ- నారాయణ తీర్థను ప్రభావితం చేశాయి. తరంగాలన్నీ శ్రీకృష్ణ లీలలను కళ్లకు కట్టినట్లు అనుభూతిని కలిగిస్తాయి. భాగవతపురాణంలో శ్రీకృష్ణ లీలలు ఎంతగా భక్తిభావాన్ని సృజిస్తాయో తరంగాలు సైతం అంతే అనురక్తిని పరమాత్ముడిపై కలిగిస్తాయి.

శ్రీకృష్ణలీలా తరంగాలు పన్నెండు అధ్యాయాల్లో ఎన్నో కృతులు శ్లోకాలు చోటుచేసుకున్నాయి. లయబద్ధమైన ఈ భక్తిభావ కవిత్వం వినసొంపుగా సాగుతూ శ్రీకృష్ణుడి లీలలను కళ్లకు కట్టేలా ఉంటుంది. లీలాశుకుడి శ్రీకృష్ణ కర్ణామృతం ఛాయలు ఈ తరంగాల్లో లీలగా ప్రస్ఫుటం అవుతాయి.

తొలి తరంగంలో శ్రీకృష్ణ జన్మ గురించి ప్రారంభమై పన్నెండో తరంగంలో రుక్మిణీ కల్యాణ మహోత్సవంతో ముగిసే తరంగ మాల  భక్తి సౌరభాల హేల. ‘శరణం భవ కరుణామయి కురు దీన దయాళో... కరుణారస వరుణాలయ కరిరాజ కృపాలో (శ్రీమన్నారాయణా... నీవే రక్షకుడవు నీవే ఉపకారివి. ప్రేమ జలనిధివి. ఆర్తితో పిలిచిన గజేంద్రుడిని కాపాడినవాడివి) అంటూ రాసిన తరంగం ఎందరినో భక్తిరసంలో ఓలలాడించింది. ఈ వాగ్గేయకారుడి తరంగాలు గానం చేయడానికి నాట్యాభినయానికి తగినవిగా ఉంటాయి. నాటకానికి అనువైన పారిజాతాపహరణం, హరిభక్తి సుధార్ణవం- నారాయణ తీర్థ ఇతర రచనలు. జీవిత చరమాంకంలో శ్రీకృష్ణ రాసలీలల వైభవాన్ని బృందావనంలో నారాయణ తీర్థ కళ్లారా చూశారని చెబుతారు. ఈ వాగ్గేయకారుడు తాను శ్రీకృష్ణ భక్తిరసంలో తేలియాడి తన రచనలతో భక్తులకు భవజలనిధిని దాటించగల సాహిత్యాన్ని అందించారు.

- అప్పరుసు రమాకాంతరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని