గెలుపు సూత్రం

ప్రకృతి ఎంత వెనక్కితోయాలని ప్రయత్నించినా ముందుకే పరుగులు పెడుతుంది కెరటం. అణువణువునా గెలవాలన్న తపన దానిలో కనిపిస్తుంది. మనిషి నేర్చుకోవలసిన గొప్ప పాఠం అందులో దాగి ఉంది. వర్షం భూమి మీద మాత్రమే కాదు- రాళ్లమీదా పడుతుంది.

Published : 04 Dec 2022 00:31 IST

ప్రకృతి ఎంత వెనక్కితోయాలని ప్రయత్నించినా ముందుకే పరుగులు పెడుతుంది కెరటం. అణువణువునా గెలవాలన్న తపన దానిలో కనిపిస్తుంది. మనిషి నేర్చుకోవలసిన గొప్ప పాఠం అందులో దాగి ఉంది. వర్షం భూమి మీద మాత్రమే కాదు- రాళ్లమీదా పడుతుంది. ఆ వర్షపు చుక్కల్ని పీల్చుకున్న నేల ఒక విత్తనం నుంచి వెయ్యి విత్తనాలను సృష్టించడానికి కారణమవుతుంది. మరో పక్క వర్షాన్ని తిరస్కరించిన రాయి అచేతనంగా ఉండిపోతుంది. ఎప్పటికప్పుడు మనిషి తన స్వభావాన్ని ప్రశ్నించుకోవాలి. విత్తులో దాగిన మహావృక్ష రహస్యాన్ని ప్రపంచానికి చూపించాలి.

విజయం సాధించాలంటే దృష్టి, ఆత్మ సంపూర్ణంగా లక్ష్యం మీద లగ్నం కావాలి. ఏ కళకైనా అదే ముఖ్యం. వాహనం నడిపే శిక్షణ తీసుకుంటున్న మొదట్లో అది ప్రయాసతో కూడుకున్న విషయంగా తోస్తుంది. తర్జన భర్జన పడాల్సీ వస్తుంది. ముందు దృష్టి, వెనక దృష్టి, పక్క దృష్టి... ఇదికాక నడిపేందుకు అమర్చిన ఉపకరణాలు... వాటిని ఉపయో గించే విధానం...ఇవన్నీ తికమక పెడతాయి. ఒకసారి నేర్చుకున్నాక ముందు పరిస్థితి గుర్తుకూడా ఉండదు. ఆ పోరాటం నుంచి ఈ సౌఖ్యం. వాహనం మనిషిని నడిపే పరిస్థితి నుంచి మనిషి వాహనాన్ని సునాయాసంగా నడిపే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సంధికాలం మనిషికి విలువైన పాఠం నేర్పుతుంది. ఏ విషయమైనా ఇంతే. ప్రారంభించిన దాన్ని మధ్యలో విడిచిపెట్టేయకుండా ఓర్పుతో శ్రమించినప్పుడే గెలుపు సొంతమవుతుంది.

పని కానీ- ఆట కానీ. రెండు పనులలో శక్తి, సమయం సమానంగా అవసరమవుతాయి. వర్గీకరించి చూస్తే పని ఒత్తిడిని, ఆట ఆనందాన్ని కలిగిస్తాయి. శరీరానికి ఆ తేడా తెలియదు. అది ఏదైనా స్వేదం చిందిస్తుంది. మనసుకు తెలుసు ఆ మర్మమేమిటో... పథకం వేసి పనిని ఎలా తప్పించుకోవాలి... ప్రతిఘటించాలి.. . చేయాలా వద్దా, తప్పనిసరైతే చూద్దాం... దీంట్లో లాభమెంత లాంటి లెక్కలు వేసేది మనసు.

ఏదైనా ఇష్టంతో చేసినప్పుడు దానికోసం చేసే శ్రమ సరదాగా అనిపిస్తుంది. ఫలితం తారుమారైనా బాధనిపించదు. పురస్కారాలు, ప్రతిఫలాలు అనేవి కేవలం మైలురాళ్లే కానీ గమ్యం కాదు. గెలవడం అంటే పరుగులు తీస్తూ వెళ్లి మొదటిస్థానం సంపాదించడం కాదు. ప్రతిభను ప్రదర్శింపచేసి, చప్పట్లను ఆశిస్తూ వేదికలమీద పురస్కారాలను అందుకోవడం కాదు. మహోన్నతమైన వ్యక్తిత్వంతో, నడవడితో ఆదర్శప్రాయంగా జీవిస్తూ ఎందరి హృదయాలనో గెలవడం.

బోసినవ్వులు చిందిస్తూ, నిస్సహాయ స్థితిలో సైతం ఆనందాన్ని పంచుతూ అందరినీ ఆకర్షించే పసిపాప గెలుపునకు కారణం- ఎటువంటి ప్రతిఫలాపేక్షా లేకుండా స్వచ్ఛమైన మృదుస్వభావంతో చుట్టూ వారికి అమితమైన ఆనందాన్ని పంచడం. కాస్త ప్రేమ కురిపిస్తే చాలు- జంతువులు కూడా దగ్గరకొచ్చి ఎంతో సంతోషాన్ని పంచుతాయి. మనిషి ఆలోచనా వైఖరిలోనే మార్పు అవసరం. మెదడులో మెదిలే అనేక కలుషితమైన సమీకరణాలను ముందు తుడిచిపెట్టాలి.

జీవితంలో కష్టసుఖాలను సమానంగా చూసుకుంటే ఎటువంటి నష్టమూ లేదు. ఒకదానివైపే లొంగిపోయే మనిషిని విజయం వరించదు. లోకంలో కేవలం తెలివితేటలున్నవారే పైకి రాలేరు. తెలివితేటలకు శ్రమ తోడైనప్పుడే జీవితంలో అనుకున్నది సాధించగలుగుతారు!

మంత్రవాది మహేశ్వర్‌

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు