ధార్మికవీర మూర్తి

లోకాన్ని నడిపేది ధర్మం. ధర్మాన్ని రక్షించడం కోసమే అవతార పురుషులు ఉద్భవిస్తారు. ధర్మానికి గ్లాని(నష్టం) ఏర్పడినప్పుడు తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు.

Published : 05 Dec 2022 01:29 IST

లోకాన్ని నడిపేది ధర్మం. ధర్మాన్ని రక్షించడం కోసమే అవతార పురుషులు ఉద్భవిస్తారు. ధర్మానికి గ్లాని(నష్టం) ఏర్పడినప్పుడు తాను అవతరిస్తానని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ప్రసిద్ధమైన దశావతారాలే కాకుండా ఇంకెన్నో రూపాల్లో అవతరించిన పుణ్యమూర్తులు లోకానికి ఎంతో మేలు చేసి, అంతర్ధానమయ్యారు. కొందరు చిరంజీవులై ఉన్నారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. ధర్మరక్షణకోసం అవతరించి, చిరంజీవిగా నిలిచిన ధార్మికవీర మూర్తి హనుమంతుడు. ఆంజనేయుడి ధర్మవీరం జగద్విదితం. మానవోత్తముడు, మర్యాదాపురుషోత్తముడు అయిన శ్రీరామచంద్రుడి మనసును గెలుచుకున్న అపార గుణనిధి హనుమంతుడు. 

దేవతలు సత్త్వగుణ సంపన్నులు. మానవులు రజోగుణ సమన్వితులు. రాక్షసులు తమోగుణ ప్రధానులు. సత్త్వగుణం లోకక్షేమ కారకం. రజోగుణం రాగబంధాలకు నిలయం. తమోగుణం వినాశకారకం, ధర్మవిరుద్ధం. తమోగుణ ప్రధానుడైన రావణుడి అకృత్యాలతో ముల్లోకాలూ తల్లడిల్లిపోయాయి. అధర్మం పిశాచ తాండవం చేసింది. అప్పుడు దేవతల ప్రార్థనపై మహావిష్ణువు ధర్మరక్షణ కోసం శ్రీరాముడిగా అవతరించాడు. ధర్మరక్షణ కోసం అవతరించిన పుణ్యమూర్తికి, ధర్మవీరుడైన హనుమంతుడు తోడయ్యాడు. రోమరోమంలో రామనామాన్ని ధరించి, రాముడి ధర్మమార్గంలో పయనించాడు. పుట్టగానే మూడువందల యోజనాల దూరం ఆకాశంలోకి ఎగసి, సూర్యబింబాన్నే మింగబోయిన జగదేకవీరుడికి నూరు యోజనాల కడలిని దాటడం ఏమంత కష్టం? జాంబవంతుడు అందించిన ప్రోత్సాహ శక్తితో ఆకాశానికెగసి, అపార జలనిధిని దాటుకుంటూ, అడ్డువచ్చిన రాక్షసులను దునుమాడుతూ, అప్రతిహతంగా ముందుకు సాగి దుర్భేద్యమైన లంకలో అడుగుపెట్టిన ధీరుడు పవనసుతుడు! వనవిధ్వంసంతో తన బలం ఏమిటో రుచి చూపి, శత్రువు దగ్గరికి వెళ్ళి హెచ్చరించిన పరమ ధర్మవీరాగ్రేసరుడి గాథ త్రిలోకానందకరం!

లంకలో సీతామాతను దర్శించి, రామ సందేశాన్ని అందించి, తన ప్రయాణ లక్ష్యంలో విజయుడైన మారుతి చరిత్ర లోకారాధ్యం! సాక్షాత్తు రావణాసురుడే అంజనాసుతుడి శక్తిసంపదలను చూసి ఆశ్చర్యపడి, ‘ఇతడు కైలాస పర్వతంపై శివుడి సన్నిధిలో ఉండే నందీశ్వరుడా?’ అని ప్రశంసించాడు. రాముడిలాగా మారుతి కూడా మర్యాదాసంపన్నుడు. అతడి మాటల్లో ఎక్కడా పొల్లు వినిపించదు. సంస్కారపూరితమైన అతడి పలుకుల్లో వ్యాకరణ సంపత్తి నిండి ఉంటుంది. అందుకే శ్రీరామచంద్రుడు మెచ్చిన మూర్తిమత్వం ఆయనది!

దుష్టశక్తుల పాలిట సింహస్వప్నం ఆంజనేయ రూపం! ధర్మధ్వంసకులకు ఆయన పేరు వింటేనే ముచ్చెమటలు పోస్తాయి. సాధువర్తనులకు అతడొక పెద్ద అండ! భయం వేసిన మనిషికి ఆంజనేయ స్మరణ వేయి ఏనుగుల బలాన్నిస్తుంది. దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మ పరిరక్షణ అతడిలో అణువణువునా దర్శనమిస్తాయి. అందుకే మహర్షులు అతణ్ని ‘రామాయణ మహామాలా రత్నం’ అని కొనియాడారు. హనుమంతుడి విశ్వరూపానికి ప్రతిబింబమైన సుందరకాండ... లోకానికి నిత్యపారాయణమయ్యింది. సకలార్థ సాధనకు ఇందులోని ప్రతి శ్లోకం సాధనమైంది. సుందరకాండలో సర్వం సుందరమే అనే ప్రశస్తి లోకమంతా వ్యాపించింది. సుందరుడంటే హనుమంతుడే అని కీర్తించింది.

డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు