ధర్మపథం

ధార్మిక పథమే భారతీయుల అసలుసిసలు జీవన విధానం. అదే ఈ జాతి జీవనాడి. మన జీవనశైలి మహర్షులు రూపొందించినది. పాపభీతి, దైవభీతి మన జాతి సంస్కారంలో భాగం.

Updated : 06 Dec 2022 05:14 IST

ధార్మిక పథమే భారతీయుల అసలుసిసలు జీవన విధానం. అదే ఈ జాతి జీవనాడి. మన జీవనశైలి మహర్షులు రూపొందించినది. పాపభీతి, దైవభీతి మన జాతి సంస్కారంలో భాగం. వాటినుంచి పక్కకు తొలగినప్పుడల్లా- సమాజం గతి తప్పుతుంది. ధర్మాన్ని ఆచరించు, ధర్మం విషయంలో ఏమరుపాటు తగదు- అన్న వేదంలోని శిక్షావల్లి ఆదేశాన్ని ఈ జాతి శిరోధార్యంగా స్వీకరించింది. మన దేశానికి ప్రపంచఖ్యాతి దక్కడంలో ప్రముఖ పాత్ర వహించింది- ఇక్కడి ప్రజల మనుగడలోంచి తొంగిచూసే ధార్మిక దృక్పథమే!

‘చెట్టుచాటునుంచి నన్ను సంహరించావు. అధర్మానికి పాల్పడ్డావు. రేపు సజ్జన సమాజం నిన్ను నిలదీస్తే ఏం సమాధానం చెబుతావు?’ అని ఒక వానరుడు నేరుగా అవతార పురుషుణ్ని ప్రశ్నించిన ఘట్టం మనకు వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. ‘మాయాజూదం విషయంలో ఉపేక్ష కారణంగా పై లోకాల్లో నీ పేరు ప్రఖ్యాతులు దెబ్బతిన్నాయి. నీవు ధర్మం తప్పావు’ అని తన మహారాజునే ఒక మంత్రి నిందించిన వైనాన్ని వ్యాస భారతం వివరించింది. ధర్మంపట్ల మనిషి ఎంత అప్రమత్తంగా ఉండాలో మనకు మహర్షులు నేర్పారు. ధర్మమే మన బలం. ‘భారతీయ సమాజాలను ఒక్కటిగా కలిపి ఉంచేది- ధర్మమే’ అన్న సర్వేపల్లి రాధాకృష్ణన్‌ మాట... అవగాహనతో చెప్పినది. ఆలోచించి పలికినది!

ధర్మం అంటే ఏమిటో మనం వివరించలేక పోవచ్చుగాని, మన అందరికీ ధర్మం అంటే ఏమిటో తెలుసు. ఏది ధర్మమో, ఏది అధర్మమో కూడా బాగా తెలుసు. తెలిసీ, అధర్మంవైపు మొగ్గు చూపించడం- మన బలహీనత. నిజానికి అది దుర్యోధనుడి ప్రవృత్తి. ‘ధర్మం అంటే ఏమిటో నాకు తెలుసు- అది నా స్వభావంలో భాగం కావడంలేదు. అధర్మం అంటే ఏమిటో కూడా నాకు తెలుసు- కానీ, అది నన్ను విడిచి పెట్టడంలేదు’ అన్నాడు భారతంలో సుయోధనుడు. మనలో చాలామంది సమస్య అదే! అందుకే మనలో ఈ అశాంతి, ఈ అంతస్సంఘర్షణ. మనిషి వాటినుంచి బయటపడాలంటే ధర్మమార్గంలో జీవించడం ఒక్కటే దారి.
వాస్తవానికి ధర్మం అనే పదానికి ప్రపంచ భాషలు దేనిలోనూ సమానార్థక పదం లేదు. ఆ మాటకొస్తే సంస్కృత భాషలోనే దానికి మరో పర్యాయపదం లేదు. కాబట్టి అర్థతాత్పర్యాలు, నిర్వచనాల జోలికి పోకుండా- ధర్మాత్ముల జీవన విధానంలోంచి ధర్మాచరణ విధానాలను చూసి అనుకరించడం మేలు. ‘రాముడు మూర్తీభవించిన ధర్మం’ అని మారీచుడు ఎందుకు అన్నాడో- మనకు రాముడి ప్రవర్తనలో అడుగడుగునా నిరూపించారు వాల్మీకి మహర్షి. రాముడి నడతను అనుకరిస్తే మనం ధర్మమార్గంలో ఉన్నట్లే!

అంతకన్నా సులువైన మార్గాన్ని శాంతిపర్వంలో భీష్ముడు ఈ మానవజాతికి ఉపదేశించాడు. ‘ఎదుటివారు ఏం చేస్తే మనకు అయిష్టంగానో, కష్టంగానో తోస్తుందో, దాన్ని మనం ఇతరుల పట్ల చేయకుండా ఉండటమే పరమ ధర్మపథం’ అని సూత్రీకరించాడాయన. ఈ ఒక్క సూత్రాన్ని మనం జీవితమంతా పాటించగలిగితే చాలు-  మనం ఆత్మను ఒప్పిస్తూనో, నొప్పిస్తూనో జీవించే దుస్థితి లేకుండా ఉంటుంది. మనశ్శాంతి దక్కుతుంది. సమాజంలో కక్షలు, కార్పణ్యాలు దూరం అవుతాయి. జనమంతా సుఖశాంతులతో జీవించగలుగుతారు. భారతీయ సమాజాలకు ప్రపంచ దేశాల్లో తిరిగి పరువు ప్రతిష్ఠ చేకూరతాయి. ధర్మో రక్షతి రక్షితః అన్న ఆర్యోక్తి మరోసారి నిరూపణ అవుతుంది. అదే ప్రస్తుతం మన తక్షణ కర్తవ్యం!

ఎర్రాప్రగడ రామకృష్ణ

Read latest Editorial News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని