నిజమైన తపస్సు

మన సంస్కృతిలోని మహత్తర పదం తపస్సు. తపస్సు అంటే తపించడం, ఎవరైనా తాను కోరుకున్న లక్ష్యం కోసం సాధన చేసి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం. తపస్సు అంటే దహించేదనే అర్థం ఉంది. అహంకార, మమకారాలను, దేహాభిమానాన్ని దహించడమే తపస్సు.

Updated : 06 Jan 2023 04:56 IST

న సంస్కృతిలోని మహత్తర పదం తపస్సు. తపస్సు అంటే తపించడం, ఎవరైనా తాను కోరుకున్న లక్ష్యం కోసం సాధన చేసి ఆ లక్ష్యాన్ని చేరుకోవడం. తపస్సు అంటే దహించేదనే అర్థం ఉంది. అహంకార, మమకారాలను, దేహాభిమానాన్ని దహించడమే తపస్సు. ఇంద్రాది దేవతలు తపస్సు ద్వారా దేవత్వాన్ని పొందారు. ఋషులు స్వర్గాన్ని పొందారు. తపస్సు ద్వారా సర్వం సాధ్యమవుతుందంటారు. ఏ కార్యాన్ని చేయడానికైనా ఇదొక మానసిక సాధన. తపస్సు ద్వారా ఉత్తమ గతిని పొందినవారి గురించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. వాటిలో మనువు, శతరూపా చేసిన తపస్సు ప్రసిద్ధమైనది. వీరిరువురు అనేక సంవత్సరాలు తపస్సు చేసి కామేంద్రియాలను శోషింపజేశారు. కేవలం ఎముకల గూడు మిగిలింది. ప్రత్యక్షమైన విష్ణువుతో నీలాంటి సుపుత్రుడు కావాలని కోరారు. ‘నాలాంటి వాడిని ఎక్కడ వెతికేది? నేనే మీ పుత్రుడిగా జన్మిస్తా’నని విష్ణువు వారికి చెప్పాడు. ద్వాపర యుగంలో ఆ మనువు, శతరూపాయే దేవకీ వసుదేవులుగా జన్మించారు. వారికి పరమాత్మ కృష్ణ రూపంలో జన్మించాడు.  

మహాభారతం స్వధర్మవర్తనమే తపస్సు అని బోధించింది. అంటే స్వధర్మాన్ని చిత్తశుద్ధితో ఆచరించాలి. దీనికి సంబంధించి మహాభారతం అరణ్యపర్వంలో మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పిన ఓ కథ ఉంది. మాంసం విక్రయించి జీవిస్తున్న ధర్మవ్యాధుడు కౌశికుడనే బ్రహ్మచారికి తత్త్వోపదేశం చేస్తూ ‘నాకు ఏ తపస్సూ తెలియదు. నేను తల్లిదండ్రులను కష్టపెట్టను. వారికి సేవ చేస్తాను. పెద్దలను గురువులను గౌరవిస్తాను. అసత్యం పలకను. నిందాస్తుతులను సమానంగా స్వీకరిస్తాను. ఇదే నేను చేసే తపస్సు. నువ్వూ ప్రత్యక్ష దైవాలైన నీ తల్లిదండ్రులను కొలుచుకో. నీ ధర్మాన్ని నిర్వర్తించు. అదే అసలైన తపస్సు’ అని బోధిస్తాడు.

బాధ్యతలు గలవారు అందరినీ విడిచి, తమ కర్తవ్యాలను మరచి ఎక్కడెక్కడికో వెళ్ళాలనుకోవడం పలాయనవాదమే కాని ఆధ్యాత్మిక మార్గం కాదు. ప్రతీ ఒక్కరూ స్వధర్మాన్ని త్రికరణశుద్ధిగా ఆచరించడమే తపస్సుగా భావించాలి.

తపస్సు మూడు రకాలుగా ఉంటుందని శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు. మొదటిది శారీరక తపస్సు. దేవతలను, జ్ఞానులను, గురువులను పూజించాలి. ఇతర ప్రాణులను హింసించకుండా ఉండాలి. రెండోది వాచిక తపస్సు. ఇతరులకు ప్రియం కలిగించేలా మాట్లాడాలి. భగవంతుడి నామాలను, గుణాలను స్మరిస్తూ, కీర్తిస్తూ ఉండాలి. మూడోదైన మానసిక తపస్సు అంటే నిర్మలమైన మనసు కలిగి ఉండటం. పరిశుద్ధ భావాలు కలిగి ఆత్మ నిగ్రహంతో ఉండటం. శంకరాచార్యులవారు చిత్తశుద్ధితో చేసే ప్రతి పనీ పరమేశ్వర ఆరాధన అవుతుందన్నారు. వివేకానందులు జాతి సముద్ధరణే తన జీవితలక్ష్యంగా భావించి దాన్ని ఓ తపస్సులా ఆచరించారు. చిరస్మరణీయులయ్యారు. చేసే ప్రతి పనినీ భగవంతుడి కార్యంగా భావించాలి. ఏ సేవ చేసినా వాంఛారహితంగా చేయాలి. గెలుపు, ఓటములను సమదృష్టితో స్వీకరించి స్థితప్రజ్ఞతో ముందుకు సాగాలి. అదే నిజమైన తపస్సు!

  విశ్వనాథ రమ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని