కేనోపనిషత్తు

ఉపనిషత్తుల్లో కేనోపనిషత్తుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. లోకోద్ధరణ కోసం దైవం స్వయంగా అవతరిస్తాడని చెప్పిన ప్రప్రథమ శాస్త్రమిదే. దైవం నిజస్వరూపాన్ని తెలుసుకోవాలని తపించే వారికోసం ఒక మహర్షి, వారి పేరును ప్రస్తావించకుండానే దీన్ని బోధించారు.

Published : 07 Jan 2023 00:47 IST

ఉపనిషత్తుల్లో కేనోపనిషత్తుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. లోకోద్ధరణ కోసం దైవం స్వయంగా అవతరిస్తాడని చెప్పిన ప్రప్రథమ శాస్త్రమిదే. దైవం నిజస్వరూపాన్ని తెలుసుకోవాలని తపించే వారికోసం ఒక మహర్షి, వారి పేరును ప్రస్తావించకుండానే దీన్ని బోధించారు. వారి సాధనా అనుభవ రహస్యాలను ఈ ఉపనిషత్తు ద్వారా తరవాతి తరాలవారికి అందించారు. మనిషిలో ఉండే అంతరాత్మను వివరించడమే దీనిలోని ప్రధానాంశం. దీన్ని ఒక పాఠంగా కాకుండా, శిష్యుడి ప్రశ్నకు సమాధానంగా వివరిస్తే స్పష్టంగా ఉంటుందని, గురుశిష్యుల సంవాదంలా దీన్ని పొందుపరచారు. ‘కేన’ అనే పదంతో ప్రారంభమైనందువల్ల దీన్ని కేనోపనిషత్తు అన్నారు. ఇందులో చిన్న అధ్యాయాలు నాలుగే ఉంటాయి. పరిమాణంలో చిన్న ఉపనిషత్తే అయినా- ఇది విశేషమైనదని దీన్ని వ్యాఖ్యానించిన పెద్దలు చెబుతారు. దీనిలోని మంత్రాలు వచన రూపంలోను, శ్లోకాలుగాను ఉంటాయి. దీన్ని సొంతంగా అర్థం చేసుకోవడం కష్టం. ఇందులో ఒకే పదానికి అనేకార్థాలుంటాయి. ఏ సందర్భంలో ఏ అర్థాన్ని తీసుకోవాలో గురువే చెప్పాలి లేదా శంకరాచార్యుల వారి భాష్యాన్ని ఆధారం చేసుకోవాలి.

ఎవరి ప్రేరణతో మనసు, ప్రాణం, ఇంద్రియాలు పనిచేస్తున్నాయనే శిష్యుడి ప్రశ్నతో ఇది ప్రారంభమవుతుంది. తెలియని విషయాలను చెప్పేందుకు మనకు బాగా తెలిసిన విషయాలనే ఆధారంగా చేసుకుంటాయి ఉపనిషత్తులు. ఇదే వాటి ప్రత్యేకత. జీవించా లంటే మనిషికి చూపు, మాట, వినికిడి, స్పర్శ, వాసన, శ్వాస, మనసు ఉండాలి. వీటిని అనుభవిస్తున్నా అవి లోపల దివ్యంగా ఎలా పనిచేస్తున్నాయో మనకు తెలియదు. దైవం ఎక్కడో ఉంటే మన ఇంద్రియాలకు శక్తినివ్వడ మన్నది ఆయనకు సాధ్యం కాదు. మనలోనే ఉంటూ మనకు గోచరించకుండానే మనల్ని నడిపించే శక్తే దైవం. అదే అంతర్యామి. మన కంటికి కనిపించకుండానే కంటికి చూసే శక్తినిస్తుంది. చెవులకు వినిపించకుండానే వినికిడి శక్తినిస్తుంది. మనసుకు తెలియకుండానే దానిలో స్పందనలను కలిగిస్తుంది. పరమాత్మ నిజస్వరూపమూ ఇదే. మనం పూజించే విగ్రహాలు పరమాత్మ కాదని, అంతరాత్మ పరమాత్మ అని ఈ ఉపనిషత్తు అంటుంది.

మన వైదిక వాంగ్మయంలో దేన్నయినా ఒక శాస్త్రంగా పరిగణించాలంటే దానిలో విషయం, ప్రయోజనం, సాధించే మార్గం, కావలసిన అర్హతలు అనే నాలుగు లక్షణాలుండాలి. అప్పుడే అది శాసించగలుగుతుంది. శాస్త్రం అంటే శాసించేదని అర్థం. కేనోపనిషత్తు వేదాంత శాస్త్రం. దైవం అంతర్యామిగా మనిషిలోనే ఉన్నాడని చెప్పి, దాన్ని దర్శించే మార్గాన్ని బోధిస్తుంది. నీలో వెలుగుతున్న అంతర్యామిని తెలుసుకునేందుకు నీకన్నా భిన్నంగా ఒక పరమాత్మ ఉన్నాడని మనసులో భావించి, ఆ పరమాత్మకు నామరూపాలు కల్పించి అర్చన చేయాలి. ఈ ఉపనిషత్తు దీనికోసమే ఒక యక్షుడి కథను ఇందులో పొందుపరచింది. పరమాత్మ యక్షుడి రూపంలో అవతరించి, ఇంద్రాది దేవతల గర్వాన్ని అణిచాడని, తరవాత ఉమాదేవి ప్రత్యక్షమై ఇంద్రుడికి గురువై పరమాత్మ(యక్షుడి) వైభవాన్ని బోధించిందని ఈ కథ వెల్లడిస్తుంది. మన వాంగ్మయంలో దైవం అవతారాలు ఎత్తుతాడని చెప్పడం ఈ కథతోనే మొదలయింది. దీని ఆధారంగానే, మన పురాణాల్లో ఎన్నో అవతారాలు చోటుచేసుకున్నాయి.

దైవాన్ని ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కోవిధంగా దర్శించమంటుంది. జ్యోతి రూపంగా భావించమంటుంది శ్వేతాశ్వతరోపనిషత్తు. వెలుగుకు ఆవల ఉన్న సత్‌ పదార్థాన్ని చేరమంటుంది ఈశా ఉపనిషత్తు. కన్ను తెరిస్తే కనపడే వెలుగు, రెప్పపడితే ఉండే చీకటి రెండూ దైవంగానే భావించమంటుంది కేనోపనిషత్తు.

పిల్లలమర్రి చిన వెంకట సత్యనారాయణ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని