విజయ పథం

‘ఒక అపజయం పది విజయాలకు నాంది’ అంటారు. అంటే ఒకసారి అపజయం పొందినవారు ఆపై వరసగా పది విజయాలు సాధించేస్తారని కాదు. ‘ఏదైనా అపజయం కలిగితే అక్కడే ఆగిపోకుండా, పట్టుదలతో మళ్ళీమళ్ళీ ప్రయత్నిస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువ’ అని భావం.

Published : 08 Jan 2023 00:33 IST

‘ఒక అపజయం పది విజయాలకు నాంది’ అంటారు. అంటే ఒకసారి అపజయం పొందినవారు ఆపై వరసగా పది విజయాలు సాధించేస్తారని కాదు. ‘ఏదైనా అపజయం కలిగితే అక్కడే ఆగిపోకుండా, పట్టుదలతో మళ్ళీమళ్ళీ ప్రయత్నిస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువ’ అని భావం.

ఇతర జీవులకు, మనిషికి ఉండే తేడాలు రెండు. మొదటిది ఆలోచన. రెండోది ఊహించుకోవడం. ఈ రెండూ ఉన్న జీవి మానవుడు మాత్రమే. అందువల్ల ఏ పని చేయాలన్నా ఒకసారికి పదిసార్లు ఆలోచించడం, లేని విషయాలను సైతం ఊహించుకోవడం, ఫలితంగా ద్వైదీభావం కలగడం, వాటి వల్ల ఉత్సాహం సన్నగిల్లడం లాంటి స్థితులకు లోనవుతాడు. దానా దీనా... చేద్దామనే ఉత్సాహం కంటే, వద్దులే అనే అలసత్వం వైపే చాలామంది మొగ్గు చూపుతుంటారు. ఇలాంటి వారిని చూసే భర్తృహరి సుభాషితాల అనువాదంలో ఏనుగు లక్ష్మణ కవి ‘లోకంలో నీచులు, మధ్యములు, ఉత్తములు అని మూడురకాల వాళ్లు ఉంటారు. వారిలో మొదటి రకం... ప్రారంభిస్తే అడ్డంకులు వస్తాయేమోననే భయంతో పనిని  ప్రారంభించరు. మధ్యములు ధైర్యం చేసి పనిని ప్రారంభించినా, విఘ్నాలు కలగ గానే భయపడి వదిలేస్తారు. ధీరులు మాత్రమే ఎన్ని ఆటంకాలు, ఒడుదొ డుకులు వచ్చినా చలించకుండా పని పూర్తి చేస్తారు’ అని చెప్పాడు.

లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓర్పు, సహనం ముఖ్యం. ‘ఓటమి అనేది ఒక దశకాని, స్థితి కానీ కాదు. మనోధైర్యం చాలక తలపెట్టిన పని లేదా దీక్షను సక్రమంగా నిర్వర్తించలేక, మధ్యలో కలిగే భయం, విముఖత లాంటి స్థితులకు లోనై తనకు తెలియకుండా తానే విరమించుకోవడమే’ అని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే... ఓటమి అనేది తనంత తానుగా ఏర్పడేది కాదు. ఎవరికి వారు కల్పించుకునేది!

‘జీవితంలో విజయ సాధన ఆధారపడే అంశాలను చెప్పే శ్లోకం ఒకటి ఉంది. అందులో మొదటిది... ‘నా ప్రయత్నం ఫలిస్తుంది’ అనే నమ్మకం. రెండో అంశం శ్రద్ధ. తరవాతది చిత్తశుద్ధితో ప్రయత్నించే పట్టుదల. దానికి తోడు మానసిక సమతుల్యత. గమ్యాన్ని చేరే పయనంలో అవమానాలు, అడ్డంకులు లాంటివి ఎదురైనా, భావోద్వేగాలకు గురికాకుండా మానసిక స్థైర్యంతో విజయసాధన వైపు అడుగులు వేయడం. చివరిది-  బలహీనతలకు లోను కాకుండా ఇంద్రియ నిగ్రహంతో ముందడుగు వేయడం... ఈ నియమాలను త్రికరణ శుద్ధిగా పాటించినప్పుడు విజయద్వారం మన కోసం తెరుచుకుంటుందని ఆ శ్లోక భావం.

నీటి ఒత్తిడి వల్ల విద్యుత్‌ ఉద్భవించినట్లు, ఆపదల్లో ఎవరి బుద్ధి ప్రకాశిస్తుందో అతడే ధీరపురుషుడు. ఆయనే అన్నింటా విజయం సాధిస్తాడని సూక్తి.

‘రథానికి ఉన్నది ఒకటే చక్రం. గుర్రాలు మాత్రం ఏడు. స్థిరత్వం లేని సర్పాలు కళ్లాలు. కాళ్లు లేని సారథి. అయినా ప్రతిరోజూ ఇన్ని వ్యతిరేకతలు, అసమానతలతో సూర్యుడు

ఆకాశంలో విజయవంతంగా ప్రయాణిస్తున్నాడు. గొప్ప వ్యక్తులు తమ ఉపకరణాలపై ఆధారపడరు. వారు ఆత్మతో తమ లక్ష్యాన్ని సాధిస్తారు’ అని ఒక శ్లోక భావం.

ప్రతికూల పరిస్థితులున్నా, మనసు నిర్వికారంగా ఉంటే- అంతిమంగా విజయమే కలుగుతుంది!  

-అయ్యగారి శ్రీనివాసరావు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని