నాదయోగి

భారతీయ సంగీతంలో దక్షిణాది బాణీ విలక్షణమైంది. దానికి ప్రపంచ సంగీత చరిత్రలో అఖండ పరివ్యాప్తి చేకూర్చిన అవతారమూర్తులైన వాగ్గేయకారులు ముగ్గురు. వారు త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్లు. ఈ ముగ్గురినీ సంగీతరత్నత్రయం అని పిలుస్తారు.

Published : 11 Jan 2023 00:24 IST

భారతీయ సంగీతంలో దక్షిణాది బాణీ విలక్షణమైంది. దానికి ప్రపంచ సంగీత చరిత్రలో అఖండ పరివ్యాప్తి చేకూర్చిన అవతారమూర్తులైన వాగ్గేయకారులు ముగ్గురు. వారు త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్లు. ఈ ముగ్గురినీ సంగీతరత్నత్రయం అని పిలుస్తారు.

శాహభూపాలుని ఆస్థాన వాగ్గేయకారుడైన గిరిరాజ కవి మనవడు త్యాగరాజు. వీరి కుటుంబం ఆంధ్రప్రాంతం నుంచి తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువారూరు వెళ్ళి స్థిరపడిందని చరిత్రకారుల కథనం.

త్యాగయ్యకు బాల్యంలోనే రామకృష్ణ ఆనందస్వామి అనే సన్యాసి నారదోపాస్తి మంత్రం ఉపదేశించారట. ఆ మంత్రాన్ని తిరువయ్యూరులోని పంచనదీశ్వరుడి ఆలయం వద్ద పునశ్చరణ చేస్తూండగా నారద మహాముని స్వయంగా యతివేషంలో వచ్చి స్వరార్ణవం, నారదీయం అనే సంగీత గ్రంథాలను త్యాగయ్యకు ఇచ్చి అంతర్ధానమయ్యాడని పౌరాణికులు చెబుతూంటారు. ఆ ఆనందంతో అప్పటికప్పుడు ఆయనపైన భైరవి, కానడ, విజయశ్రీ రాగాలతో కీర్తనలు కూర్చాడట త్యాగయ్య.

చెక్కుచెదరని మనో నిశ్చయంతో ఊంఛ వృత్తితో నిత్యం రామనామ సంకీర్తనా గానంతో జీవితం సాగించాడు. అలా నలభై ఏళ్లు గడిపేసరికి ఆయనకు రామ తారక సిద్ధి కలిగి వైణికుడిగా, గాయకుడిగా, పరమ భక్తా గ్రేసరుడైన వాగ్గేయకారుడిగా ఆయన కీర్తి దేశమంతా వ్యాప్తి చెందింది.  

ఆయన తన జీవితకాలంలో ఇరవైనాలుగు వేల కీర్తనలు రచిం చాడు. ఇప్పుడు దాదాపు కేవలం ఎనిమిది వందల కీర్తనలు మాత్రమే లభ్యం అవుతున్నాయి.

త్యాగయ్య రచించిన పంచరత్న కీర్తనలు గాయకుల్లో ఉత్సాహ, భావోద్రేకాలు వెల్లివిరిసే విధంగా అర్థగాంభీర్యంతో ఉంటాయి. నాట రాగంలోని ‘జగదానందకారక’ అన్న మొదటి పంచరత్న కీర్తన సంస్కృత రచన. రెండోది గౌళ రాగంలోని ‘దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా’ అనేది. మూడో రచన ఆరభి రాగంలో ‘సాధించేనే ఓ మనసా’ అని. నాలుగో రచన వరాళి రాగంలో ‘కనకన రుచిరా కనక వసన నిన్ను’ అనే కీర్తన. అయిదో కీర్తన శ్రీరాగంలోని ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’ అనేది. ఘనరాగ పంచరత్న కీర్తనలతోపాటు త్యాగయ్య నారద పంచరత్నాలు, శ్రీరంగపంచరత్నాలూ రచించాడు.

తిల్లస్థానం నరసింహ భాగవతులు, సంజు భాగవతులు, గోవిందస్వామి పిళ్ళై అనే ముగ్గురు 1907లో ఈయన ఆరాధన ఉత్సవాన్ని పెద్దయెత్తున నిర్వహించడం ప్రారంభించారు. ఆ తరవాత గాయనీమణి అయిన బెంగళూరు నాగరత్నమ్మ తాము సంపాదించిన ధనమంతా వెచ్చించి 1925లో త్యాగరాజ సమాధి మీద ఆలయం కట్టించారు. 1940లో త్యాగబ్రహ్మ ఆరాధన మహోత్సవ సభ ఏర్పాటైంది. దీని కృషి ఫలితంగా భారతదేశంలో జాతీయోత్సవాల్లో ఒకటిగా త్యాగరాజోత్సవాలు ఎంపికైనాయి.

మాట్లాడే భాషలు, రాష్ట్రాలు వేరైనా- ఆంధ్రులు, తమిళులు, కేరళవాసులు, కన్నడిగులు... అందరిదీ ఒకే సంస్కృతి అని, ఒకే సంగీతమని, ఒకే వేదాంతమని సర్వమానవాళి సమానత్వాన్ని చాటిన నాదబ్రహ్మానందుడు త్యాగరాజస్వామి.  

గంటి ఉషాబాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని