సత్యానికి సంకెళ్లా?

‘నిజం చెప్పులు తొడుక్కునేసరికి అబద్ధం లోకమంతా చుట్టివచ్చేస్తుంది’ అన్న నానుడి మనం తరచు వింటూంటాం. నిజం కన్నా ముందే ఎక్కువగా అబద్ధం ప్రచారమైపోతుంది. పైగా అసత్యాన్నే తొందరగా నమ్మేస్తారు. 

Published : 17 Jan 2023 00:21 IST

‘నిజం చెప్పులు తొడుక్కునేసరికి అబద్ధం లోకమంతా చుట్టివచ్చేస్తుంది’ అన్న నానుడి మనం తరచు వింటూంటాం. నిజం కన్నా ముందే ఎక్కువగా అబద్ధం ప్రచారమైపోతుంది. పైగా అసత్యాన్నే తొందరగా నమ్మేస్తారు. 

సత్యాచరణ వల్లనే మనమేమిటో మనకూ తెలుస్తుంది. సమాజానికీ తెలుస్తుంది. సత్యమే పలకాలని, ధర్మమే ఆచరించాలని తైత్తిరీయోపనిషత్తు చెబుతోంది. సత్యం సర్వదా పలికేవాడు అమృతపానం చేసినవాడితో సమానం. ‘సత్య దర్శనం చేసిన వ్యక్తి జీవితం జ్యోతిర్మయం అవుతుంది’ అని యజుర్వేదం పేర్కొంటోంది.

బాలవాక్కు బ్రహ్మవాక్కు, ఋషి వాక్కు వేదవాక్కు నిత్యసత్యాలు. వాటిని కచ్చితంగా నమ్మి తీరవలసిందే! సత్యవాక్కు స్ఫటికంలా స్వచ్ఛంగా ఉంటుంది.

మంచుబిందువులా ప్రకాశిస్తుంది. రక్షక భటుడిగా కాపలా కాస్తుంది. మరణించినా, మనిషికి కీర్తినిస్తుంది. నూరు బావుల కంటె ఒక యజ్ఞం, నూరు యజ్ఞాలకంటే ఒక మంచి పుత్రుడు, నూరుగురు పుత్రులకంటే ఒక్క సత్యవాక్కు గొప్పదని మహాభారతం చెబుతోంది. తపస్సు చేసేవారికి, బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవారికి, సత్యపాలన చేసేవారికే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుందని ప్రశ్నోపనిషత్తు చెబుతోంది. దోష రహితుడైన యోగి, పవిత్రమైన ఏ ఆత్మను దర్శిస్తాడో, అదే సత్యమని ముండకోపనిషత్తు వ్యాఖ్యానిస్తోంది. అఖిల సృష్టికి సత్యమే మూలమని ఛాందోగ్యోపనిషత్తు చాటి చెబుతోంది. అష్టసిద్ధుల్లో మొదటిదైన ‘అణిమ’ యావత్ప్రపంచానికి ఆత్మ అని, అదే సత్యమని శతపథ బ్రాహ్మణం విశదీకరిస్తోంది. భగవదన్వేషణకు ఏకైక మార్గం సత్యమే. ఒక్క అబద్ధమాడితే దాని నుంచి తనను తాను కాపాడుకోవడానికి మనిషి అసత్యాల పరంపరకు బానిసైపోతాడు. అసత్యం తాత్కాలిక విజయం, ఆనందం కలిగిస్తుందేమోకాని- సత్యవాక్యపాలన శాశ్వతమైన బ్రహ్మానందం కలిగిస్తుంది.

శ్రీరాముడు, హరిశ్చంద్రుడు, బలిచక్రవర్తి, శిబిచక్రవర్తి, భీష్మాచార్యుడు, యుధిష్ఠిరుడు వంటివారు సత్యవాక్య పాలనకోసం చిరస్మరణీయ త్యాగాలు చేసి, తరతరాలకు మార్గదర్శకులైనారు. మునులు, ఆదర్శనేతలు ఎందరో సత్యవ్రత దీక్షతో చరిత్రలో సార్థక జన్ములుగా ఖ్యాతి పొందారు. నూరు అబద్ధాలాడి నమ్మించే వ్యర్థ ప్రయత్నం చెయ్యడం కంటే, ‘అబద్ధమాడాను’ అన్న ఒక్క నిజం చెప్పి మన్నించమని కోరేవాడు సంస్కారశీలి. అబద్ధానికి జన్మస్థలం స్వార్థం. దాన్ని తొలగించుకుంటే మనిషి నిజాలకు అలవాటుపడిపోతాడు. సత్యవాక్కు జ్ఞాన వృద్ధి కలిగిస్తుంది. మంచి పనులు చేయిస్తుంది. అఖండమైన యశస్సునిస్తుంది. జీవితాన్ని మధురాతి మధురంగా తీర్చిదిద్దుతుంది. సత్యాన్ని ప్రియంగా పలకాలి. అప్రియమైన మాట పలక్క పోవడమే ధర్మమని అగస్త్యుడు సుబ్రహ్మణ్యస్వామికి ఇచ్చిన సందేశం.

సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కొద్దీ మనిషి అబద్ధాలు ఆడటం బాగా పెరిగిపోయింది. అనవసరమైన, అసందర్భమైన అబద్ధాలు అలవోకగా వచ్చేస్తుంటాయి. ఇవాళ ఏ రంగంలో చూసినా ఇదే పరిస్థితి. ఇది అత్యంత శోచనీయం. ఎందరో మహానుభావులు సత్యమూర్తులై సర్వదా మనకు మార్గ నిర్దేశనం చేస్తుండటం వల్లే జాతి ఈ మాత్రమైనా ప్రగతి సాధిస్తోంది. అనాథలకు ఆసరా కల్పిస్తోంది. స్మితభాషణం, మితభాషణం, మౌనవ్రతం అసత్యవాక్కులను తగ్గిస్తుంది. ‘బ్రహ్మసత్య’మన్న నిత్య సత్య నిర్వచనాన్ని అర్థం చేసుకోగలిగితే లోకాన్ని సత్యలోకంగా ఒకనాటికైనా దర్శించగలం.

చిమ్మపూడి శ్రీరామమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు