జీవితం పట్ల ప్రేమ

మసిబారిన అద్దంలో ప్రతిబింబం అగుపడుతుందా, సలసల మరిగే నీళ్లలో ఛాయాచిత్రం కనిపిస్తుందా? లేదు. అరిషడ్వర్గాలతో అతలాకుతలమైపోయే మనసూ అంతే. అది కంటికి ఎదురుగా ఉన్నదాన్నీ చూడనియ్యదు.

Published : 18 Jan 2023 00:59 IST

సిబారిన అద్దంలో ప్రతిబింబం అగుపడుతుందా, సలసల మరిగే నీళ్లలో ఛాయాచిత్రం కనిపిస్తుందా? లేదు. అరిషడ్వర్గాలతో అతలాకుతలమైపోయే మనసూ అంతే. అది కంటికి ఎదురుగా ఉన్నదాన్నీ చూడనియ్యదు. మనసు ఒకదానితో అల్లుకుపోయి ఉన్నప్పుడు మరొక చర్యవైపు దృష్టి మరలదు. ఈ కారణంవల్లే, మనసు పరధ్యానంలో ఉన్నప్పుడు ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.
అర్థం లేని ఆలోచనలతో బాధలు సృష్టించుకుని సతమతం కావడం మనోవేదనకు  కారణమవుతుంది. దుఃఖపూరితమైన మనసు జీవితాన్ని యథాతథంగా స్వీకరించే ధైర్యసాహసాలు చెయ్యలేదు. అజ్ఞానాంధకారంలో మునకలేస్తూ జీవితం నరకతుల్యమని భావిస్తుంది. ‘ఈ క్షణంలో ఉన్నదే వాస్తవం’ అన్న సత్యాన్ని గ్రహించదు.

రాత్రంతా ధ్యానం లాంటి గాఢమైన నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచిన మనిషికి జీవితం కొత్తగా అనిపిస్తుంది. ప్రభాతవేళ ఏ దిగులూ లేని స్వచ్ఛమైన మనసుకు ఉత్సాహభరితమైన అనుభూతి కలుగుతుంది. బ్రహ్మీ ముహూర్తాన నిద్రలేపే కొక్కొరోకోలు, పిచ్చుకల కిచకిచలు, ఆవుదూడల ప్రేమైక పిలుపులు, కోవెల జేగంటల ప్రతిధ్వనులు, ఆత్మీయుల పలక రింపులు... కొంగ్రొత్త లోకాలకు తీసుకుపోయి మరింత ఆనందం నింపుతాయి. అప్పుడు మనిషిలో ప్రేమ పురివిప్పుకొంటుంది.

మనిషి ఆనందంలో ఉన్నప్పుడు కచ్చితంగా ప్రేమతో ఉంటాడు. ప్రేమతో ఉన్నప్పుడు ఆనందం పొందుతాడు. ఈ రెండూ బొమ్మ బొరుసుల వంటివి. ఒకటి లేకుండా రెండోది లేదు. అది సహజాతి సహజంగా జరిగే ప్రాథమిక రూపాంతర ప్రక్రియ. ఆనందం వల్ల ప్రేమ జనిస్తుంది. అది మనిషిని ఒంటరితనం నుంచి దూరం చేస్తుంది. ఏకాంతానికి లేదా సమూహానికి దగ్గర చేస్తుంది. తదనంతరం విశ్వవ్యాప్తమవుతుంది.

ఒకరికి మంచి ఉద్యోగమో, పదోన్నతో, గొప్ప విజయమో వరించగానే అతడికి పట్టరాని ఆనందం కలుగుతుంది. అప్పటివరకూ ఏకాకిలా ఉన్న అతడిలో ప్రేమ ఉప్పొంగుతుంది. తీపి పదార్థాల రూపంలో అందరి దగ్గరకూ వెళుతుంది. అంతే కాకుండా అనుభవ జ్ఞానాన్ని పంచిపెట్టజూస్తుంది. దీనికి రూపాంతర దృశ్యమే- తెల్లని కిరణం- సప్త వర్ణాలుగా విచ్చుకొని ఆకాశవేదికపైన విరబూయడం.

ఒక మొక్క ఎదిగేందుకు మట్టి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని(సూర్యరశ్మి) సమపాళ్లలో అందాలి. అప్పుడే అది ఫలవంతం అవుతుంది. అదే రీతిన మనిషి ఉన్నతీకరణకు ప్రభావం చూపే అంశాలూ కొన్ని ఉంటాయి. చక్కని కుటుంబ నేపథ్యం, అనుకూల వాతావరణ పరిస్థితులు, సరైన జీవన స్థితిగతులు, సాంస్కృతిక పునాదులు, ఆచార వ్యవహారాలు... ఇవన్నీ మనిషిని వ్యక్తిగతంగా, వ్యవస్థాగతంగా తీర్చిదిద్దుతాయి. జీవన వైశాల్యాన్ని విస్తరింపజేస్తాయి.

జీవన గమనంలో అన్నింటికీ మించి జ్ఞానం, ధ్యానం అత్యంత ప్రధానమైనవి. బడికిపోతే జ్ఞానం వస్తుంది. గుడికి వెళితే ధ్యానం అంటే ఏమిటో తెలుస్తుంది. ఫలితంగా జీవితం పట్ల అపారమైన ప్రేమ కలుగుతుంది.

మునిమడుగుల రాజారావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు