మానవతా పరిమళం

కళ్లు తెరవగానే బంగారు పాత్రల్లో పంచభక్ష్య పరమాన్నాలు కొందరికి, మట్టి మూకుళ్లలో గంజి మరికొందరికి. వద్దని ఆహారాన్ని విసరికొట్టేవాళ్ళు కొందరైతే, మట్టిలో పడిన మెతుకుల్ని ఏరుకుని ఆకలి తీర్చుకొనేవాళ్లు మరికొందరు.

Published : 19 Jan 2023 00:14 IST

ళ్లు తెరవగానే బంగారు పాత్రల్లో పంచభక్ష్య పరమాన్నాలు కొందరికి, మట్టి మూకుళ్లలో గంజి మరికొందరికి. వద్దని ఆహారాన్ని విసరికొట్టేవాళ్ళు కొందరైతే, మట్టిలో పడిన మెతుకుల్ని ఏరుకుని ఆకలి తీర్చుకొనేవాళ్లు మరికొందరు. అప్పుడు మొదలవుతుంది దుర్భరమైన ఈ స్థితి నుంచి బయటపడాలన్న బలమైన కోరిక. పట్టుదల, కసి పెరిగి జీవితంలో ఎదగాలన్న కాంక్ష దృఢతరమవుతుంది. విద్యాగంధం ఒక్కటే దీనికి పరిష్కారమన్న ఆలోచన మనిషిని నిలవనీయదు. తిన్నా తినకపోయినా పగలు రాత్రి కష్టపడి విద్యలో ముందుంటారు. అటువంటి వేళ ఆపన్న హస్తాన్ని అందించి నేనున్నానని సాయపడే దాతలు ఎదురైతే ఆ బతుకులకో ఆలంబన దక్కుతుంది. కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది. పైకెదిగి శిఖరాగ్రాన చేరతారు. ప్రమాదాల బారినపడి ప్రాణాలకు హామీ లభించక నిర్జీవంగా ఉండి పరుల కోసం తమ అవయవాలను దానమిచ్చే చరితార్థులు కొందరుం టారు. ఇలా ఇతరుల బాగుకోసం చేయినందించే సత్పురుషులే భూమిపై నడయాడే దేవతలు.

మనుషులంతా ఒకేలా పుట్టినా వారి మధ్య ఎన్నో అంతరాలు. నిర్లక్ష్యానికి, అవమానాలకి గురవు తున్న సమయంలో దయ, ప్రేమ కురిపించి సాటి మనిషి సంక్షేమం కోసం ఆలోచించేవారే ఉత్తములు. అర్థిస్తే దాతలుగా మారి జాలిని ప్రదర్శించేవారు కొందరుంటారు. పరుల కష్టాలకు చలించి తమంత తాముగా దయావర్షాన్ని కురిపించేవారు ఇంకొందరు. నిస్వార్థమైన వీరి ఆదరణ కొనియాడదగినది. సుఖాల్లో చెంతకు చేరి మిత్రులమని, బంధువులమని ప్రకటించుకునే ప్రబుద్ధులు కొందరు- పరిస్థితులు తారుమారైతే కనుమరుగవుతారు. కోటి యజ్ఞఫలమైన అనాధ ప్రేత సంస్కారాలకు నడుంకట్టే మానవతామూర్తులు ఆదరణీయ ఆత్మబంధువులు.

త్రేతాయుగంలో జనకుడికి జ్ఞానబోధ చేసిన పరమహంస పరివ్రాజకుడైన అష్టావక్రుడు యుగాంతం వరకు జీవించి ద్వాపరంలో కృష్ణుణ్ని దర్శించాడు. ఆ మహనీయుడి పాదాలను బంగారు పళ్ళెంలో ఉంచి అభిషేకించాడు వాసుదేవుడు. ప్రాణం వదిలిన అష్టావక్రుడి అంత్యక్రియలను జీవపితరుడైన (తల్లిదండ్రులు జీవించివున్న) కృష్ణుడే స్వయంగా నిర్వహించాడు. సీతాపహరణ సమయంలో రావణుడికి ఎదురొడ్డి వీరోచితంగా పోరాడాడు జటాయువు. యుద్ధంలో అంగాలు తెగిపడి మరణించిన అతడికి మానవత్వంతో ఉత్తరక్రియలు చేశాడు రాముడు.

మహాదాతలు బలి, శిబి చక్రవర్తుల గాథలు విన్నప్పుడు వారి త్యాగాలకు అబ్బురపడతాం. దుర్భిక్ష కాలంలో ఆకలి దప్పులతో అలమటించేవారికి, వైకల్యం కలవారికి, రోగులకు ప్రత్యుపకారాన్ని ఆశించక నిస్వార్ధంతో చేసే దానమే సాత్విక దానం. దాన్ని నిర్వహించే పురుషుడే సాధుపురుషుడు అని గీతలో పరమాత్మ చెప్పిన బోధలు ఆచరణీయం కావాలి. కరుణ కలిగిన హృదయమే భగవన్నిలయం. ప్రేమతో దేవుణ్ని దర్శించాలంటే మానవత్వాన్ని చూపాల్సిందే. సర్వజనులు సమానమన్న భావం బలపడాలి. బాల్యంలోనే ఈ అంకురాల్ని పాదుగొల్పితే ప్రేమవృక్షాలు మహోన్నతంగా పెరుగుతాయి. శాఖోపశాఖలుగా విస్తరించి అద్భుత ఫలాలనందిస్తాయి. సుమనోహర సుగంధ పరిమళాలను నలుదిశలా వెదజల్లుతాయి.

మాడుగుల రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని