వసంత పంచమి

జ్ఞానశక్తి, ధీయుక్తిని పెంపొందించే మాతృశక్తిరూపిణి- సరస్వతి. అన్ని సంపదలకు విద్యే ప్రాతిపదిక. ఆ విద్యలన్నింటికీ శ్రీవాణి అధిష్ఠాత్రి. సర్వత్రా వ్యాపించిన శక్తి తత్త్వానికి సరస్వతి అని పేరు. సృష్టిలో వ్యక్తమయ్యే జీవకళకు ప్రతిరూపమే శారద అని మహాకవి కాళిదాసు అభివర్ణించాడు.

Published : 26 Jan 2023 00:43 IST

జ్ఞానశక్తి, ధీయుక్తిని పెంపొందించే మాతృశక్తిరూపిణి- సరస్వతి. అన్ని సంపదలకు విద్యే ప్రాతిపదిక. ఆ విద్యలన్నింటికీ శ్రీవాణి అధిష్ఠాత్రి. సర్వత్రా వ్యాపించిన శక్తి తత్త్వానికి సరస్వతి అని పేరు. సృష్టిలో వ్యక్తమయ్యే జీవకళకు ప్రతిరూపమే శారద అని మహాకవి కాళిదాసు అభివర్ణించాడు.

మాఘమాసాన్ని జ్ఞాననిధిగా ‘కాలచంద్రిక’ పేర్కొంది. అందుకు కారణం మాఘశుద్ధ పంచమినాడు సరస్వతీదేవి అభివ్యక్తమై లోకాలకు జ్ఞానసిరుల్ని అనుగ్రహించడమేనని ‘శారదా తిలకం’ వివరించింది. ప్రకృతిలో ఉత్పాదక శక్తి వసంత పంచమితో ప్రారంభమవుతుందంటారు. సృష్టి, నిర్మాణం, నిర్వహణాపరమైన శక్తులన్నింటిలో సర్వోన్నతమైన మూలకారక శక్తి మహాసరస్వతిగా ఆవిష్కారమైందని జగద్గురువు ఆదిశంకరులు ప్రస్తావించారు.

శుద్ధ సత్వ స్వరూపిణిగా తేజరిల్లే శారదాంబ- జగన్మాత నుంచి తేజరిల్లిన బ్రాహ్మీశక్తి. దేవదానవ సంగ్రామంలో రాక్షసులు, దేవతలపై మూకాస్త్రాన్ని, స్మృతి నాశక అస్త్రాన్ని ప్రయోగించారు. వాటిని నిలువరించడానికి మహాసరస్వతి మహాధారణాస్త్రాన్ని, సారస్వతాస్త్రాన్ని ప్రయోగించి వారిని రూపుమాపింది. ఆమె జ్ఞానాధిష్ఠాన దైవతంగా వెలుగొందిన రోజే- వసంత పంచమి. ఆధ్యాత్మిక ఉషస్సులో సరస్వతి రూపం క్రాంతిర్మయంగా శోభిల్లుతుంది. అవిద్య ఉన్న చోట ఆమె దృక్కులు ప్రసరిస్తే, అది విద్యావాటిక. చీకటి ఆవరించినప్పుడు ఆమె దివ్య తేజస్సు ప్రకటితమైతే, అది వెలుగు వాహిక. నిస్తేజం నిండినచోట ఆమె అనుగ్రహం పల్లవిస్తే, అది చైతన్య దీపిక. అజ్ఞానయుతమైన హృదయానికి ఆమె కరుణ చేకూరితే, అది జ్ఞానపీఠిక.

బ్రహ్మ వైవర్త పురాణంలోని ప్రకృతి ఖండం సరస్వతీ వైభవాన్ని వర్ణించింది. ఫల, పుష్ప, హరిత శోభితమైన వర్ణార్ణవ ప్రకృతి సౌందర్యమే సరస్వతీ రూపంగా పేర్కొన్నారు. త్రిమూర్తులు తమ ఆధీనంలో ఉన్న జ్ఞాన సంబంధితమైన కళలు, శక్తులు, అంశల్ని ‘వసంత పంచమి’నాడు సరస్వతికి ఆపాదింపజేశారంటారు. ఈ పర్వదినాన సరస్వతీ మాతను ఎలా ఆరాధించాలో, అందుకు ఎలాంటి విధివిధానాలు అవలంబించాలో నారదుడికి విష్ణువు తెలియజేశాడని దేవీ భాగవతం వివరించింది. సరస్వతీదేవి మూల మంత్రాన్ని శ్రీమన్నారాయణుడు భృగుమహర్షికి వసంత పంచమినాడే ఉపదేశించాడంటారు. సృష్టి రచనా నైపుణ్య శక్తిని బ్రాహ్మణి రూపంలోని శ్రీవాణి నుంచి బ్రహ్మ వరంగా వసంత పంచమినాడే అందుకున్నాడని ప్రతీతి.

సరస్వతీదేవి స్వరూపమే మూర్తీభవించిన జ్ఞానాకృతి అని పద్మపురాణం వెల్లడించింది. ఆమె హృదయస్థానం చతుర్వేదాలకు, మస్తిష్కం ధర్మశాస్త్రాలకు, నేత్రాలు ఆధ్యాత్మిక, లౌకిక విద్యలకు, కుక్షిస్థానం సంగీతకళకు, లలాటం కావ్యాలకు ప్రతిఫలనంగా సమన్వయం చేశారు. వసంత పంచమినే శ్రీ పంచమి అంటారు. శ్రీ అంటే సంపద. అసలైన సిరి జ్ఞానమే కాబట్టి ఇది జ్ఞాన పంచమి అయ్యింది. విద్యాసారాన్ని అందించే శారదగా, వాక్‌ శక్తికి అధినాయకురాలైన వాగీశ్వరిగా, పరావిద్యను అందించే శ్రీవిద్యగా, విజ్ఞాన పెన్నిధి అయిన శ్రీనిధిగా, బ్రహ్మ మానస సంచారిణి బ్రాహ్మణిగా, శబ్దశక్తిని, నాదానురక్తిని ప్రస్ఫుటం చేసే దివ్య సునాద కళా వినోదినిగా సరస్వతీదేవి తన విరాట్‌ మూర్తి మత్వాన్ని ప్రదర్శిస్తోంది. జ్ఞానలబ్ధి, విద్యాసిద్ధి, సర్వతో ముఖాభివృద్ధి అనే త్రివిధ వరాల సిరుల్ని భారతీదేవి అనుగ్రహిస్తోంది.

డాక్టర్‌ కావూరి రాజేశ్‌ పటేల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని