మన సంస్కృతి

ఆధునిక యంత్రాలు, బహుళ అంతస్తుల భవనాలు నాగరికతకు చిహ్నాలు. పారంపర్యంగా వస్తున్న సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, ఆరాధన విధానాలు, జీవన పద్ధతులు, కుటుంబ సంబంధాలు... ఇవి సంస్కృతికి సంబంధించిన విశేషాలు.

Published : 28 Jan 2023 00:21 IST

ధునిక యంత్రాలు, బహుళ అంతస్తుల భవనాలు నాగరికతకు చిహ్నాలు. పారంపర్యంగా వస్తున్న సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, విశ్వాసాలు, ఆరాధన విధానాలు, జీవన పద్ధతులు, కుటుంబ సంబంధాలు... ఇవి సంస్కృతికి సంబంధించిన విశేషాలు. ఒక దేశం ప్రత్యేకత ఆ నాగరికతపై గాక, సంస్కృతిపై ఆధారపడి ఉంటుంది. మానవతా విలువలు సంస్కృతిలో నిక్షిప్తమై ఉంటాయి.

భారతీయ వివాహ వ్యవస్థ వంటిది ప్రపంచంలో మరొకటి లేదు. మన వివాహ సంప్రదాయం ఒక ఒడంబడిక (కాంట్రాక్ట్‌) కాదు. ఇది ఆత్మోన్నతికి ఏర్పడిన ఉత్తమ సంస్కారం. అది వేదకాలం నాటిది! భారతీయులు ధర్మ, అర్థ, కామాల స్థితిని అధిగమించిన మోక్షాన్ని కోరు కుంటారు. పాశ్చాత్య సంస్కృతి భౌతికతతో పెనవేసుకొని ఉన్నది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా మన సంస్కృతి భారతీయ జీవిత విధానాన్ని గుబాళింపజేస్తూనే ఉన్నది. ఈ సంస్కృతిలో పుట్టిన శంకరాచార్యులు, తుకారాం, మీరా బాయి, రామానుజుడు, చైత న్యుడు... ఇప్పటికీ జన సామా న్యంతో కలిసిమెలిసే ఉన్నారు. గౌతమ బుద్ధుడు ప్రపంచానికి వెలుగు ప్రసాదించాడు. అశోకుడు, చాణక్యుడు, చంద్రగుప్తుడు, శివాజీ... రాజ్య పాలనలో మానవతా పరిమళాలను వెదజల్లారు. భారతీయ సంస్కృతి మానవ జీవితంతో సంబంధం లేని తాత్విక విధానం కాదు. అది జీవశక్తితో నిండిన గంగాప్రవాహం.

మన కళలు ఆత్మకు, అనంతానికి, దైవానికి సంబంధించినవి. భారతీయ శిల్పం దైవ శక్తులను వెల్లడిస్తుంది. నటరాజ విగ్రహం దైవ చైతన్యాన్ని ప్రదర్శిస్తుంది.

పాశ్చాత్యులు భారతీయ కళ వాస్తవికం కాదు అంటారు. మన సంస్కృతిలో కళలన్నీ దైవం, మానవుడు, ప్రకృతి... ఈ మూడింటిని మేళవించుకొనే ఉంటాయి. సరళమైన వ్యవస్థతో ఉన్న జీవనం వల్లే మానవజాతికి అభ్యుదయం చేకూరుతుందని చరిత్ర చెబుతుంది. పల్లవ, చాళుక్య, పాండ్య, కాకతీయ, విజయనగర రాజ్యాలు మానవజాతికి మహనీయ సాంస్కృతిక వైభవాన్ని అందించాయి. భారతదేశంలో సాంస్కృతిక పునర్జీవనం 150 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. బంకించంద్ర చటర్జీ, రవీంద్రనాధ్‌ ఠాగూర్‌ మొదలైన మహాత్ములు మన ఆధ్యాత్మికతకు స్వేచ్ఛామార్గాలు చూపారు. కొత్త కాంతులు ప్రసరింప జేశారు.

అంతర్గత శక్తిపై నిలబడి అజేయ ప్రేమశక్తితో అనుకున్న దాన్ని పట్టుపట్టి సాధించింది సావిత్రి. స్త్రీ శక్తిని ప్రదర్శించి చూపింది సతీసావిత్రి. ఆధ్యాత్మిక మార్గం, యోగం, సాధన... వీటి సమాహారమే భారతీయ సంస్కృతిలోని విశిష్టత. అది అజేయమని సావిత్రి నిరూపించింది. మన సంస్కృతి ఉన్నత స్థాయిలో ఉండి నిన్ను స్థాయివైపు చూస్తుందే కాని, నిమ్న స్థాయిలో పడి ఉన్నత స్థాయికోసం దేబిరించదు. శ్రీరామ, శ్రీకృష్ణులు అత్యున్నత స్థితిలో ఉండి కూడా, అతి సామాన్యుల సాహచర్యంలోనే జీవితం గడిపారు. ఆత్మ ప్రకాశం మీదే ఆధారపడ్డారు మన రుషులు. వారే ప్రపంచ మానవాళికి మార్గదర్శకులు కాగలిగారు.

యుగయుగాల నాటి భారతదేశ సంస్కృతి నేటికీ పరిఢవిల్లుతూనే ఉంది, భారతమాత జాతిని నడిపిస్తూనే ఉంది. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా ఆమె ప్రాచీన సాంస్కృతిక శక్తితో తలను ఉన్నతంగా ఎత్తి చూడగలుగుతూనే ఉంది.

డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు