వృద్ధాప్యం మరో బాల్యం

అమావాస్య, పున్నముల కాలచక్ర భ్రమణంలో మనిషి వయసు రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. విద్యాబుద్ధులు నేర్వడంలో బాల్యం గడిచిపోతుంది.

Published : 01 Feb 2023 00:21 IST

మావాస్య, పున్నముల కాలచక్ర భ్రమణంలో మనిషి వయసు రోజురోజుకూ పెరుగుతూనే ఉంటుంది. విద్యాబుద్ధులు నేర్వడంలో బాల్యం గడిచిపోతుంది. ఆవేశ రోషాలు, కామక్రోధాలు యౌవనాన్ని శాసిస్తాయి. కుటుంబ బాధ్యతలు పెనవేసుకుని క్షణం తీరిక లేకుండా మధ్య వయసు కాలగమనంలో కలుస్తుంది. బాధ్యతలు నెరవేర్చి కాస్త తీరిక దొరికేసరికి ముదిమి వచ్చి మీద పడుతుంది. ఈ చివరి దశలో అవయవాల్లో పటుత్వం సడలుతుంది. చూపులో స్పష్టత లోపిస్తుంది. మాటలో గాంభీర్యత కరుగుతుంది. వినికిడి శక్తి మందగిస్తుంది. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. అనారోగ్యం దినచర్యకు అవరోధమవుతుంది. ఇకపై ఏ క్షణమైనా చివరి  క్షణమేనంటూ మనసు హెచ్చరిస్తూంటుంది. గతంలో చేసిన తప్పులు గుర్తుకు వచ్చి మది బరువెక్కుతుంది. వ్యక్తం చేయలేని బాధతో హృదయభారం కోపంగా మారి స్వజనులపై ప్రభావం చూపుతుంది. తమ సంతానం తమను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావనతో వృద్ధులు వ్యధ చెందుతారు. తరాల అంతరాలు పిల్లలు, పెద్దల మధ్య అడ్డుగోడలవుతాయి.

వృద్ధాప్యాన్ని శాపంగా భావించేవారు దుఃఖంతో బాధపడుతూ రోజులు వెళ్ళబుచ్చుతారు. కాలానుగుణ మార్పులను గమనిస్తూ ఈ దశను సమయస్ఫూర్తితో ఎదుర్కొనగలవారు కుటుంబసభ్యుల మన్ననలు పొంద గలుగుతారు. శేష జీవితంపై విరక్తితో కాక, ఆత్మీయులపై ఆప్యాయతానురాగాలు పంచుతూ మనగలిగితే వృద్ధాప్యం వరంగా మారుతుంది. పిల్లలు దారి తప్పు తున్నప్పుడు మార్గదర్శనం చేయడం అవసరమే కానీ వారి దైనందిన కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటూ వారిపై పెత్తనం చలాయించాలనుకోవడం అభిలషణీయం కాదు. పుత్రుడిని అయిదేళ్ల వరకు ప్రేమతో పెంచాలి. పదిహేను సంవత్సరాల వరకు శిక్షణలో ఉంచాలి. పదహారేళ్లు వచ్చాక స్నేహితుడిలా భావించి హితవు చెబుతుండాలన్న చాణక్య నీతిని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి.

అంతవరకు సంపాదనకు, కుటుంబ అవసరాలు తీర్చడానికి కాలాన్ని వెచ్చించినవారు వార్ధక్యంలో భగవంతుడితో అనుబంధం పెంచుకోగలిగితే ఇహపర సుఖాలకు లోటుండదు. అమూల్యమైన పుస్తకాలు అధ్యయనం చేస్తూ ఋషి రుణం తీర్చుకునే చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

నిశితంగా గమనిస్తే- వృద్ధాప్యం మరో బాల్యం. బాలుడు తాను అడిగింది ఇవ్వకపోతే అమ్మమీద అలుగుతాడు. చేతిలో ఉన్న వస్తువును విసిరేస్తాడు. తిండి తిననని మారాం చేస్తాడు. మూతి ముడుచుకుని మూలన కూర్చుంటాడు. లేకపోతే ఏడుస్తాడు. చివరికి అనుకున్నది సాధిస్తాడు. వృద్ధులూ అంతే. కొడుకో కోడలో తమ మాట వినక ఎదిరిస్తే, తట్టుకోలేరు. అలుగుతారు. సణుగుతారు. కోపగిస్తారు. నిరాహార దీక్షకు పూనుకొంటారు. పిల్లలు దిగివచ్చేదాకా కొంతమంది పెద్దలు తమ పంతం వీడరు. వృద్ధాప్యంలో బాల్య చేష్టలు పునరావృతమవుతాయి. తప్పటడుగులు, బోసినవ్వులు, మాటల్లో తడబాటు, పడకలో ఉలికిపాటు, అతినిద్ర... వృద్ధుల సర్వసాధారణ లక్షణాలు.

తల్లి పిల్లలను లాలించినట్లు కొడుకులు వృద్ధులైన తల్లిదండ్రులను బుజ్జగించాలి. వారి చిన్నచిన్న కోరికలు తీర్చడానికి సమయం కేటాయించాలి. రోజులో కొద్దిసేపు వారితో ముచ్చటించాలి. పెద్దలు చెప్పే అనుభవాల సారాన్ని గ్రహించాలి.

 ఇంద్రగంటి నరసింహమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని