సంగీత సౌరభం

సుమధుర సంగీతాన్ని ఆలపించడమే కాదు, ఆలకించడమూ ఒక కళే. శాస్త్రీయ సంగీతం భారతీయుల దృష్టిలో ‘గంధర్వ విద్య’. పాశ్చాత్యుల దృష్టిలో ‘ప్రపంచ భాష’. ‘సంగీత గంధర్వ విద్యలో రామచంద్రుడు అద్వితీయుడు’ అన్నారు రామాయణంలో వాల్మీకి మహర్షి.

Published : 02 Feb 2023 00:27 IST

సుమధుర సంగీతాన్ని ఆలపించడమే కాదు, ఆలకించడమూ ఒక కళే. శాస్త్రీయ సంగీతం భారతీయుల దృష్టిలో ‘గంధర్వ విద్య’. పాశ్చాత్యుల దృష్టిలో ‘ప్రపంచ భాష’. ‘సంగీత గంధర్వ విద్యలో రామచంద్రుడు అద్వితీయుడు’ అన్నారు రామాయణంలో వాల్మీకి మహర్షి. ‘సంగీతమంటే సాక్షాత్తు శివుడి దేహమే... నాదతనుమ్‌ అనిశం శంకరమ్‌’ అన్నారు త్యాగరాజస్వామి.

మనిషి బాగా అలసిపోయినప్పుడు ప్రశాంతంగా కూర్చొని చక్కని సంగీతం వింటుంటే- శరీరం సేదతీరి, మనసులో అవ్యక్త మాధుర్యం ఆవరించడం మనలో చాలా మందికి అనుభవమే. సంగీతాన్ని ఒక పద్ధతి ప్రకారం ఆస్వాదించడం అలవడితే, చిరకాలంగా పీడిస్తున్న జబ్బులు, మానసిక రుగ్మతలు నెమ్మదిస్తున్నాయని శాస్త్రీయంగా రుజువైంది.

‘ది సీక్రెట్‌ డాక్ట్రిన్‌’ గ్రంథం ఆధ్యాత్మిక జగత్తుకు అపురూప అలంకారం. సప్తస్వరాలైన షడ్జమం రిషభం గాంధారం మధ్యమం పంచమం దైవతం నిషాదం (సరిగమ పదనిసలకు వరసగా- ఐరన్‌, గోల్డు, మెర్కురీ, లెడ్‌, టిన్‌, కాపర్‌ సిల్వర్‌ లోహాలతోను, మళ్ళీ అదే వరసలో కుజుడు, సూర్యుడు, బుధుడు, శని, గురుడు, శుక్రుడు, చంద్ర గ్రహాలతోను గల సంబంధాన్ని పుస్తక రచయిత్రి వివరించారు. ఈ సిద్ధాంతం ఆధారంగా గ్రహగతుల గమనాల రీత్యా మానవ దేహంలో ఏర్పడే అనారోగ్యాలకు, లోహాల లోటుపాట్ల రీత్యా ఏర్పడే రుగ్మతలకు- సంగీత స్వరాలతో చికిత్స (మ్యూజిక్‌ థెరపీ) ద్వారా నివారణ సాధ్యమవుతుందని ప్రయోగాల్లో తేలింది. అటు ఆనందానికి ఇటు ఆరోగ్యానికి కూడా సంగీతం ఎంతో దోహదం చేస్తోందన్నది ఆ ప్రయోగాల సారాంశం. చక్కటి సంగీతాన్ని వినిపిస్తుంటే గోవులు ఎక్కువ పాలిస్తున్నాయని, మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయని కూడా ప్రయోగాల్లో తేలింది.

మనం వినే రాగాల్లో కొన్ని శుభోదయ వేళల్లో ప్రభాత ఆలాపనలు... కొన్ని సాయం సంధ్యల్లో ఉల్లాస జలపాతాలు.. అలసిసొలసి నిదురించే వేళల్లో మరికొన్ని రాగాలు గోముగా లాలించే శ్రవణ మాధుర్యాలు. ‘శిశుర్వేత్తి పశుర్వేత్తి...’ అనేది అందుకే. తీపి అనుభూతుల మధ్య సంగీతం కువకువల కూనిరాగం అవుతుంది. గుండెకాయలకు సుకుమార లేపనం అవుతుంది. వియోగ వేళల్లో, విషాద సమయాల్లో ఓదార్పు నాదమవుతుంది. ఎన్నో సందర్భాల్లో గుండెచప్పుళ్లకు అందమైన అనువాదం అవుతుంది. సంగీతాన్ని బాగా ఆస్వాదించేవారికే తెలుస్తుంది. ఈ విభజన ఏ వేళలో ఏ రాగం వినాలన్నది సంగీత జ్ఞానానికి సంబంధించిన విషయం.

అందుకే సంగీతం మన నిత్యజీవితంలో భాగం కావాలి. అవసరమైనప్పుడల్లా అది ఆనంద తీరాలనుంచి వచ్చే నౌకలానో, ఔషధి పర్వతాల నుంచి వీచే మారుతంలానో మనల్ని అలరించాలంటే- చెవులతో కాకుండా హృదయంతో వినడం మనకు అలవడాలి. శ్రవణం కూడా ఒక కళ అన్నది అందుకే. సంగీతం భౌతిక మానసిక ఆధ్యాత్మిక కక్ష్యలకు అమృత లేపనం!

ఎర్రాప్రగడ రామకృష్ణ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని