వినయ విధేయతలు

అహంకార, ఆడంబర రహితమైన మనో నిశ్చలతే నిజమైన వినయం అంటారు పండితులు. అహంకారం వల్ల అపజయాలు ఎదురవుతాయి.

Published : 03 Feb 2023 01:20 IST

హంకార, ఆడంబర రహితమైన మనో నిశ్చలతే నిజమైన వినయం అంటారు పండితులు. అహంకారం వల్ల అపజయాలు ఎదురవుతాయి. వినయ విధేయతలే విజయాలను నిర్దేశిస్తాయి. వినయంతో కూడిన ప్రవర్తన మనిషికి ప్రసన్న చిత్తాన్ని ప్రసాదిస్తుంది. మనసు నిర్మలమైనప్పుడు ఎలాంటి ఆందోళనలు, ఒత్తిడులు ఉండవు. ఆలోచనలు ఉన్నతమైన మార్గంలో ప్రయాణిస్తాయి. అందుకే మనశ్శాంతి కలగాలంటే వినయం అత్యవసరం.

పండితులకు వినయమే భూషణం. వినయ గుణానికి ప్రతీక శ్రీశైలపూర్ణులు. వారు శ్రీమద్రామానుజాచార్యుల మేనమామ. శ్రీరామానుజాచార్యులు శ్రీరంగ క్షేత్రంలో వైష్ణవ పీఠాధిపతియై విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేస్తూ ఒకసారితిరుపతి బయలుదేరారు. అప్పటికే శ్రీశైలపూర్ణులు చాలా పెద్దవారు. ఆయన తిరుపతిలో నివసించేవారు. శ్రీరామానుజులు తిరుపతికి వస్తున్నారని తెలిసి శ్రీశైలపూర్ణులు ఒక తట్టలో శ్రీనివాసుడికి కైంకర్యం చేసిన ప్రసాదం పెట్టుకుని, చేతికర్ర సహాయంతో శ్రీరామానుజులుకు అందించారు. మేనమామ పడిన ప్రయాసకు శ్రీరామానుజులు ఎంతగానో నొచ్చుకుని ‘అయ్యా! ఈ ప్రసాదం తేవడానికి చిన్నవారెవరూ లేరా! ఈ వయసులో మీకింత ప్రయాస ఎందుకు?’ అన్నారు. అప్పుడు శ్రీశైలపూర్ణులు ‘నాయనా! ఇక్కడ ఉన్నవారందరిలో నేనే చిన్నవాడిని’ అన్నారు. ఎంతటి వినయగుణ సంపన్నులో శ్రీశైలపూర్ణులు! విద్వాంసులకు వినయగుణమే శోభనిస్తుంది. వినయం వల్లే వారి విద్వత్తు దిగంతాలకు వ్యాపిస్తుంది. వినయగుణం లేనివారు విశాల హృదయులు కాలేరు. సంకుచిత మనస్కులు జీవిత సాఫల్యాన్ని పొందలేరు.

రామాయణంలో హనుమంతుడు సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు. జ్ఞాన గుణసాగరుడు. అనంత బలశాలి. అయినా తాను రామబంటునని ప్రకటించుకున్నాడు. రాముడికి దాసుడిని అని చాటాడు. వెయ్యిమంది రావణులు ఒక్కసారిగా వచ్చినా వారిని మట్టి కరిపిస్తానంటాడు. రామభక్తి వల్ల కలిగే మనోబలం, దృఢవిశ్వాసం హనుమలో ఉన్నాయి. ఆ వినయ విధేయతలే అతణ్ని కీర్తిమంతుణ్ని చేశాయి.

మహాభారతంలో అంపశయ్యపై ఉన్న భీష్ముడితో ధర్మరాజు ‘తాతా! శత్రువు బలవంతుడైతే బలహీనుడు ఏ ఉపాయంతో ఆ విపత్తు నుంచి తప్పించుకుంటాడు?’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు భీష్ముడు సముద్రసరిత్సంవాదం గురించి చెప్పాడు. ఒకసారి సముద్రుడు నదులతో సమావేశమై ‘మీరు వరదల్లో వేగంగా ప్రవహించేటప్పుడు పెద్దచెట్లను పడగొట్టేస్తారు. కాని అల్పమైన తుంగమొక్కలు చెక్కుచెదరవు. వాటిని ఎందుకు కదిలించలేకపోతున్నారు?’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడు గంగానది సముద్రుడితో, ‘మేము వేగంగా ప్రవహించేటప్పుడు పెద్దచెట్లు మాకు అడ్డంగా నిలుస్తాయి. అందుకే వాటిని పడగొట్టేస్తాం. ప్రబ్బలి, తుంగ వంటి మొక్కలు వినయంగా తలవంచుతాయి. మేం వాటి మీదుగా ప్రవహించి నీ దగ్గరకు చేరుకుంటాం. తరవాత అవి తలలు ఎత్తి మునుపటిలా బతుకుతాయి’ అని వివరించింది. ధర్మరాజా! శత్రువులోని బలాన్ని, అహంకారాన్ని గ్రహించి మూర్ఖత్వంతో  ఎదురుపడకుండా ప్రవర్తించాలి. అప్పుడు బలహీనుడు చెడకుండా నిలబడతాడు’ అని ఉపదేశిస్తాడు భీష్ముడు. వినయశీలి గెలుపోటములను సమదృష్టితో స్వీకరిస్తాడు. ప్రశాంతంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. వినయం వల్ల నలుగురితో కలిసి పని చేయగలిగే, చేయించగలిగే నాయకత్వ లక్షణం అలవడుతుంది. అందుకే విజయవంతమైన నాయకులందరూ ఎంతో వినమ్రంగా, ధీరోదాత్తంగా వ్యవహరిస్తుంటారు.

విశ్వనాథ రమ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని