జీవన యజ్ఞం
ఒక గొప్ప గాయకుడు రాగయుక్తంగా పాడిన పాట లాంటిది జీవితం. హిమాలయ సానువుల్లో ప్రవహిస్తున్న హిమానీనదం లాంటిది జీవితం. వేలకొలది చిలుకలు వాలిన వందేళ్లు దాటిన మర్రిమాను లాంటిది జీవితం. అనంతమైనది, అర్థంకానిది, ఆకాశం లాంటిది జీవితం.
ఒక గొప్ప గాయకుడు రాగయుక్తంగా పాడిన పాట లాంటిది జీవితం. హిమాలయ సానువుల్లో ప్రవహిస్తున్న హిమానీనదం లాంటిది జీవితం. వేలకొలది చిలుకలు వాలిన వందేళ్లు దాటిన మర్రిమాను లాంటిది జీవితం. అనంతమైనది, అర్థంకానిది, ఆకాశం లాంటిది జీవితం. గూఢచారి ఛేదిస్తున్న రహస్యం లాంటిది జీవితం. గుడ్డివాడు అర్ధరాత్రి చీకటిలో నల్లపిల్లిని వెతుకుతున్న చందం జీవితం. సౌందర్యోపాసకులు ఒకలాగా, తాత్వికులు మరొకలాగా జీవితం గురించి చెబుతారు. జీవితాన్ని వ్యాఖ్యానించడానికే మనం పుట్టాం అంటారు జిడ్డు కృష్ణమూర్తి.
ఎవరెలా చెప్పినా వాస్తవానికి జీవితం ప్రయాణం. ఇంజిన్ కనిపించదు. పెట్టెలు కనిపించవు. పట్టాలు కనపడవు. పరుగెడుతూ ఉండాలి. చేతకాకపోతే నడవాలి. అదీ వీలుకాకపోతే పాకాలి. కాని, ఎక్కడా ఆగకూడదు. కదలడం మన నైజం. కదలకపోతే మూలపడేసిన ఇనుములాగా తుప్పుపట్టిపోతాం. జీవితాలు తుప్పుపట్టిపోకూడదు. జీవితం చాలా విలువైనది. ఇచ్చిన వాడికి తెలుసు. పుచ్చుకొన్నవారికి ఇంకా తెలియాల్సి ఉంది. దాని కోసమే మన తాపత్రాయాలు, తహతహలు.
రెండు కాళ్లూ లేక రోడ్డు పక్కన హృదయ విదారకంగా పడిఉన్న నిస్సహాయుడైన బిచ్చగాడిని అడిగితే- జీవితం విలువ చెబుతాడు. రోడ్డు దాటడానికి సహాయం తీసుకునే అంధుడిని అడిగితే జీవితం విలువ చెబుతాడు. గుండె చెడిపోయిన రోగిని అడిగితే జీవితం విలువ చెబుతాడు. అన్నీ ఉన్నవాడికి, ఆకు నిండా భోజనం ఉన్నవాడికి జీవితం గురించి తెలియదు. ఆకలితో అన్నం కోసం ఎదురుచూసేవాడికి తెలుస్తుంది- జీవితం గురించి, దాని విలువ గురించి.
సంపాదించిన జ్ఞానం జీవితాన్ని మనకు సరిగ్గా చూపించాలి. మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక బోధలు జీవితాన్ని శిఖరాగ్రం మీద నిలబెట్టాలి. మనం మనంగా ఉండాలి. అందరి కోసం బతకాలి అనే అనుభూతిని కలిగించాలి. శ్రీరాముడు అరణ్యాలకు బయల్దేరుతున్నప్పుడు అయోధ్య ప్రజలకు జీవితం విలువ తెలిసింది. సీతమ్మను వెదకడానికి బయల్దేరుతున్నప్పుడు హనుమంతుడికి బతుకు విలువ తెలిసింది. జూదంలో ఓడిపోయి రాజ్యాన్ని అప్పగిస్తున్నప్పుడు ధర్మరాజుకు జీవితం విలువ తెలిసింది. యుద్ధం ఎందుకు చెయ్యాలో శ్రీకృష్ణుడు సవివరంగా చెప్పి, విశ్వరూప సందర్శనం ఇచ్చినప్పుడు అర్జునుడికి జీవన రహస్యం తెలిసింది.
జీవితం పురివిప్పిన నెమలిలాగా తనను పూర్తిగా లోకానికి చూపించదు. ఓపిగ్గా మెట్టు మెట్టు ఎక్కి చివరికి చేరుకోవాలి. ఈశ్వర భవనంలో ప్రవేశం వరకు జాగ్రత్తగా ఈ జీవితాన్ని కాపాడుకోవాలి. పరిణామ క్రమంలో ప్రతి జీవితం చాలా విలువైనదే. ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఈ నరావతారంలోకి వచ్చాం. రుషి సంప్రదాయం తెలుసుకోవాలి. పట్టుపట్టి జీవితాన్ని శుద్ధిచేసి పవిత్రీకరించుకోవాలి. ఎవరికి వారే తమ జీవితపు విలువ పెంచుకోవాలి.
ఆనందసాయి స్వామి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Arvind Kejriwal: బాబోయ్ మీకో నమస్కారం.. అంతా మీ దయ వల్లే జరిగింది: భాజపాకు కేజ్రీవాల్ కౌంటర్
-
World News
Israel: ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు!
-
Politics News
Dharmapuri Srinivas: అర్వింద్ దిగజారి వ్యవహరిస్తున్నారు: ధర్మపురి సంజయ్
-
India News
Bilkis Bano: బిల్కిస్ బానో పిటిషన్.. భావోద్వేగాలతో తీర్పు ఇవ్వలేం: సుప్రీం
-
Sports News
Virat - Anushka: మా ఇద్దరిలో విరాట్ డ్యాన్స్ అదరగొడతాడు: అనుష్క
-
General News
TTD: తితిదేకి రూ.3 కోట్ల జరిమానా.. చెల్లించామన్న సుబ్బారెడ్డి